deputations cancel
-
ఆరోగ్యశాఖలో డిప్యుటేషన్లు రద్దు
సాక్షి, అమరావతి: వైద్య, ఆరోగ్యశాఖలో డిప్యుటేషన్లను రద్దుచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు చర్యలు ప్రారంభించింది. వారం రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వారీగా డిప్యుటేషన్లపై లెక్కలు తీసింది. ఆరువేల మందికిపైగా డిప్యుటేషన్ల మీద ఉన్నట్లు తేలింది. 54 మంది వైద్యులైతే ఏళ్ల తరబడి విధులకే హాజరు కావటంలేదని తెలిసింది. నిబంధనలకు విరుద్ధంగా ఏళ్ల తరబడి.. అవసరం మేరకు ప్రభుత్వం డాక్టర్‌ను నియమిస్తుంది. కానీ.. కారణాలేమైనా ఆ డాక్టర్ మరోచోట విధులు నిర్వర్తిస్తుంటారు. డిప్యుటేషన్‌పై ఏళ్ల తరబడి అక్కడే కొనసాగుతుంటారు. అవసరమైన చోట పోస్టు భర్తీలోనే ఉంటుంది కానీ ప్రజలకు వైద్యసేవలు అందవు. పనిచేస్తున్నది ఒక చోట, వేతనం మరోచోట ఇదీ తంతు. కొంతమంది డాక్టర్లయితే అవసరం లేకపోయినా సొంత ఊళ్లో ప్రాక్టీస్ కోసమని డిప్యుటేషన్ తెచ్చుకుంటున్నారు. ఉదాహరణకు కడపలో ఉద్యోగంలో ఉన్న ఒక పీడియాట్రిక్ వైద్యుడు.. డిప్యుటేషన్ మీద విశాఖపట్నంలో కొనసాగుతుంటారు. ఇలాంటివి కొన్నయితే.. జూనియర్ అసిస్టెంట్లు, స్టాఫ్ నర్సులు వేలల్లో ఉన్నారు. డీఎంహెచ్‌వోలే డిప్యుటేషన్లు ఇచ్చి ఇష్టారాజ్యంగా వ్యవహరించినట్టు తేలింది. ఏళ్ల తరబడి నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న డిప్యుటేషన్ల వ్యవహారంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ అవకతవకలపై వైద్య ఆరోగ్యశాఖ దృష్టిపెట్టింది. దీంతోపాటు ఇటీవల ముఖ్యమంత్రి స్వయంగా డిప్యుటేషన్లు రద్దుచేయాలని చెప్పినట్టు సమాచారం. దీంతో.. నిబంధనలకు విరుద్ధంగా డిప్యుటేషన్ కాలం పూర్తయినా కొనసాగుతున్న వారి డిప్యుటేషన్‌ను తక్షణమే రద్దు చేయనున్నారు. రెండు వారాల్లోగా తమ ఒరిజినల్ పోస్టింగ్‌లో చేరాలని ఆదేశించనున్నారు. డిప్యుటేషన్ల పేరుతో కొందరు యూనియన్ నాయకులు ఉద్యోగుల నుంచి డబ్బు వసూలు చేస్తున్నట్టు కూడా ఆరోపణలున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో అవసరం మేరకు సడలింపు రాష్ట్రంలోని ఏడు ఐటీడీఏ ప్రాంతాల్లో అవసరాన్ని బట్టి సడలింపు ఇవ్వనున్నారు. కొత్తగా ఏర్పాటైన పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలకు పోస్టులు మంజూరుకాని చోట డిప్యుటేషన్లు కొనసాగిస్తారు. వైద్యసేవలకు, అత్యవసర సేవలకు విఘాతం కలుగుతుందన్న పరిస్థితుల్లోను మినహాయింపు ఇవ్వనున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్నవన్నీ రద్దు చాలామంది ఏళ్ల తరబడి డిప్యుటేషన్‌పై ఉన్నారు. వాస్తవానికి అక్కడ వారిసేవలు నామమాత్రం. అలాంటి వారి డిప్యుటేషన్లు రద్దుచేస్తాం. వీటిమీద పూర్తిగా సమీక్షిస్తున్నాం. ప్రభుత్వం నుంచి డిప్యుటేషన్ తెచ్చుకున్న వారు కాకుండా, విభాగాధిపతులే (హెచ్వోడీలు) డిప్యుటేషన్లు ఇచ్చారు. ఇది కరెక్టు కాదు. వ్యవస్థలకు ఇబ్బంది కలుగుతుందంటేనే కొనసాగిస్తాం. లేదంటే డిప్యుటేషన్లన్నీ రద్దుచేస్తాం. – ముద్దాడ రవిచంద్ర, ముఖ్య కార్యదర్శి, వైద్య ఆరోగ్యశాఖ -
ఎక్కడివాళ్లు అక్కడే
