ఇక చాలు బాబోయ్..
ఉక్కు ఫ్యాక్టరీ.. పునాదికే పరిమితం !
సాక్షి ప్రతినిధి కడప: నాలుగేళ్లుగా ఎన్టీయే నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంలో టీడీపీ భాగస్వామ్య పార్టీ. కేంద్ర ప్రభుత్వంతో అధికారం పంచుకున్న టీడీపీ పెద్దలు, రాష్ట్రానికి హక్కుగా ప్రకటించిన పరిశ్రమలు నెలకొల్పడంలో నిర్లక్ష్యం ప్రదర్శించారు. కేంద్ర ప్రభుత్వంలో టీడీపీ భాగస్వామిగా ఉన్నన్నాళ్లు ఉక్కు ఫ్యాక్టరీ ఊసే ఎత్తని టీడీపీ, ఆపై నిరాహారదీక్ష నాటకం రక్తి కట్టించి ఎన్నికల గడువు సమీపించే కొద్దీ పునాది రాయికి పరిమితమైంది. టీడీపీ కేంద్రానికి మద్దతు ఉపసంహరించుకున్న అనంతరం రాజకీయ ఎత్తుగడలకు శ్రీకారం చుట్టింది. ఉక్కుఫ్యాక్టరీ పట్ల లేని చిత్తశుద్ధిని చూపుకునేందుకు అనేక యుక్తులు ప్రదర్శించింది.
పార్లమెంటులో ఉక్కుఫ్యాక్టరీ కోసం కనీసం ఒక్కమారైనా స్పందించని రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌తో నిరాహారదీక్ష చేయించింది. సీఎం చంద్రబాబుచే కడప జెడ్పీ ఆవరణంలో పైలాన్ ఆవిష్కరింపజేశారు. ఆ సందర్భంగా గత ఏడాది జూన్ 30న సీఎం చంద్రబాబు 2 నెలల్లో ఉక్కు పరిశ్రమ నెలకొల్పుతామని ప్రకటించారు. ఆనక గడువు పెంచుకుంటూ మాటలు చెప్పుకుంటూ డిసెంబర్ 27న మైలవరం మండలం కంబాలదిన్నె సమీపంలో ఉక్కుఫ్యాక్టరీ కోసం శంకుస్థాపన చేశారు.
నాడు గండికోట ప్రాజెక్టుదీ ఇదే పరిస్థితి..
చంద్రబాబు సర్కార్ అంటేనే కుయుక్తులకు ప్రాధాన్యత ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. తాజాగా ఉక్కుపరిశ్రమ నిర్ణయం కూడా అలాంటిదేనని పలువురు పేర్కొంటున్నారు. గతంలో సీఎంగా చంద్రబాబు నాయుడు జిల్లాలో గండికోట ప్రాజెక్టు నిర్మించేందుకు 1996 పార్లమెంటు ఎన్నికలకు మునుపు ఓమారు, 1998 పార్లమెంటు ఉప ఎన్నికలకు మునుపు మరోమారు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత కూడా అధికారంలో ఉన్న ఆయన గండికోట ప్రాజెక్టు నిర్మాణానికి ఏమాత్రం కృషి చేయలేదు. పైగా తన హయాంలో ‘అప్రాధాన్య’ ప్రాజెక్టుల జాబితాలోకి గండికోట ప్రాజెక్టును చేర్చారు.
2004లో ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖరరెడ్డి బాధ్యతలు తీసుకున్న తర్వాతే గండికోట ప్రాజెక్టు జీవం పోసుకుంది.రేయింబవళ్లు శరవేగంగా పనులు చేపట్టి ప్రాజెక్టును పూర్తి చేశారు. గండికోటతోపాటు నీళ్లు వచ్చేందుకు ప్రధాన వనరుగా ఉన్న పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ విస్తరణ పనులు చేపట్టారు. కడప వరకూ నీరు రావాలంటే 11వేల క్యూసెక్కుల సామర్థ్యంతో ఉన్న పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ను 44వేల క్యూసెక్కులకు విస్తరించారు. ఇవన్నీ చరిత్ర చెబుతున్న సత్యాలని విశ్లేషకులు వివరిస్తున్నారు చంద్రబాబు సర్కార్ అప్పట్లో గండికోట ప్రాజెక్టును ఎన్నికల ప్రచారానికి ఉపయోగించుకుందని, అచ్చం అలాగే తాజా ఉక్కు ఫ్యాక్టరీని ప్రచార అస్త్రంగా ఎంచుకుందని పరిశీలకులు వెల్లడిస్తున్నారు. మరో గండికోట పునాది రాయి లాగా ఉక్కు ఫ్యాక్టరీ పునాది రాయి కూడా నిలిచిపోతుందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.
