
సాక్షి, అమరావతి: వైద్య, ఆరోగ్యశాఖలో డిప్యుటేషన్లను రద్దుచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు చర్యలు ప్రారంభించింది. వారం రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వారీగా డిప్యుటేషన్లపై లెక్కలు తీసింది. ఆరువేల మందికిపైగా డిప్యుటేషన్ల మీద ఉన్నట్లు తేలింది. 54 మంది వైద్యులైతే ఏళ్ల తరబడి విధులకే హాజరు కావటంలేదని తెలిసింది.
నిబంధనలకు విరుద్ధంగా ఏళ్ల తరబడి..
అవసరం మేరకు ప్రభుత్వం డాక్టర్‌ను నియమిస్తుంది. కానీ.. కారణాలేమైనా ఆ డాక్టర్ మరోచోట విధులు నిర్వర్తిస్తుంటారు. డిప్యుటేషన్‌పై ఏళ్ల తరబడి అక్కడే కొనసాగుతుంటారు. అవసరమైన చోట పోస్టు భర్తీలోనే ఉంటుంది కానీ ప్రజలకు వైద్యసేవలు అందవు. పనిచేస్తున్నది ఒక చోట, వేతనం మరోచోట ఇదీ తంతు. కొంతమంది డాక్టర్లయితే అవసరం లేకపోయినా సొంత ఊళ్లో ప్రాక్టీస్ కోసమని డిప్యుటేషన్ తెచ్చుకుంటున్నారు. ఉదాహరణకు కడపలో ఉద్యోగంలో ఉన్న ఒక పీడియాట్రిక్ వైద్యుడు.. డిప్యుటేషన్ మీద విశాఖపట్నంలో కొనసాగుతుంటారు. ఇలాంటివి కొన్నయితే.. జూనియర్ అసిస్టెంట్‌లు, స్టాఫ్ నర్సులు వేలల్లో ఉన్నారు.
డీఎంహెచ్‌వోలే డిప్యుటేషన్లు ఇచ్చి ఇష్టారాజ్యంగా వ్యవహరించినట్టు తేలింది. ఏళ్ల తరబడి నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న డిప్యుటేషన్ల వ్యవహారంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ అవకతవకలపై వైద్య ఆరోగ్యశాఖ దృష్టిపెట్టింది. దీంతోపాటు ఇటీవల ముఖ్యమంత్రి స్వయంగా డిప్యుటేషన్లు రద్దుచేయాలని చెప్పినట్టు సమాచారం. దీంతో.. నిబంధనలకు విరుద్ధంగా డిప్యుటేషన్ కాలం పూర్తయినా కొనసాగుతున్న వారి డిప్యుటేషన్‌ను తక్షణమే రద్దు చేయనున్నారు. రెండు వారాల్లోగా తమ ఒరిజినల్ పోస్టింగ్‌లో చేరాలని ఆదేశించనున్నారు. డిప్యుటేషన్ల పేరుతో కొందరు యూనియన్ నాయకులు ఉద్యోగుల నుంచి డబ్బు వసూలు చేస్తున్నట్టు కూడా ఆరోపణలున్నాయి.
ఏజెన్సీ ప్రాంతాల్లో అవసరం మేరకు సడలింపు
రాష్ట్రంలోని ఏడు ఐటీడీఏ ప్రాంతాల్లో అవసరాన్ని బట్టి సడలింపు ఇవ్వనున్నారు. కొత్తగా ఏర్పాటైన పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలకు పోస్టులు మంజూరుకాని చోట డిప్యుటేషన్‌లు కొనసాగిస్తారు. వైద్యసేవలకు, అత్యవసర సేవలకు విఘాతం కలుగుతుందన్న పరిస్థితుల్లోను మినహాయింపు ఇవ్వనున్నారు.
నిబంధనలకు విరుద్ధంగా ఉన్నవన్నీ రద్దు
చాలామంది ఏళ్ల తరబడి డిప్యుటేషన్‌పై ఉన్నారు. వాస్తవానికి అక్కడ వారిసేవలు నామమాత్రం. అలాంటి వారి డిప్యుటేషన్లు రద్దుచేస్తాం. వీటిమీద పూర్తిగా సమీక్షిస్తున్నాం. ప్రభుత్వం నుంచి డిప్యుటేషన్ తెచ్చుకున్న వారు కాకుండా, విభాగాధిపతులే (హెచ్‌వోడీలు) డిప్యుటేషన్లు ఇచ్చారు. ఇది కరెక్టు కాదు. వ్యవస్థలకు ఇబ్బంది కలుగుతుందంటేనే కొనసాగిస్తాం. లేదంటే డిప్యుటేషన్లన్నీ రద్దుచేస్తాం.
– ముద్దాడ రవిచంద్ర, ముఖ్య కార్యదర్శి, వైద్య ఆరోగ్యశాఖ
Comments
Please login to add a commentAdd a comment