deputy thasildar posts
-
అమ్మ కోరిక
భర్త పోలీస్ డిపార్ట్మెంట్లో సర్కిల్ ఇన్స్పెక్టర్, తనకూ ఉద్యోగం ఉంది. జీవితంలో దక్కినవి చాలనుకుంది ఝాన్సీ. కానీ ఆమె తల్లి.. కూతురు రాజీ పడడానికి ఒప్పుకోలేదు. తల్లి కోరిక నెరవేర్చడానికి ఝాన్సీ ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించింది. అక్టోబర్ 24, గురువారం. గ్రూప్ 2 పరీక్ష రాసిన ఐదు లక్షలకు పైగా ఆశావహులు రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నారు. ఆ రోజు సాయంత్రం ఐదున్నరకు భర్తకు ఫోన్ చేసింది ఝాన్సీ. ‘‘ఈ రోజు మా రిజల్ట్స్ వెబ్సైట్లో పెడతారట’’ అని క్లుప్తంగా చెప్పింది. ఆర్టీసీ కార్మికుల సమ్మె కారణంగా బందోబస్తు డ్యూటీలో ఉన్నాడతడు. ‘‘స్వీట్స్‌తో వస్తా’’ అన్నాడు. ‘‘రిజల్ట్స్ చూసుకున్న తర్వాత తెచ్చుకోవచ్చు. మీరు మామూలుగా రండి’’ అని ఫోన్ పెట్టేసింది ఝాన్సీ. ఏడు గంటలకు స్వీట్స్‌తో వచ్చాడతడు. ఏడుంబావుకి ‘‘వెబ్సైట్ ఓపెన్ అవుతోందమ్మా’’ అని అరిచినంత పని చేసింది కూతురు మనస్విని. కంప్యూటర్ ముందు కొద్దిసేపు ఉత్కంఠ. ‘‘టెన్షన్ వద్దు నీ పేరు ఉంటుంది’’ ధైర్యం చెప్పింది ఝాన్సీ తల్లి స్వరూప. పేరు కనిపించగానే పిల్లలిద్దరూ సంతోషంతో కేకలు పెట్టారు. ‘‘అమ్మా అన్ని పేర్లు ఉన్నాయి. నీ పేరు కనిపించకపోయేటప్పటికి భయమేసింది’’ తల్లిని చుట్టుకుపోయాడు తన్మయ్. డిప్యూటీ తాసిల్దారు ఉద్యోగానికి సెలెక్ట్ అయింది ఝాన్సీ! ‘‘దీపావళి మనింటికి ముందుగానే వచ్చింది’’ అని పిల్లలు గోల చేశారు. స్వీట్లు పంచుకున్నారందరూ. టెన్త్ ఫైనల్ ఎగ్జామ్స్ ఈ ఆనంద క్షణాలు ఆమెకి నల్లేరు మీద నడకలాగ రాలేదు. ఝాన్సీ పుట్టింది, పెరిగింది సూర్యాపేట జిల్లా, హుజూర్‌నగర్‌లో. పదవ తరగతి ఫైనల్ పరీక్షలు రాస్తున్నప్పుడు ‘ఇది కాదు పరీక్ష’ అంటూ జీవితం మరో పరీక్ష పెట్టింది. పొలానికి వెళ్లి వస్తున్న నాన్న ఎడ్లబండి తిరగబడడంతో ప్రాణాలు కోల్పోయాడు. కన్నీళ్లను దిగమింగుకుని మిగిలిన పరీక్షలు రాసి ఫస్ట్ క్లాస్‌లో పాసయింది ఝాన్సీ. డాక్టర్ కావాలనే ఆమె కోరిక తండ్రితోపాటే దూరమైపోయింది. అయినా ఆశ చంపుకోలేక బైపీసీలో చేరింది. మేనత్త సలహాతో నర్స్ ట్రైనింగ్‌లో చేరింది. జీవితం నిర్దేశించిన మలుపును స్వీకరించక తప్పని పరిస్థితి. ట్రైనింగ్ పూర్తయిన తర్వాత నర్స్‌గా ఉద్యోగంలో చేరింది. 