స్వాతంత్య్ర దిన వేడుకల సందర్భంగా నగరం ఖాకీమయం
నగరం ఖాకీమయమైంది. ఎక్కడా చూసినా పోలీసులే దర్శనమిస్తున్నారు. స్వాతంత్య్ర దిన వేడుకల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఉండేందుకు భారీ భద్రత ఏర్పాటుచేశారు. దాడులు చేస్తామన్న ఉగ్రవాద సంస్థల హెచ్చరికలతో అప్రమత్తమైన పోలీసులు నగరంలోని ప్రవేశ ద్వారాలు, నిష్ర్కమణ ద్వారాల వద్ద డేగ కళ్లతో పహారా కాస్తున్నారు. టోల్ నాకాలతోపాటు చెక్ నాకాలవద్ద ట్రక్కులు, టెంపోలు సహా కార్లు, ద్విచక్రవాహనాలను తనిఖీ చేస్తున్నారు. అనుమానాస్పద వ్యక్తులను విచారిస్తున్నారు. పూర్తి వివరాలు తెలుసుకున్నాకే నగరంలోకి అనుమతినిస్తున్నారు. ప్రధాన రహదారులు, జంక్షన్లు మొదలుకుని చిన్న గల్లీలో కూడా పోలీసులను మోహరించారు. ఇందుకోసం నగర పోలీసు శాఖ అదనంగా ప్రైవేటు సెక్యూరిటీ గార్డులు, హోంగార్డుల సాయం తీసుకుంటుంది.
మంత్రాలయ వద్ద నిషేధాజ్ఞలు
స్వాతంత్య్ర దినోత్సవం రోజున మంత్రాలయ భవనంపై ఉగ్రవాదులు దాడులకు పాల్పడే అవకాశాలున్నాయని నిఘా వర్గాలు హెచ్చరించడంతో పోలీసు శాఖ మరింత అప్రమత్తమైంది. దక్షిణ ముంబైలో పారాగ్లైడింగ్, రిమోట్ కంట్రోల్ మైక్రోలైట్, ఎయిర్ క్రాఫ్ట్‌లను గురువారమంతా నిషేధించారు. ఈ పరికరాల ద్వారా దాడులకు పాల్పడే అవకాశాలుండడంతో మంత్రాలయ పరిసరప్రాంతంలో వీటిని నిషేధించారు. నియమాలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసు శాఖ హెచ్చరించింది. ఏటా మంత్రాలయ భవనం ఆవరణలో జరిగే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు మంత్రులు, ఇతర కీలకమైన వ్యక్తులు, మిలీటరి, నేవీ, ఎయిర్ పోర్స్ దళాల అధికారులు, నగరవాసులు హాజరవుతారు. దీన్ని అదునుగా చేసుకుని ఉగ్రవాదులు పారాగ్లైడింగ్, ఎయిర్ క్రాఫ్ట్, రిమోట్ కంట్రోల్ మైక్రోలైట్ ద్వారా మంత్రాలయపై దాడులకు పాల్పడే అవకాశముంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని మెరైన్ డ్రైవ్, ఆజాద్‌మైదాన్, డి.బి.మార్గ్, కఫ్ పరేడ్, కొలాబా పోలీసు స్టేషన్ల హద్దులో పారాగ్లైడింగ్, రిమోట్ కంట్రోల్ మైక్రోలైట్, ఎయిర్ కాఫ్ట్లను నిషేధించినట్లు డిప్యూటీ పోలీసు కమిషనర్ కేశవ్ పాటిల్ చెప్పారు.