పకడ్బందీగా ‘పది’ పరీక్షలు
హాజరుకానున్న 1.16 లక్షల మంది విద్యార్థులు
సెంటర్ల వద్ద 144 సెక్షన్ అమలు జిల్లా విద్యాధికారి రమేశ్
పకడ్బందీగా ‘పది’ పరీక్షలు
వికారాబాద్ రూరల్: పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపట్టామని జిల్లా విద్యాధికారి రమేశ్ అన్నారు. వికారాబాద్‌లోని మేరి ఏ నాట్స్ పాఠశాలలో సోమవారం ఆయన ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. పదో తరగతి పరీక్షల నిర్వహణపై చ ర్చించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ.. ఈ నెల 21వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభమవుతాయని స్పష్టంచేశారు. ఉదయం 9.30 గంటలకు పరీక్ష మొదలవుతుందని తెలిపారు.
మొత్తం 1.16 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నట్లు వివరించారు. సెంటర్ల వద్ద మౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్యత పాఠశాల ప్రధానోపాధ్యాయులదేనని పేర్కొన్నారు. సెంటర్ వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని, పాఠశాలల ఆవరణలోకి ఎవరినీ అనుమతించవద్దని సూచించారు. సెంటర్ల వద్ద విధిగా తాగునీటి సౌకర్యం కల్పించాలని ఆదేశించారు. ఇన్విజిలేటర్లపై ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు. ప్రజాప్రతినిధులు, మీడియాను సెంటర్ల లోపలికి అనుమతించొద్దని తెలిపారు. విద్యార్థులు అరగంట ముందే పరీక్ష కేంద్రానికి వచ్చేలా చూడాలని తెలిపారు. విద్యార్థులు, ఉపాధ్యాయులెవరూ సెల్ఫోన్లు తీసుకురాకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈఓ హరిశ్చందర్నాయక్, ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.