‘నో డిటెన్షన్’తో ప్రమాణాలు తగ్గడం అపోహే!
న్యూఢిల్లీ: పాఠశాలల్లో నో డిటెన్షన్ పాలసీతో విద్యా ప్రమాణాలు తగ్గిపోవడం కేవలం అపోహ మాత్రమేనని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్(ఐఐఎమ్), అహ్మదాబాద్ పరిశోధకులు అంకిత్ సరఫ్, కేతన్ ఎస్ దేశ్‌ముఖ్ ‘టు ఫెయిల్ ఆర్ నాట్ టు ఫెయిల్’ పేరిట ఈ అధ్యయనం నిర్వహించారు. దీనికిగానూ యాన్యువల్ సర్వే ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్స్(ఏఎస్ఈఆర్)లో 10ఏళ్ల పాటు నమోదైన డేటాను సేకరించి పరిశీలించారు.
అధ్యయన నివేదికను పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీతో పాటు దేశంలో నూతన విద్యా విధానాన్ని రూపొందించే ప్యానెల్‌కు అందించారు. నో డిటెన్షన్ పాలసీ అమలుచేయడం వల్ల విద్యార్థుల్లో నైపుణ్యాలు తగ్గిపోవట్లేదని వారు గుర్తించారు. పాఠశాలలో ఉత్తీర్ణులు కాని విద్యార్థులను అదే తరగతిలో ఉంచే డిటెన్షన్ విధానాన్ని వచ్చే విద్యాసంవత్సరం నుంచి అమలు చేస్తామని కేంద్ర మంత్రి మహేంద్రనాథ్ పాండే గత జూలైలో ప్రకటించిన విషయం తెలిసిందే.