కెన్యాలో డ్రగ్స్ కేసు: మమతాకులకర్ణి అరెస్టు!
ఒకప్పుడు బాలీవుడ్ తెరను ఏలిన అలనాటి హీరోయిన్ మమతా కులకర్ణిని, ఆమె భర్తను కెన్యాలో డ్రగ్స్ కేసులో అరెస్టు చేశారు. ఈ విషయాన్ని జాతీయ మీడియా వెల్లడించింది. కెన్యాలోని డ్రగ్స్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ, మొంబాసా పోలీసులు కలిసి సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్లో వీరిద్దరినీ అరెస్టు చేసినట్లు చెబుతున్నారు. 90ల కాలంలో బాలీవుడ్ హీరోయిన్గా వెలుగొందిన మమతా కులకర్ణి దాదాపు దశాబ్ద కాలం నుంచి మీడియాకు దూరంగా గడుపుతున్నారు. చిట్ట చివరి సారిగా దేవానంద్ తీసిన సెన్సార్ అనే సినిమాలో 2001లో ఆమె కనిపించారు.
దుబాయ్లో కొంతకాలం అజ్ఞాతంగా గడిపిన అనంతరం ఆమె నైరోబీకి వెళ్లిపోయారు. ఆమె స్నేహితుడు, అంతర్జాతీయ డ్రగ్స్ వ్యాపారి విజయ్ 'విక్కీ' గోస్వామితో కలిసి ఆమె దుబాయ్ వెళ్లినట్లు తొలుత కథనాలు వచ్చాయి. తర్వాత అతడిని పెళ్లిచేసుకుంది. విక్కీని పోలీసులు దుబాయ్లో 1997లో డ్రగ్స్ కేసులో అరెస్టుచేయగా, 25 ఏళ్ల జైలుశిక్ష పడింది. అతడిని చూసేందుకు మమత కూడా జైలుకు వెళ్లారు. అప్పట్లో తెల్లబడిపోయిన జుట్టు, కళ్లజోడుతో దుబాయి జైలుకు వెళ్లినప్పుడు ఆమెను అక్కడి మీడియా గుర్తుపట్టి ఫొటోలు ప్రచురించింది. అయితే.. సత్ప్రవర్తన కారణంగా విక్కీని గత నవంబర్ 15న విడుదల చేశారు. ఆ తర్వాతే వీళ్లిద్దరూ కలిసి నైరోబీకి వెళ్లిపోయినట్లు తెలిసింది. తాజాగా నైరోబీలో డ్రగ్స్ కేసులో భార్యాభర్తలు ఇద్దరినీ అక్కడి పోలీసులు అరెస్టుచేశారు.