అభివృద్ధే లక్ష్యం
నాణ్యత పాటించకుంటే చర్యలు
ప్రజల సహకారంతో రోడ్ల విస్తరణ
ఎమ్మెల్యే గంగుల కమలాకర్
కరీంనగర్ కార్పొరేషన్ : నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని, రానున్న రెండేళ్లలో రూపురేఖలు మారుస్తామని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. నగరపాలక కార్యాలయంలో మంగళవారం ఇంజినీరింగ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రోడ్ల దుస్థితిపై స్పందించిన ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ ఎన్ని కోట్లయినా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని, ఆర్అండ్బీ రోడ్లకు ఇప్పటికే రూ.46 కోట్లు మంజూరు చేశారని, మరో రూ.36 కోట్లకు రెండు రోజుల్లో జీవో విడుదల కానుందని పేర్కొన్నారు. ఈ నిధులతో రోడ్ల సుందరీకరణతోపాటు ఐలాండ్‌ను అందంగా తీర్చిదిద్దుతామని అన్నారు. కమాన్ నుంచి సదాశివపల్లికి రోడ్డు, అత్యాధునిక సస్పెన్షన్ బ్రిడ్జి కోసం రూ.77 కోట్లు మంజూరయ్యాయని, మరో రూ.70 కోట్లకు వారంరోజుల్లో జీవో వస్తుందని వెల్లడించారు. ప్రభుత్వం మున్సిపాలిటీలకు ఇచ్చే రూ.100 కోట్లలో రూ.25 కోట్లు మంజూరయ్యాయన్నారు. వీటిలో రూ.20 కోట్లు లింక్ రోడ్ల అభివృద్ధికి, రూ.5 కోట్లను కన్వెన్షన్ సెంటర్ నిర్మాణానికి వెచ్చిస్తామన్నారు. ఎస్సారార్ కళాశాలలో అసంపూర్తిగా వదిలిన మినీరవీంద్రభారతి స్థలంలో కన్వెన్షన్ నిర్మాణానికి రూ.15 కోట్ల వరకు ఖర్చు అవుతుందన్నారు.
అధికారుల పనితీరుపై సీరియస్...
సమావేశంలో ఇంజినీరింగ్ అధికారుల పనితీరుపై ఎమ్మెల్యే కమలాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 50 ఏళ్లలో జరగని అభివృద్ధి ప్రస్తుతం జరుగుతోందని, పనుల్లో నాణ్యత లోపిస్తే సహించేది లేదన్నారు. ప్రభుత్వ క్వాలిటీ కంట్రోల్ ద్వారా రోడ్లను కోర్‌కటింగ్ చేసి పరీక్షిస్తామన్నారు. నాణ్యతకు అధికారులే బాధ్యత వహించాలని, అవినీతికి పాల్పడితే క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు. ప్రతి రూపాయికి నాణ్యత కనబడేలా పనులు చేయాలని ఆదేశించారు.
రోడ్ల విస్తరణకు మతాలకతీతంగా సహకరించాలి
జనాభాకు అనుగుణంగా రోడ్ల విస్తరణ చేపట్టాల్సిన అవసరం ఉందని, మతాలకతీతంగా అందరూ సహకరించాలని కోరారు. సివిల్ ఆసుపత్రి వద్ద రెండు గుడులను ఇతర స్థలాల్లో ఏర్పాటు చేస్తున్నామన్నారు. భవిష్యత్ తరాల కోసం మంచిరోడ్లు వేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. నగరాన్ని సుందరంగా మార్చుకుందామని పిలుపునిచ్చారు. సమావేశంలో మేయర్ రవీందర్‌సింగ్, డిప్యూటీ మేయర్ గుగ్గిళ్లపు రమేశ్, కమిషనర్ కృష్ణభాస్కర్, కార్పొరేటర్లు ఏవీ రమణ, బోనాల శ్రీకాంత్, లంక రవీందర్, బండారి వేణు, నాయకులు కట్ల సతీష్, ఇంజినీరింగ్ విభాగం అధికారులు పాల్గొన్నారు.