పింఛన్ పోరు
హసన్‌పర్తి/ఖానాపురం/కేసముద్రం/స్టేషన్‌ఘన్‌పూర్ : పింఛన్ల కోసం దరఖాస్తుదారులు రోడ్డెక్కారు. హసన్‌పర్తి మండలం దేవన్నపేట శివారులోని సుబ్బయ్యపల్లిలో శనివారం నిరాహార దీక్ష చేపట్టారు. వివిధ రకాల పెన్షన్ల కోసం సుమారు 124 మంది దరఖాస్తు చేసుకోగా.. 24 మందికి మాత్రమే మంజూరయ్యూరుు. గతంలో తమ అందరికీ పింఛన్లు వచ్చాయని.. ఇప్పుడు తమకు ఇవ్వకుండా కొత్తవారికే ఇచ్చారని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విచారణ చేపట్టిన అధికారులు ఇక్కడికి వచ్చిసమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ జాతీయ కార్యవర్గ సభ్యుడు పుట్ట రవిమాదిగ తహసీల్దార్‌తో ఫోన్లో వాగ్వాదానికి దిగారు. ఇక్కడికి వచ్చి చూస్తే.. నిరాహార దీక్ష చేస్తున్న వారు అర్హులా... కారా... అనేది తెలుస్తోందన్నారు. పరిశీలించి న్యాయం చేస్తామని తహసీల్దార్ హామీ ఇచ్చారు. కాగా, పింఛన్ రాలేదనే బెంగతో గ్రామానికి చెందిన వృద్ధుడు ఎల్.శంకరయ్య శుక్రవారం రాత్రి కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించగా... స్థానికులు అడ్డుకున్నారు.
అదేవిధంగా ఖానాపురం మండలంలోని మంగళవారిపేటలో వికలాంగులు ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. కేసముద్రం మండలంలోని కాట్రపల్లి గ్రామంలో టీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. అర్హుల పట్ల ఈ ప్రభుత్వం వివక్ష చూపుతోందంటూ కాంగ్రెస్ నాయకులు ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. తమ నేత దిష్టిబొమ్మను ఎందుకు కాలబెడతారంటూ ఎంపీటీసీ భర్త సూరయ్య తదితరులు కాంగ్రెస్ నాయకులతో వాగ్వాదానికి దిగారు, ఒకదశలో ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. పోలీసులు రంగప్రవేశం చేయడంతో గొడవ సద్దుమణిగింది. కేసీఆర్ దిష్టిబొమ్మను దహం చేయడంపై టీఆర్ఎస్ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్టేషన్‌ఘన్‌పూర్ మండలంలోని పల్లగుట్టలో ఆసరా లేకపోవడంతో దరఖాస్తుదారులు గ్రామపంచాయతీ ఎదుట నిరసన తెలిపారు.