Depurty CM
-
హజ్ యాత్రకు అదనపు సాయం: సీఎం జగన్‌కు ఎన్ఆర్ఐల కృతజ్ఞతలు
పవిత్రమైన హజ్ యాత్రకు వెళ్లే ముస్లింలకు అదనపు భారం పడకుండా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలబడడంపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎస్.బి. అంజాద్ బాషా హర్షం వ్యక్తం చేశారు. మైనారిటీల హజ్ యాత్రకు అదనపు సాయం అందిస్తూ ఏపీ సీఎం తీసుకున్న నిర్ణయానికి కృతజ్ఞతలు తెలిపారు. గురువారం దుబాయ్‌లో ఏపీఎన్ఆర్టీ ఆధ్వర్యంలో థాంక్యూ సీఎం కార్యక్రమాన్ని నిర్వహించినట్లు అంజాద్ బాషా ఒక ప్రకటనలో తెలిపారు. హజ్ యాత్రకు వెళ్లే వారికి విజయవాడ ఎంబార్గేషన్ ద్వారా ఒక్కొక్కరికి రూ. 80 వేల అదనపు ధరను సెంట్రల్ హజ్ కమిటీ, కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని తెలిసిన వెంటనే కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కేంద్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఇతర అధికారులను తనతో పాటు ఎంపీ మిధున్ రెడ్డి కలిశామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అన్నారు. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో ముఖ్యమంత్రి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లిన వెంటనే స్పందించిన సీఎం జగన్ ముస్లిమ్ సోదరులపై అదనపు భారం పడకుండా 80 వేల రూపాయల సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించేలా ఉత్తర్వులు జారీ చేశారన్నారు. రూ. 14.15 కోట్లు విడుదల చేసి ముస్లిం సోదరుల పక్షపాతిగా మరోసారి సీఎం రుజువు చేశారన్నారు. ఈ సమావేశంలో డా. భూ అబ్దుల్లా, కడప యువజన విభాగ అధ్యక్షులు షేక్ ఉమైర్ తదితరులు పాల్గొన్నారు. -
పదవి సరే.. పవరేది !
ఇంటి ముందు బోర్డు తగిలించుకునే రీతిలో పేరుకే డిప్యూటీ సీఎం పదవి అన్నట్టుగా మారింది పన్నీరు సెల్వం పరిస్థితి. ఐఏఎస్‌లు పలువురు సీఎం.. సీఎం అంటూ, డిప్యూటీ కోరల్ని కత్తిరించే పనిలో పడ్డట్టున్నారు. పన్నీరుకు పదవి ఇచ్చినా పవర్‌ను మాత్రం సీఎం పళని స్వామి తన గుప్పెట్లో ఉంచుకున్నట్టుగా సచివాలయంలో చర్చ సాగుతోంది. గత్యంతరం లేని పరిస్థితిలో పన్నీరు మౌనం పాటిస్తున్నా, ఆయన సేనల్లో మాత్రం సందిగ్ధత నెలకొనడం గమనార్హం. సాక్షి, చెన్నై : పురట్చి తలైవి శిబిరానికి నేతగా, మాజీ సీఎంగా పన్నీరు ప్రభంజనానికి హద్దే లేదని చెప్పవచ్చు. మీడియాల్లోనూ పతాక శీర్షికల్లో ఆయనే. అయితే, అమ్మ శిబిరంతో విలీనం తదుపరి పన్నీరు మూలనపడ్డారని చెప్పవచ్చు. ఇప్పుడు ఆయన చేతిలో డిప్యూటీ సీఎం పదవి ఉన్నా, పరిస్థితి మాత్రం అది అలంకారప్రాయం అన్నట్టుగా మారింది. ఆర్థిక, ప్రణా ళిక, అసెంబ్లీ వ్యవహారాలు, గృహ నిర్మాణం, పట్టణాభివృద్ధి వంటి శాఖలు చేతిలో ఉన్నా, కీలక నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితిలో పన్నీరు ఉన్నట్టుగా సంకేతాలు వెలువడుతున్నాయి. అధికారాలకు కళ్లెం దివంగత నేతలు ఎంజీయార్, అమ్మ జయలలిత తదుపరి అన్నాడీఎంకేకి అన్నీ తానే అన్నట్టుగా సీఎం పళని స్వామి దూకుడు సాగుతున్న విషయం తెలిసిందే. విలీనం రూపంలో పన్నీరును అక్కున చేర్చుకున్నా, ఉప ప్రధాన కార్యదర్శి దినకరన్ రూపంలో చిక్కులు ఎదురైనా, పళని మాత్రం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. అమ్మ తరహాలో ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవడంలో వెనక్కు తగ్గడం లేదని చెప్పవచ్చు. అదే సమయంలో డిప్యూటీ పళని స్వామి, తనను అధిగమించకుండా జాగ్రత్తల్లోనూ ఉన్నట్టున్నారు. ఇందుకు అద్దం పట్టే పరిణామాలు గత కొద్ది రోజులుగా సచివాలయంలో ఆవిష్కరించినట్టుగా చర్చ జోరందుకుంది. వ్యవహారాలన్నీ పళని డైరెక్షన్లోనే సాగుతున్నట్టుగా చర్చ తెర మీదకు వచ్చింది. పురట్చి తలైవి శిబిరంతో ముందుకు సాగినప్పుడు, తనకు వ్యతిరేకంగా దూకుడు ప్రదర్శించిన అధికారులను, ప్రస్తుతం తన చుట్టూ నియమించి ఉండడాన్ని పన్నీరు జీర్ణించుకోలేకున్నట్టు సమాచారం. పదవి చేతిలోకి రాగానే, కొందరి భరతం పట్టే రీతిలో పన్నీరు నిర్ణయాలు తీసుకున్నా, అందుకు పళని మోకాలొడ్డి ఉండడం గమనార్హం. తన సన్నిహిత అధికారుల్ని చుట్టూ నియమించుకునేందుకు తగ్గ ప్రణాళికను సిద్ధం చేసినా, అందుకు ఆమోద ముద్ర పడని దృష్ట్యా, పన్నీరు తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్టు సమాచారం. నామినేటెడ్ పదవుల్లోనే.. అనేక నామినేటెడ్ పోస్టుల్లో తన మద్దతుదారుల్ని నియమించేందుకు పన్నీరు చర్యలు చేపట్టినా, ఆ ఫైల్‌ను తీసుకెళ్లిన అధికారులు, సీఎం చాంబర్‌కే పరిమితం చేసి ఉండడం ఆలోచించాల్సిందే. పదవి చేతికి ఇచ్చిన పవర్ కట్ చేసి ఉండడాన్ని పన్నీరు మౌనంగా భరిస్తున్నా, ఆయన మద్దతుదారులు మాత్రం తీవ్రంగానే పరిగణిస్తున్నారని చెప్పవచ్చు. అయితే, గత్యంతరం లేని పరిస్థితి కాబట్టి, అన్నీ మౌనంగా భరించాల్సిందేనని సేనలకు పన్నీరు సూచిస్తున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఇక, పన్నీరుకు ఎదురవుతున్న సమస్యల్లో ఆయన శిబిరానికి చెందిన మంత్రి పాండియరాజన్‌కు కూడా తప్పనట్టు సమాచారం. ప్రభుత్వ వ్యవహారాల పరంగా కొందరు అధికారులు, ఈ ఇద్దర్ని ఖాతరు చేయడం లేదని సమాచారం. అధికారుల దాటవేత పదే పదే సీఎం.. సీఎం అంటూ అధికారులు దాటవేతతో, పరోక్షంగా బెదిరింపు ధోరణితో ముందుకు సాగుతున్నట్టుగా సచివాలయంలో చర్చ జోరందుకుని ఉండడం గమనార్హం. సచివాలయంలోనే పరిస్థితి ఇలా ఉంటే, పార్టీ పరంగా పన్నీరుకు సంకటం ఎదురవుతున్నట్టు సమాచారం. అందుకే గత కొద్ది రోజులుగా ఎంజీయార్ శత జయంతి వేడుకల వేదికల్లో పన్నీరు మౌనంగా, అంటీముట్టనట్టు ఉంటున్నట్టు ప్రచారం. పార్టీ నిర్వాహక కమిటీలో పదిహేను మంది సభ్యుల ఎంపికలో పన్నీరుకు చాన్స్ ఇవ్వకుండా పళని ముందుకు సాగుతుండడమే ఇందుకు నిదర్శనంగా చర్చ ఊపందుకుంది. -
క్రీస్తు ప్రేమను పంచాలి
