అనుమతులన్నీ ఆన్లైన్లోనే...
అన్ని పట్టణాభివృద్ధి సంస్థల్లో ‘గ్రీన్‌చానల్’
నెలాఖరు నుంచి ప్రారంభం:మంత్రి మహీధర్‌రెడ్డి
అనుమతుల జారీలో జాప్యం నివారణకు కొత్త సేవలు
సాక్షి, సిటీబ్యూరో: రాష్ట్రంలోని అన్ని పట్టణాభివృద్ధి సంస్థ (అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ)ల్లో నెలాఖరు నుంచి ‘గ్రీన్‌చానల్’ను అమలు చేయనున్నట్లు మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మహీధర్‌రెడ్డి ప్రకటించారు. లేఅవుట్లు, భవన నిర్మాణాల అనుమతుల్లో జాప్యానికి తావులేకుండా ఆన్లైన్ సేవలు అందించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. హైదరాబాద్ మహా నగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ)లో ‘గ్రీన్‌చానల్’ పేరిట ఏర్పాటు చేసిన పౌరసేవా కేంద్రాన్ని గురువారం మంత్రి మహీధర్‌రెడ్డి ప్రారంభించారు.
అనంతరం మాట్లాడుతూ ..దరఖాస్తుల పరిష్కారంలో హెచ్ఎండీఏ వైపు నుంచి జాప్యం జరిగితే, సిబ్బంది తమకు తాముగా స్వీయ జరిమానా విధించుకోవాలని, ఇది తన ఆదేశమని హెచ్చరించారు. గ్రీన్‌చానల్ విషయంలో గతంలో జరిగిన పొరపాట్లను సరిదిద్దుకోకపోతే మళ్లీ 2009 నాటి పరిస్థితే ఉత్పన్నమవుతుందన్నారు. రాష్ట్రంలోని అన్ని మున్సిపాల్టీల్లో ప్రస్తుతం ఆస్తిపన్ను మదింపు కార్యక్రమాన్ని మొదలు పెట్టామని, విద్యుత్తు పొదుపును అమలు చే స్తున్న వారికి, పర్యావరణ పరిరక్షణకు అనువుగా భవనాలు నిర్మించే వారికి ప్రత్యేక రాయితీలు ప్రకటించినట్లు మంత్రి తెలిపారు.
ఈ సందర్భంగా ఇరువురు సర్పంచులు మంత్రి వద్దకు వెళ్లి ఎల్ఆర్ఎస్, బీపీఎస్ చార్జీల్లో స్థానిక సంస్థలకు రావాల్సిన వాటా ఎందుకు ఇవ్వట్లేదని నిలదీశారు. సచివాలయంలో ప్రత్యేకంగా సమావేశమై చర్చిద్దామని సర్దిచెప్పారు. ఇందుకు మండలాల వారీగా సర్పంచులను ఆహ్వానించనున్నట్లు మంత్రి తెలిపారు. 2015 నాటికి గ్రీన్‌చానల్ పూర్తిస్థాయిలో విజయవంతమవ్వాలని మునిసిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.కె.జోషి ఆకాంక్షించారు. హెచ్ఎండీఏ కమిషనర్ నీరభ్‌కుమార్ ప్రసాద్ మాట్లాడుతూ ‘ఆస్కీ’ సహకారంతో భవిష్యత్‌లో అన్ని రకాల అనుమతులు ఆన్లైన్లో ఇచ్చేలా ప్లాన్ చేశామన్నారు.
ప్రస్తుతం లేఅవుట్ దరఖాస్తులను మాత్రమే గ్రీన్‌చానల్‌లో స్వీకరించి 7 రోజుల్లోగా ప్రాసెస్ పూర్తిచేసి ఆమోదమా/తిరస్కారమా అన్నది తేలుస్తామని, ఆపై నిర్ణీత రుసుము చెల్లిస్తే 30 రోజుల్లో అనుమతి పత్రాలు దరఖాస్తుదారు ఇంటికి చేరుస్తామన్నారు. మంత్రి మహీధర్‌రెడ్డి గ్రీన్‌చానల్ బ్రోచర్‌ను ఆవిష్కరించి, కాపీలను అధికారులకు అందజేశారు. కార్యక్రమంలో హెచ్ఎండీఏ కమిషనర్ నీరభ్‌కుమార్ ప్రసాద్, ఓఆర్ఆర్ పీడీ శామ్యూల్ ఆనంద్‌కుమార్, కార్యదర్శి బి.రామారావు, ప్లానింగ్ డెరైక్టర్ వెంకటరత్నం, క్రెడాయ్, అప్రెడా ప్రతినిధులు పాల్గొన్నారు. కాగా, వాస్తవానికి హెచ్ఎండీఏలో 2009లోనే గ్రీన్‌చానల్ ప్రారంభించారు. అయితే... పర్యవేక్షణ లోపం వల్ల అమలు కాలేదు. ఇప్పుడు లోపాలు సవరించుకొని మళ్లీ పునఃప్రారంభించారు.