2004 నుంచి 2011 వరకు హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్ హాస్పిటల్లో ఉద్యోగం. భర్త పోలీస్ డిపార్ట్మెంట్లో సర్కిల్ ఇన్స్పెక్టర్, తనకూ ఉద్యోగం ఉంది. జీవితంలో దక్కినవి చాలనుకుంది ఝాన్సీ. కానీ జీవితంతో కూతురు రాజీ పడడానికి ఆమె తల్లి ఒప్పుకోలేదు. ‘‘మాకు చదువులేదు, మిమ్మల్ని పట్టుపట్టి చదివించాను. గవర్నమెంట్ ఉద్యోగం తెచ్చుకో, మీ నాన్న సంతోష పడతాడు’’ అని పరీక్షలు రాయించింది. అప్పుడు ఝాన్సీ తొమ్మిదో నెల గర్భిణి. మహేశ్వరం గవర్నమెంట్ హాస్పిటల్లో ఉద్యోగంలో చేరేటప్పుడు కూడా తోడు వెళ్లింది తల్లి స్వరూప. చదువుకుంటావా! ఝాన్సీ చిన్నప్పటి నుంచి ఫస్ట్ ర్యాంకు స్టూడెంట్. గొప్ప లక్ష్యాలను కూడా పెట్టుకుంది. అయితే అవేవీ కార్యరూపం దాల్చలేదు. జీవితం ఎన్ని పరీక్షలు పెట్టినా ఆమెలో చదువుకోవాలనే కోరిక కూడా సజీవంగానే ఉండడాన్ని గమనించాడామె భర్త. ‘‘చదువుకుంటావా, ఉద్యోగం మానేసి చదువుకో’’ అని భరోసా ఇచ్చాడు. ఆమె మాత్రం ఉద్యోగం మానకుండానే డిస్టెన్స్ ఎడ్యుకేషన్‌లో గ్రాడ్యుయేషన్ చేసి, కాంపిటీటివ్ పరీక్షలకు ప్రిపేరైంది. గ్రూప్స్ పరీక్షల కోసం హైదరాబాద్ నగరానికి వచ్చి రూమ్ తీసుకుని రోజుకు పదహారు గంటలు చదువుతున్న కొత్తతరంతో పోటీ పడింది. తల్లి కోరుకున్న హోదా గలిగిన ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించింది. ‘నర్స్‌గా తీసుకుంటున్న జీతం కంటే తక్కువ జీతంతో ఈ ఉద్యోగంలో ఎందుకు చేరుతున్నావ’నే ప్రశ్న ఆమెకు తాను పని చేసిన హాస్పిటల్ సహోద్యోగుల నుంచి మాత్రమే కాకుండా ఇంటర్వ్యూ బోర్డు నుంచి కూడా ఎదురైంది. అందరికీ ఆమె చెప్పే సమాధానం ఒక్కటే ‘‘ఇది మా నాన్న కల, మా అమ్మ పట్టుదల. జీతం తగ్గించుకుని డిప్యూటీ తాసిల్దారుగా చేరడానికి నాకేమీ కష్టంగా లేదు’’ అని. మంచి నర్స్‌గా పేషెంట్ల అభిమానాన్ని చూరగొన్నట్లే, కొత్త ఉద్యోగంలో కూడా మంచి అధికారిగా పేరు తెచ్చుకోవడమే తన కొత్త లక్ష్యం అన్నది ఝాన్సీ. – వాకా మంజులారెడ్డి ఫొటోలు: బి.రాకేశ్ పిల్లలకు ఒక ఫోన్ కాల్ ఉదయం పిల్లలతోపాటు బయటపడితే తిరిగి ఇల్లు చేరడానికి రాత్రి తొమ్మిదయ్యేది. మధ్యాహ్నం రెండు వరకు మహేశ్వరంలో డ్యూటీ చేసుకుని నేరుగా హైదరాబాద్‌లోని ఆర్సీ రెడ్డి స్టడీ సర్కిల్‌కి వెళ్లేదాన్ని. రాత్రి ఎనిమిది వరకు క్లాసులు చూసుకుని ఇంటికి చేరడానికి ఆ టైమ్ పట్టేది. సాయంత్రం ఒకసారి ఇంటికి ఫోన్ చేసి పిల్లలతో మాట్లాడేదాన్ని. పిల్లల హోమ్ వర్క్ తప్ప నాకు మరే బాధ్యత లేకుండా అన్నీ అమ్మే చూసుకునేది. ఇల్లు చేరిన తర్వాత ఆ రోజు క్లాసులో చెప్పినవాటిని రివిజన్ చేసుకోవాలి. ఒక్కోసారి రాత్రి పూర్తి కాకపోతే ఉదయం డ్యూటీకి వెళ్లేటప్పుడు బస్‌లో కూర్చుని పాఠాలు గుర్తు చేసుకుంటూ పాయింట్స్ నోట్ చేసుకునే దాన్ని. సన్డే ఆ వారంలో సిలబస్ మొత్తం రివిజన్ పూర్తి చేస్తూ రావడంతో నాకు ఉద్యోగం చేస్తూ పరీక్షలకు ప్రిపేర్ కావడం కష్టం అనిపించలేదు. మా అమ్మ పట్టుపట్టడం, మావారు ప్రోత్సహించడంతోనే మళ్లీ చదవగలిగాను. నా మీద నాకంటే వాళ్లకే నమ్మకం ఎక్కువ. – ఝాన్సీ దొంతిరెడ్డి -
డిప్యూటీ తహసీల్దార్ అభ్యర్థి గాడిద..!!
