సాక్షి, చైన్నె: ఓ సామాన్యుడి న్యాయం పోరాటం ఎంపీ పదవి కోల్పోయే పరిస్థితులను ఎదుర్కొంటున్న మాజీ సీఎం పన్నీరు సెల్వం తనయుడు రవీంద్రనాథ్‌కు కొత్త చిక్కు వచ్చి పడింది. గత కొన్ని నెలలుగా తనకు లైంగిక వేధిస్తున్నారంటూ ఆయనపై బుధవారం డీజీపీ శంకర్ జివ్వాల్ కార్యాలయంలో చైన్నెకు చెందిన గాయత్రి దేవి ఫిర్యాదు చేశారు. ఇందులో 2014లో బంధువుల వివాహ సమయంలో పన్నీరు సెల్వం కుటుంబ సభ్యులతో తన కుటుంబానికి పరిచయం ఏర్పడినట్టు ఆమె పేర్కొన్నారు.
అనంతరం మీడియాతో ఆమె మాట్లాడుతూ, పన్నీరు సెల్వం ఫ్యామిలీ, తమ ఫ్యామిలీ అందరం ఒకే కుటుంబం తరహాలో మెలిగే వాళ్లమని పేర్కొన్నారు. అయితే గత ఏడాది చివరి నుంచి పన్నీరు సెల్వం తనయుడు రవీంద్రనాథ్ రూపంలో తనకు వేధింపులు మొదలయ్యాయని ఆరోపించారు.
ఆయన్ని తన సొంత అన్నయ్య లాగా భావించానని, ఆ విధంగానే ఆయనతో మెలిగానని పేర్కొన్నారు. అయితే, ఆయన మిత్రుడు ఒక రోజు ఫోన్ చేసి రవీంద్రనాథ్‌కు తానంటే ఎంతో ఇష్టం అని తెలియజేశాడని, సహకరిస్తే రాణిలా ఉంటావు.. లేకుంటే చంపేస్తామని బెదిరించినట్టు తెలిపారు. తొలుత ఈ బెదిరింపును తాను పెద్దగా పట్టించుకోలేదని, అయితే, ఓ రోజు మద్యం తాగని తనతో అసభ్యకరంగా రవీంద్రనాథ్ ఫోన్‌లో మాట్లాడడం ఆవేదనకు గురి చేసిందన్నారు.
రోజూ తనను తీవ్ర వేధింపులకు గురి చేస్తున్నారని ఫలితంగా రాత్రుల్లో నిద్ర లేకుండా చేస్తున్నారని ఆరోపించారు. అన్నగా భావించిన వ్యక్తి తనపై ఆశ పడుతుండడం గురించి ఆయన కుటుంబ సభ్యుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం తనకు బెదిరింపులు పెరిగాయని, ఆందోళనతోనే పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు ఆమె వాపోయారు.
Comments
Please login to add a commentAdd a comment