పెన్ను పట్టలే.. ఫైలు ముట్టలే..!
⇒ప్రభుత్వ శాఖల్లో స్తంభించిన పాలన
⇒కొనసాగిన ఉద్యోగుల నిరసన
ఇందూరు(నిజామాబాద్ అర్బన్) : జిల్లా పరిపాలన రెండో రోజు కూడా స్తంభించింది. బోధన్‌లో నీటిపారుదల శాఖ డిప్యూటీ ఈఈ గంగాధర్‌ను బోధన్ ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడు అబిద్ అసభ్య పదజాలంతో దూషించినందుకు నిరసనగా అబిద్‌పై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ టీఎన్జీవోస్ ఆధ్వర్యంలో ఉద్యోగులు రెండో రోజు మంగళవారం పెన్‌డౌన్ చేపట్టారు. కలెక్టరేట్లోని జిల్లా కేంద్రంలో ఉన్న అన్ని శాఖలకు చెందిన అన్ని కేడర్ల ఉద్యోగులు ఉదయం వారి వారి కార్యాలయాలకు హాజరై పనులు చేయకుండా నిరసనను తెలిపారు. అనంతరం ప్రగతిభవన్ ఎదుట మధ్యాహ్నం వరకు ధర్నా చేపట్టారు. దీంతో ఏ ఒక్క శాఖలో కూడా పెన్ను, ఫైలు కదల్లేదు. పరిపాలన వ్యవస్థ మొత్తం స్తంభించింది.
కార్యాలయాలన్ని ఉద్యోగుల్లేక వెలవెలబోయాయి. ధర్నాలో టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు అలుక కిషన్ మాట్లాడుతూ.. ఇరిగేషన్ డిప్యూటీ ఈఈని అసభ్యకరంగా, అవమానించే విధంగా మాట్లాడిన బోధన్ ఎమ్మెల్యే ముఖ్య అనుచరుడు అబిద్‌ను వెంటనే పోలీసులు అరెస్టు చేయాలన్నారు. సంఘటనపై ఒక్క ప్రజాప్రతినిధి కూడా స్పందించకపోవడం బాధకరమన్నారు. దుర్బాషలాడిన అబిద్‌ను కాపాడేందుకు బోధన్ ఎమ్మెల్యే ప్రయత్నాలు చేయడం సరికాదని ఆరోపించారు. ఉద్యోగులు కావాలో... అనుచరులు కావాలో తేల్చుకోవాల్సిన సమయం వచ్చిం దన్నారు. మండల కేంద్రాల్లో కూడా పెన్‌డౌన్ నిరసన కార్యక్రమాలను చేపట్టి ఉధృతం చేస్తామన్నారు.
నిరసన కార్యక్రమంలో టీఎన్జీవోస్ కార్యదర్శి సతీష్, ట్రెజరీ ఉద్యోగుల సంఘం నాయకులు కిషన్, రెవెన్యూ ఉద్యోగుల సం ఘం నాయకులు రమణ్‌రెడ్డి, వార్డెన్ల సంఘం జిల్లా అధ్యక్షుడు రాజా గంగారాం, అన్ని శాఖల ఉద్యోగులు, డ్రైవర్స్, నాల్గవ తరగతి ఉద్యోగ సంఘాలు పాల్గొన్నారు.