శ్రీనగర్ : ఎవరినైనా తిట్టాలంటే గాడిద..! అనే పదానికి ఇంకా ఏవేవో జతచేసి వారి దుమ్ము దులుపుతాం. ఇక సరదా సంభాషణల్లో గాడిద గుడ్డు..! అనే పద ప్రయోగం కూడా ఉంది. ఎందుకంటే మనం గాడిదకు అంత అల్ప ప్రాధాన్యం ఇస్తాం. కానీ.. జమ్మూ కశ్మీర్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్ (ఎస్ఎస్బీ) గాడిదకు గొప్ప గౌరవాన్ని ఇచ్చింది. డిప్యూటీ తహసీల్దార్ పరీక్షలో పోటీ పడేందుకు గాడిదకు హాల్ టికెట్ జారీ చేసింది. అభ్యర్థి పేరు ‘కచౌర్ ఖర్’ (గోధుమ రంగు గాడిద) అంటూ, హాల్ టికెట్‌పై గాడిద ఫోటోని కూడా ముద్రించి నవ్వులపాలైంది. ఈ వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఎస్ఎస్బీ నిర్వాకంపై ట్విటర్, ఫేస్‌బుక్‌లలో కామెంట్ల వర్షం కురుస్తోంది. వేలకు వేలు జీతాలు తీసుకోవడమే కాకుండా అధికారుల అలసత్వం వల్ల గాడిదలకు పరీక్షలు నిర్వహించే స్థాయికి ఎస్ఎస్బీ చేరిందంటూ ఒక నెటిజన్ ఘాటైన ట్వీట్ చేశాడు. ఎస్ఎస్బీ చర్యలు నవ్వు తెప్పిస్తోంది. అది గాడిదకి హాల్ టికెట్ జారీ చేయడం ఒక విడ్డూరమైతే.. ఆ వార్త వైరల్ కావడం మరో విడ్డూరమంటూ ఫేస్బుక్లో మరో వ్యక్తి తన అసహనం వ్యక్తం చేశాడు. కాగా, ఈ ఘటనపై స్పందించేందుకు ఎస్ఎస్బీ అధికారులు నిరాకరించారు. సాంకేతిక పొరపాటు వల్ల ఇలాంటి తప్పిదమే గతంలోనూ చోటు చేసుకుంది. 2015లో ఒక కామన్ ఎంట్రన్స్ టెస్ట్ కోసం ఎస్ఎస్బీ ఆవు పేరిట హాల్ టికెట్ జారీ చేసింది. దానిపై విమర్శలు వెల్లువెత్తడంతో తన సర్వర్ నుంచి ఆవు పేరుతో నమోదైన అప్లికేషన్‌ను తొలగించింది. -
తమ్ముళ్ల బది‘లీలలు’
సాక్షి ప్రతినిధి, నెల్లూరు : తెలుగు తమ్ముళ్లు వసూళ్ల వేట మొదలుపెట్టారు. బదిలీలకు, నియామకాలకు రేట్లు పెట్టి మరీ వసూళ్లు చేస్తున్నారు. పార్టీ నియమాలకు కట్టుబడి ఉన్న వారు ఉన్నా, మధ్యలో వచ్చిన కార్యకర్తలు, నాయకులు ఈ వసూళ్లు చేపడుతున్నారు. రాష్ట్రంలో దాదాపు పదేళ్ల తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో తమ్ముళ్లు తమ చేతివాటం చూపేందుకు సిద్ధమవుతున్నారు. జిల్లావ్యాప్తంగా బదిలీలకు సంబంధించి, సిఫారసు లేఖలు ఇప్పిస్తామని చెబుతున్నారు. నగర పాలక సంస్థకు చెందిన ఒక ఉన్నతాధికారిని బదిలీ చేయించి, ఆయన స్థానంలో మరో ఉన్నతాధికారిని నియమించేందుకు భారీ మొత్తంలో వసూలు చేసినట్లు