అసెంబ్లీకి హాజరుకావాలని డీఈఆర్సీ చైర్మన్‌కు స్పీకర్ ఆదేశం
సాక్షి, న్యూఢిల్లీ: అసెంబ్లీకి హాజరుకావాలని ఢిల్లీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (డీఈఆర్సీ) చైర్మన్‌ను స్పీకర్ ఆదేశించారు. రానున్న అసెంబ్లీ సమావేశాలకు హాజరై డీఈఆర్సీ చైర్మన్ పీడీ సుధాకర్ డిస్కంల పనితీరుపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలని స్పీకర్ రాంనివాస్‌గోయల్ బుధవారం ఆదేశించారు. నగరంలో విద్యుత్ వినియోగదారులకు అధిక బిల్లులు వస్తున్నాయని, మీటర్లు వేగంగా తిరుగుతున్నాయని పలువురు శాసనసభ్యులు ఆరోపించారు. విధానసభ సమావేశాలలో ఈ విషయంపై పలువురు ఎమ్మెల్యేలు గళం విప్పారు. అడ్డగోలుగా వ్యవహారిస్తున్న డిస్కంల ఆటకట్టించాలని వారు డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా స్పీకర్ రాం నివాస్ గోయల్ కూడా సమస్యపై తన అనుభవాలను పంచుకున్నారు. వేగంగా తిరిగే మీటర్లను కూడా డిస్కంలే తమ ల్యాబ్‌కి తీసుకెళ్లి తనిఖీ చేయడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. డిస్కంల పనితీరుపై తమ సందేహాలను తీర్చడం కోసం డీఈఆర్సీ చైర్మన్‌ను సభకు హాజరయ్యేలా చూడాలని సభ్యులు డిమాండ్ చేశారు. వీరి వాదనతో ఏకీభవించిన గోయల్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.