సాక్షి, అమరావతి: వైద్య ఆరోగ్యశాఖలో గత సర్కారు ఇష్టారాజ్యంగా డెప్యుటేషన్లు, బదిలీలు చేయడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో నూతన ప్రభుత్వం కీలకనిర్ణయం తీసుకుంది. ఈ శాఖలో డెప్యుటేషన్లు రద్దు చేయాలని నిర్ణయించారు. వందల సంఖ్యలో డాక్టర్లు, స్టాఫ్ నర్సులు, తదితరులు పోస్టింగ్‌లు ఒకచోట, పనిచేస్తున్నది మరోచోట కావటంతో ఎక్కడ ఎవరు పనిచేస్తున్నారు? ఎన్ని ఖాళీలున్నాయి? అన్నది తెలియడంలేదు. వైద్యులు మిస్‌మ్యాచింగ్ (తన స్పెషాలిటీ కాకపోయినా అందులో కొనసాగడం) పోస్టుల్లో కొనసాగుతుండటంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సైకియాట్రిస్ట్ పని ప్లాస్టిక్ సర్జన్ మెడికల్ కళాశాలల్లో చాలామంది అసోసియేట్ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్లు డెప్యుటేషన్లపై కొనసాగుతున్నారు. అనంతపురం, శ్రీకాకుళం, ఒంగోలు, నెల్లూరు తదితర బోధనాసుపత్రుల్లో పనిచేయాల్సిన చాలామంది వైద్యులు కాకినాడ, విశాఖపట్నం, కర్నూలు, విజయవాడ తదితర చోట్ల ఉన్నట్టు తేలింది. సైకియాట్రీ ప్రొఫెసర్ పనిచేయాల్సిన చోట ప్లాస్టిక్ సర్జన్ పనిచేస్తున్నారన్న ఫిర్యాదులు వచ్చాయి. వివిధ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు కూడా జిల్లా కేంద్రాల్లో డెప్యుటేషన్లమీద కొనసాగుతున్నారు. రోగులకు ఇబ్బంది కలగకూడదనే... డెప్యుటేషన్లన్నిటినీ రద్దుచేసి వారికి ఎక్కడ పోస్టింగ్ ఉందో తక్షణమే అక్కడకు పంపించాలని వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శికి ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఆదేశాలు వెళ్లాయి. ఎక్కడ పనిచేయాలో వాళ్లను అక్కడకు పంపించి ఖాళీలెన్ని ఉన్నాయి, అదనంగా ఎంతమందిని నియమించాలన్న వివరాలు సర్కారుకు పంపించాలని సీఎంఓ కార్యాలయం ఆదేశించింది. దీనిపై ముఖ్యమంత్రి అదనపు ప్రధాన కార్యదర్శి డా. పీవీ రమేష్ ‘సాక్షి’తో మాట్లాడుతూ రోగులకు ఇబ్బంది కలగకుండా చూడాలని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. సుజాతారావు అధ్యక్షతన ఏర్పాటైన నిపుణుల కమిటీ సైతం వైద్యుల కొరతపై పలు సిఫార్సులు చేసిందని ఆయన చెప్పారు. -
ఆ టీచర్ల డిప్యుటేషన్లు ఇక రద్దు
హైదరాబాద్: ప్రజాప్రతినిధుల దగ్గర వ్యక్తిగత సహాయకులు(పీఏ), వ్యక్తిగత కార్యదర్శులు(పీఎస్)గా పనిచేస్తున్న టీచర్లందరి డిప్యుటేషన్లను ప్రభుత్వం రద్దు చేసింది. వారిని తక్షణమే రిలీవై మాతృశాఖలో విద్యా బోధన కార్యక్రమాలు నిర్వర్తించాలని ఆదేశించింది. సాధారణ పరిపాలన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి లింగరాజ్ పాణిగ్రాహి ఈమేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ‘ఎమ్మెల్యేలు, మంత్రుల దగ్గర పీఏలు, పీఎస్లుగా టీచర్లను డిప్యుటేషన్‌పై పంపడం ఏమాత్రం సమంజసం కాదు. ఒకవేళ ఎవరైనా ప్రజాప్రతినిధుల దగ్గర టీచర్లు విధులు నిర్వర్తిస్తున్న పక్షంలో వారిని తక్షణమే వెనక్కు పంపి విద్యాబోధన విధులకు వినియోగించాలి’ అని ఈనెల 13వ తేదీన సుప్రీంకోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం టీచర్ల డిప్యుటేషన్లను రద్దు చేసింది. ‘ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మంత్రులు, జిల్లా పరిషత్ ఛైర్పర్సన్లు తదితర ప్రజాప్రతినిధుల దగ్గర పీఏలు, పీఎస్లుగా పనిచేస్తున్న టీచర్ల డిప్యుటేషన్లను సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రద్దు చేశాం. తక్షణమే వారంతా అక్కడి నుంచి రిలీవై మాతశాఖలో చేరి విద్యా బోధన విధులు నిర్వర్తించాలి. ఈ దిశగా కలెక్టర్లు, జిల్లా విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేయాలి’ అని లింగరాజ్ పాణిగ్రాహి జారీ చేసిన ఉత్తర్వులో పేర్కొన్నారు. టీచర్లను రిలీవ్ చేసిన ప్రజాప్రతినిధులు నిబంధనల ప్రకారం సీనియర్ అసిస్టెంట్ కేడర్‌లోని ఉద్యోగులను పీఏలుగా ఎంపిక చేసుకోవాలని అందులో సూచించారు.