తెలిసింది. దాదాపు రూ.10లక్షల వరకు ఆ అధికారి తెలుగు తమ్ముళ్లకు ముట్టజెప్పినట్లు తెలిసింది. ప్రస్తుతం రాయలసీమలో ఉన్న ఓ ఉన్నతాధికారి సొంత జిల్లాకు మార్పించుకునే యత్నంలో భాగంగా తెలుగు తమ్ముళ్లను ఆశ్రయించినట్లు తెలిసింది. భారీ ఎత్తున చేతులు మారడంతో ఆ ఉన్నతాధికారికి బదిలీ దాదాపు ఖరారయినట్లు సమాచారం. ఇదిలా ఉండగా, పౌరసరఫరాల శాఖలో డిప్యూటీ తహసీల్దార్ పోస్టులకు గాను సిఫారసు లేఖలు ఇప్పించే పనుల్లో వారు ప్రస్తుతం బిజీగా ఉన్నారు. ఈ పదవీ కాలం మూడేళ్లుకాగా, జిల్లాలో దాదాపు 18 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు సమాచారం. ఈ పదవుల కోసం దాదాపు రూ.3 లక్షల వరకు డిమాండు చేస్తున్నట్లు తెలిసింది. ఈ పదవులను ఆశించే వారు ఎమ్మెల్యేలు, మంత్రులతో పాటు, టీడీపీ చెందిన ముఖ్యమైన నాయకుల ద్వారా సిఫారసు లేఖలు పొందుతున్నారు. ఈ లేఖలను టైప్ చేసి ఇవ్వడానికి నేతల వ్యక్తిగత సహాయకులు రూ.50 వేలు తీసుకుంటున్నట్లు తెలిసింది. ఇప్పటికే ఈ పదవుల్లో ఉండి రెండేళ్లు పూర్తయిన వారు కూడా, తాజా నియామకాల కోసం సిఫారసు చేసుకుంటున్నట్లు తెలిసింది. ఇవికాకుండా ఇంకా కొన్ని నామినేటెడ్ పోస్టుల వ్యవహారంలో జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు కీలకపాత్ర పోషిస్తున్నారు. నామినేటెడ్ పోస్టులు ఆశించే వారి నుంచి బహిరంగంగానే భారీగా వసూళ్లకు పాల్పడుతున్నారు. తాము ఎన్నికలకు ఎక్కువ నిధులను ఖర్చుచేయాల్సి వచ్చిందని, దీంతో వసూళ్లు తప్పవని చెబుతున్నట్లు తెలిసింది. ఒకేసారి పంచాయతీ, మునిసిపల్, సాధారణ ఎన్నికలు రావడంతో తమ వద్ద ఉన్న నిధులన్నీ ఖర్చయ్యాయని, దీంతో వసూళ్లు చేయక తప్పడం లేదని అంటున్నారని సమాచారం. ఉద్యోగులు బదిలీల కోసం, నాయకులు పదవుల కోసం నిధులు సమకూర్చడంలో వెనుకంజ వేయడం లేదు. అవసర మైతే ఇద్దరు, ముగ్గురు ఎమ్మెల్యేల దగ్గర సిఫారసు లేఖలు పొంది, తమ పదవులను, బదిలీలను ఖరారు చేసుకుంటున్నారు. ఒక ఉద్యోగి పౌరసరఫరాల శాఖ డిప్యూటీ తహసీల్దార్ పదవి కోసం ఏడు సిఫారసు లేఖలు తీసుకుని వచ్చి, జిల్లా కలెక్టరు కార్యాలయంలో అందజేసినట్లు తెలిసింది. పదవుల కోసం ఎంత ఖర్చయినా పెట్టడానికి నాయకులు వెనుకాడటం లేదు. అదేవిధంగా తెలుగు తమ్ముళ్లు వసూళ్లకు తగ్గడం లేద ని ఆపార్టీ నాయకులు చెప్పుకుంటున్నారు.