సాక్షి ప్రతినిధి, నెల్లూరు : తెలుగు తమ్ముళ్లు వసూళ్ల వేట మొదలుపెట్టారు. బదిలీలకు, నియామకాలకు రేట్లు పెట్టి మరీ వసూళ్లు చేస్తున్నారు. పార్టీ నియమాలకు కట్టుబడి ఉన్న వారు ఉన్నా, మధ్యలో వచ్చిన కార్యకర్తలు, నాయకులు ఈ వసూళ్లు చేపడుతున్నారు. రాష్ట్రంలో దాదాపు పదేళ్ల తర్వాత
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో తమ్ముళ్లు తమ చేతివాటం చూపేందుకు సిద్ధమవుతున్నారు. జిల్లావ్యాప్తంగా బదిలీలకు సంబంధించి, సిఫారసు లేఖలు ఇప్పిస్తామని చెబుతున్నారు. నగర పాలక సంస్థకు చెందిన ఒక ఉన్నతాధికారిని బదిలీ చేయించి, ఆయన స్థానంలో మరో ఉన్నతాధికారిని నియమించేందుకు భారీ మొత్తంలో వసూలు చేసినట్లు తెలిసింది. దాదాపు రూ.10లక్షల వరకు ఆ అధికారి తెలుగు తమ్ముళ్లకు ముట్టజెప్పినట్లు తెలిసింది. ప్రస్తుతం రాయలసీమలో ఉన్న ఓ ఉన్నతాధికారి సొంత జిల్లాకు మార్పించుకునే యత్నంలో భాగంగా తెలుగు తమ్ముళ్లను ఆశ్రయించినట్లు తెలిసింది.
భారీ ఎత్తున చేతులు మారడంతో ఆ ఉన్నతాధికారికి బదిలీ దాదాపు ఖరారయినట్లు సమాచారం. ఇదిలా ఉండగా, పౌరసరఫరాల శాఖలో డిప్యూటీ తహసీల్దార్ పోస్టులకు గాను సిఫారసు లేఖలు ఇప్పించే పనుల్లో వారు ప్రస్తుతం బిజీగా ఉన్నారు. ఈ పదవీ కాలం మూడేళ్లుకాగా, జిల్లాలో దాదాపు 18 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు సమాచారం. ఈ పదవుల కోసం దాదాపు రూ.3 లక్షల వరకు డిమాండు చేస్తున్నట్లు తెలిసింది. ఈ పదవులను ఆశించే వారు ఎమ్మెల్యేలు, మంత్రులతో పాటు, టీడీపీ చెందిన ముఖ్యమైన నాయకుల ద్వారా సిఫారసు లేఖలు పొందుతున్నారు. ఈ లేఖలను టైప్ చేసి ఇవ్వడానికి నేతల వ్యక్తిగత సహాయకులు రూ.50 వేలు తీసుకుంటున్నట్లు తెలిసింది.
ఇప్పటికే ఈ పదవుల్లో ఉండి రెండేళ్లు పూర్తయిన వారు కూడా, తాజా నియామకాల కోసం సిఫారసు చేసుకుంటున్నట్లు తెలిసింది. ఇవికాకుండా ఇంకా కొన్ని నామినేటెడ్ పోస్టుల వ్యవహారంలో జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు కీలకపాత్ర పోషిస్తున్నారు. నామినేటెడ్ పోస్టులు ఆశించే వారి నుంచి బహిరంగంగానే భారీగా వసూళ్లకు పాల్పడుతున్నారు. తాము ఎన్నికలకు ఎక్కువ నిధులను ఖర్చుచేయాల్సి వచ్చిందని, దీంతో వసూళ్లు తప్పవని చెబుతున్నట్లు తెలిసింది. ఒకేసారి పంచాయతీ, మునిసిపల్, సాధారణ ఎన్నికలు రావడంతో తమ వద్ద ఉన్న నిధులన్నీ ఖర్చయ్యాయని, దీంతో వసూళ్లు చేయక తప్పడం లేదని అంటున్నారని సమాచారం.
ఉద్యోగులు బదిలీల కోసం, నాయకులు పదవుల కోసం నిధులు సమకూర్చడంలో వెనుకంజ వేయడం లేదు. అవసర మైతే ఇద్దరు, ముగ్గురు ఎమ్మెల్యేల దగ్గర సిఫారసు లేఖలు పొంది, తమ పదవులను, బదిలీలను ఖరారు చేసుకుంటున్నారు. ఒక ఉద్యోగి పౌరసరఫరాల శాఖ డిప్యూటీ తహసీల్దార్ పదవి కోసం ఏడు సిఫారసు లేఖలు తీసుకుని వచ్చి, జిల్లా కలెక్టరు కార్యాలయంలో అందజేసినట్లు తెలిసింది. పదవుల కోసం ఎంత ఖర్చయినా పెట్టడానికి నాయకులు వెనుకాడటం లేదు. అదేవిధంగా తెలుగు తమ్ముళ్లు వసూళ్లకు తగ్గడం లేద ని ఆపార్టీ నాయకులు చెప్పుకుంటున్నారు.
తమ్ముళ్ల బది‘లీలలు’
Published Wed, Aug 27 2014 3:10 AM | Last Updated on Sat, Sep 2 2017 12:29 PM
Advertisement
Advertisement