క్లాక్‌టవర్(మహబూబ్‌నగర్): రాష్ట్రంలో క్రైస్తవుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని డిప్యూటీ సీఎం మహమూద్ అలీ అన్నారు. తెలంగాణ అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తామన్నారు. బుధవారం రాత్రి జిల్లాకేంద్రంలోని ఎంబీసీ చర్చి ఆవరణలో రెవ.వరప్రసాద్ అధ్యక్షతన నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకలను ఆయన కేక్‌కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. క్రైస్తవుల సమస్యలు ఏమిటో తమకు తెలుసునన్నారు. క్రైస్తవులకు క్రీస్తుప్రేమను లోకమంతా పంచాలన్నారు. విద్యుత్‌శాఖ మంత్రి డాక్టర్ సి.లక్ష్మారెడ్డి మాట్లాడుతూ..శాంతి సమాధానాలతో పండుగను జరుపుకోవడం క్రైస్తవులకే సాధ్యమన్నారు. దేవుడి ఆశీర్వాదంతోనే ఈరోజు మీముందు ఉన్నానని అన్నారు. క్రైస్తవుల అభివృద్ధికి మంత్రిగా తనవంతు కృషిచేస్తానని హామీఇచ్చారు. అనంతరం మంత్రి జూపల్లి కృష్టారావు మాట్లాడుతూ.. క్రీస్తుప్రేమ వర్ణించలేదని, విశ్వాసులంతా క్రీస్తును పోలి నడుచుకోవడం అభినందనీయమన్నారు. లోకమంతా ప్రేమను పంచుతూ రాణించాలన్నారు. క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. పార్లమెంటరీ కార్యదర్శి వి.శ్రీనివాసగౌడ్ మాట్లాడుతూ.. ప్రేమతో నడుచుకోవడం క్రైస్తవులకే సాధ్యమన్నారు. క్రైస్తవుల పట్ల తనకు ఎనలేని అభిమానం ఉందన్నారు. వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషిచేస్తానన్నారు. ప్రణాళిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్.నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుత లోకంలో శాంతి సమాధానాలు కరువడంతో అన్యాయాలు, అక్రమాలు పెరిగిపోయాయని అన్నారు. వాటిని అధిగమించేందుకు ప్రార్థించాలన్నారు. అనంతరం అలంపూర్ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ మాట్లాడుతూ.. 20 ఏళ్లుగా ఈమందిరంలో ప్రార్థనలు చేశా.. దేవుడు అంచెలంచెలుగా ఆశీర్వదించి ఇప్పుడు ఎమ్మెల్యే స్థాయికి తీసుకొచ్చాడని గుర్తుచేశారు. అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాల్‌రాజ్ మాట్లాడుతూ.. చిన్నప్పట్నుంచి సండేస్కూల్కి వెళ్లేవాడిని, బైబిల్‌పై తనకు పూర్తిగా విశ్వాసం ఉందన్నారు. నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్‌రెడ్డి మాట్లాడుతూ.. క్రైస్తవులు ప్రతి ఒక్కరి పట్ల ప్రేమను పంచాలన్నారు. జెడ్పీచైర్మన్ బండారి బాస్కర్ మాట్లాడుతూ.. మూటలు మూసే తనను దేవుడు ఈస్థితికి తీసుకొచ్చాడన్నారు. కలెక్టర్ జీడీ ప్రియదర్శిని మాట్లాడుతూ.. ఈ లోకంలో ప్రజలు బాధలు, ఆవేదనలో కూరుకుపోయి ఉన్నారని, వీటి నుంచి విముక్తి కల్పించడం యేసుక్రీస్తు ప్రభువుకే సాధ్యమన్నారు. అనంతరం జేసీ ఎల్.శర్మన్, ఏజేసీ డాక్టర్ రాజారాం తదితరులు మాట్లాడారు. క్రైస్తవులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో ఎంబీసీ వైస్ చైర్మన్ బీఏ పురుషోత్తం, కార్యదర్శి జోసెఫ్, కౌన్సిల్ నేతలు, అధికసంఖ్యలో క్రైస్తవులు పాల్గొన్నారు.