ఇంటి ముందు బోర్డు తగిలించుకునే రీతిలో పేరుకే డిప్యూటీ సీఎం పదవి అన్నట్టుగా మారింది పన్నీరు సెల్వం పరిస్థితి. ఐఏఎస్‌లు పలువురు సీఎం.. సీఎం అంటూ, డిప్యూటీ కోరల్ని కత్తిరించే పనిలో పడ్డట్టున్నారు. పన్నీరుకు పదవి ఇచ్చినా పవర్‌ను మాత్రం సీఎం పళని స్వామి తన గుప్పెట్లో ఉంచుకున్నట్టుగా సచివాలయంలో చర్చ సాగుతోంది. గత్యంతరం లేని పరిస్థితిలో పన్నీరు మౌనం పాటిస్తున్నా, ఆయన సేనల్లో మాత్రం సందిగ్ధత నెలకొనడం గమనార్హం.
సాక్షి, చెన్నై : పురట్చి తలైవి శిబిరానికి నేతగా, మాజీ సీఎంగా పన్నీరు ప్రభంజనానికి హద్దే లేదని చెప్పవచ్చు. మీడియాల్లోనూ పతాక శీర్షికల్లో ఆయనే. అయితే, అమ్మ శిబిరంతో విలీనం తదుపరి పన్నీరు మూలనపడ్డారని చెప్పవచ్చు. ఇప్పుడు ఆయన చేతిలో డిప్యూటీ సీఎం పదవి ఉన్నా, పరిస్థితి మాత్రం అది అలంకారప్రాయం అన్నట్టుగా మారింది. ఆర్థిక, ప్రణా ళిక, అసెంబ్లీ వ్యవహారాలు, గృహ నిర్మాణం, పట్టణాభివృద్ధి వంటి శాఖలు చేతిలో ఉన్నా, కీలక నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితిలో పన్నీరు ఉన్నట్టుగా సంకేతాలు వెలువడుతున్నాయి.
అధికారాలకు కళ్లెం
దివంగత నేతలు ఎంజీయార్, అమ్మ జయలలిత తదుపరి అన్నాడీఎంకేకి అన్నీ తానే అన్నట్టుగా సీఎం పళని స్వామి దూకుడు సాగుతున్న విషయం తెలిసిందే. విలీనం రూపంలో పన్నీరును అక్కున చేర్చుకున్నా, ఉప ప్రధాన కార్యదర్శి దినకరన్ రూపంలో చిక్కులు ఎదురైనా, పళని మాత్రం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. అమ్మ తరహాలో ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవడంలో వెనక్కు తగ్గడం లేదని చెప్పవచ్చు. అదే సమయంలో డిప్యూటీ పళని స్వామి, తనను అధిగమించకుండా జాగ్రత్తల్లోనూ ఉన్నట్టున్నారు. ఇందుకు అద్దం పట్టే పరిణామాలు గత కొద్ది రోజులుగా సచివాలయంలో ఆవిష్కరించినట్టుగా చర్చ జోరందుకుంది.
వ్యవహారాలన్నీ పళని డైరెక్షన్‌లోనే సాగుతున్నట్టుగా చర్చ తెర మీదకు వచ్చింది. పురట్చి తలైవి శిబిరంతో ముందుకు సాగినప్పుడు, తనకు వ్యతిరేకంగా దూకుడు ప్రదర్శించిన అధికారులను, ప్రస్తుతం తన చుట్టూ నియమించి ఉండడాన్ని పన్నీరు జీర్ణించుకోలేకున్నట్టు సమాచారం. పదవి చేతిలోకి రాగానే, కొందరి భరతం పట్టే రీతిలో పన్నీరు నిర్ణయాలు తీసుకున్నా, అందుకు పళని మోకాలొడ్డి ఉండడం గమనార్హం. తన సన్నిహిత అధికారుల్ని చుట్టూ నియమించుకునేందుకు తగ్గ ప్రణాళికను సిద్ధం చేసినా, అందుకు ఆమోద ముద్ర పడని దృష్ట్యా, పన్నీరు తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్టు సమాచారం.
నామినేటెడ్ పదవుల్లోనే..
అనేక నామినేటెడ్ పోస్టుల్లో తన మద్దతుదారుల్ని నియమించేందుకు పన్నీరు చర్యలు చేపట్టినా, ఆ ఫైల్‌ను తీసుకెళ్లిన అధికారులు, సీఎం చాంబర్‌కే పరిమితం చేసి ఉండడం ఆలోచించాల్సిందే. పదవి చేతికి ఇచ్చిన పవర్ కట్ చేసి ఉండడాన్ని పన్నీరు మౌనంగా భరిస్తున్నా, ఆయన మద్దతుదారులు మాత్రం తీవ్రంగానే పరిగణిస్తున్నారని చెప్పవచ్చు. అయితే, గత్యంతరం లేని పరిస్థితి కాబట్టి, అన్నీ మౌనంగా భరించాల్సిందేనని సేనలకు పన్నీరు సూచిస్తున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఇక, పన్నీరుకు ఎదురవుతున్న సమస్యల్లో ఆయన శిబిరానికి చెందిన మంత్రి పాండియరాజన్‌కు కూడా తప్పనట్టు సమాచారం. ప్రభుత్వ వ్యవహారాల పరంగా కొందరు అధికారులు, ఈ ఇద్దర్ని ఖాతరు చేయడం లేదని సమాచారం.
అధికారుల దాటవేత
పదే పదే సీఎం.. సీఎం అంటూ అధికారులు దాటవేతతో, పరోక్షంగా బెదిరింపు ధోరణితో ముందుకు సాగుతున్నట్టుగా సచివాలయంలో చర్చ జోరందుకుని ఉండడం గమనార్హం. సచివాలయంలోనే పరిస్థితి ఇలా ఉంటే, పార్టీ పరంగా పన్నీరుకు సంకటం ఎదురవుతున్నట్టు సమాచారం. అందుకే గత కొద్ది రోజులుగా ఎంజీయార్ శత జయంతి వేడుకల వేదికల్లో పన్నీరు మౌనంగా, అంటీముట్టనట్టు ఉంటున్నట్టు ప్రచారం. పార్టీ నిర్వాహక కమిటీలో పదిహేను మంది సభ్యుల ఎంపికలో పన్నీరుకు చాన్స్ ఇవ్వకుండా పళని ముందుకు సాగుతుండడమే ఇందుకు నిదర్శనంగా చర్చ ఊపందుకుంది.