వాళ్లు అలా చేసేవారా?!
రహస్యం
ప్రముఖుల జీవితాలను పుస్తకాల్లో చదివేసి మనకు వారి గురించి అన్నీ తెలుసనుకుంటాం. కానీ ఎంత పదిమందికీ తెలిసిన వ్యక్తికయినా కొన్ని రహస్యాలు ఉంటాయి. ఎవరికీ తెలియని అలవాట్లు ఉంటాయి. చరిత్రలో నిలిచిపోయిన కొందరు ప్రముఖుల అలవాట్లు ఎంత వింతగా ఉన్నాయో చూడండి...
డిటెక్టివ్ నవలలతో పాఠకులను ఉర్రూత లూగించిన రచయిత్రి అగాథా క్రిస్టీకి అటూ ఇటూ తిరుగుతూ రాయడం అలవాటు. టేబుల్ మీద కూర్చుని రాస్తే ఆలోచనలు వచ్చేవి కావట!
సిగ్మండ్ ఫ్రాయిడ్ తన బ్రష్కి తాను పేస్ట్ పెట్టుకునేవారు కాదట. ఆయన భార్యే ఆ పని చేసేదట. ఆ సమయం కూడా వృథా చేయకూడదన్న ఉద్దేశంతో మొదలైన ఈ పద్ధతి తర్వాత అలవాటుగా మారిపోయిందట!
జర్మన్ రచయిత ఫ్రాంజ్ కాఫ్కా ఏదైనా రచన మొదలు పెట్టేముందు, తర్వాత కిటికీ వద్ద నగ్నంగా నిలబడి వ్యాయామం చేసేవారట. అలా చేస్తే శరీరంతో పాటు మనసు కూడా ఉత్తేజితమవుతుందని అనేవారట. రచన ముగిసిన తరువాత అయితే పది నిమిషాలు ఎక్కువసేపు చేసేవారట!
ప్రముఖ సంగీతకారుడు బీతోవెన్కి కాఫీ తాగకపోతే క్షణం కూడా బుర్ర పని చేసేది కాదట. ఆయన రోజుకు యాభై కప్పులకు పైగా కాఫీ తాగేవారట!
ఏదైనా రచన చేయాలంటే ముందుగా స్టీఫెన్ కింగ్ ఓ చీజ్ కేక్ ముక్క తినాల్సిందే. అప్పుడే ఆయన పెన్ను కదిలేదట!
చార్లెస్ డికెన్స ఎప్పుడూ ఉత్తర దిక్కుకు అభిముఖంగా పడుకుని నిద్రించేవారట. అలా చేస్తే సృజనాత్మకత పెరుగుతుందని ఆయన నమ్మేవారట!
తెల్లకోటు వేసుకుని, తన పొట్ట నేలకి ఆనేలా పడుకుని రాసుకునేవారట జేమ్స్ జాయిస్. అంతేకాదు... నీలిరంగు పెన్సిల్తోనే రాసేవారట!
స్పానిష్ చిత్రకారుడు సాల్వెడార్ డాలీకి నిద్ర వస్తే... ఓ మెటల్ గిన్నెను నేలమీద పెట్టి కుర్చీలో వెనక్కి వాలేవాడు. చేతిలో ఓ స్పూన్ పట్టుకుని, దాన్ని గిన్నె దిశగా ఉంచి నిద్రకు ఉపక్రమించేవాడు. బాగా మత్తు వచ్చాక చెంచా జారి గిన్నె మీద పడినప్పుడు ఆ శబ్దానికి లేచి కూచునేవాడు. ఎందుకిదంతా అని ఎవరైనా అడిగితే... నాకు కాస్తంత నిద్ర సరిపోతుంది, అందుకే ఈ ఏర్పాటు అనేవాడట!