టూరిజం సర్క్యూట్.. గాలి మాటలే!
కడప కల్చరల్ : ఒకటి కాదు..రెండు కాదు..దాదాపు 40 సార్లు జిల్లాకు వచ్చారు. వచ్చిన ప్రతిసారి జిల్లాను పర్యాటకంగా అద్భుతంగా తీర్చిదిద్దుతామని హామీలు గుప్పించారు. ఐదేళ్లు అలాగే సాగదీశారు. మొత్తం అరడజను పర్యాటక హబ్బులు ఏర్పాటు చేస్తానని వాగ్దానం చేశారు. అందులో ఏ ఒక్కటీ నెరవేర్చని ఘనతను మూటగట్టుకున్నారు. హామీలన్నీ ఉత్తుత్తి మాటలేనని, గాలి మూటలేనని మరోమారు నిరూపించుకున్నారు. ఆయనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఒంటిమిట్ట క్షేత్రాన్ని రాష్ట్రంలోనే నెంబర్ వన్‌గా తీర్చిదిద్దుతామన్నారు. కానీ అక్కడ ఇంతవరకు శాశ్వతంగా కల్యాణ పందిరి కూడా ఏర్పాటు చేయలేకపోయారు. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన అమెరికాలోని గ్రాండ్ క్యానియన్ తరహాలో అభివృద్ధి చేసి ప్రపంచ పర్యాటక పటంలో గండికోటకు ప్రత్యేక స్థానం లభించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
కానీ ఈ ఐదేళ్లలోస్థానిక పర్యాటక అభిమానులు, సంస్థలు గట్టిగా పట్టుబట్టడంతో మొక్కుబడిగా గండికోట వారసత్వ ఉత్సవాలను నిర్వహించారు. అంతకుమించి జిల్లాలో ఏ పర్యాటక ప్రాంతాన్నీ నామమాత్రంగా కూడా అభివృద్ధి చేయలేదు. జిల్లాలో టెంపుల్ టూరిజం కింద తిరుపతి నుంచి ఒంటిమిట్ట వరకు, హెరిటేజ్ టూరిజం పేరిట సిద్దవటం కోట, గండికోట, హెలీ టూరిజం పేరిట పెద్దదర్గా, జిల్లాలోని మరికొన్ని ప్రాంతాలు, పర్యాటక హబ్‌గా జిల్లాలో మూడు టూరిస్టు సర్క్యూట్లను ఏర్పాటు చేస్తామని వచ్చిన ప్రతిసారి ఊదరగొట్టారు. కానీ ఎక్కడా ఒక్క రూపాయి పని కూడా చేసిన దాఖలాలు లేవు. ఒకటి, రెండుచోట్ల ఆరంభ శూరత్వం ప్రదర్శించారు. అంతకుమించి జిల్లాలో పర్యాటక అభివృద్ధి జరిగింది లేదు. గండికోటకు ప్రత్యేక గుర్తింపు తేలేదు.
ఒరిగిందేమిటీ?
నిజానికి పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి మన జిల్లాలో ఎన్నో అనువైన ప్రాంతాలు ఉన్నాయి. ఆ విషయం తెలిసే చంద్రబాబు టూరిజం హబ్‌లను ఏర్పాటు చేస్తామని హామీలు ఇచ్చారు. కానీ ఒక్కటి కూడా అమలు చేయలేదు. మరీ హామీలతో జిల్లాకు ఒరిగిందేమిటీ?
– సత్యనారాయణ, పర్యాటకాభిమాని, కడప
హామీలు గాలిలో
జిల్లాలోని పర్యాటక ప్రాంతాలను కలుపుతూ టూరిజం హబ్ ఏర్పాటు చేస్తామని చంద్రబాబు పలుమార్లు హామీలు ఇచ్చారు. కానీ ఒక్కటి నెరవేర్చలేదు. హామీలన్నీ గాలిలో కలిశాయి. పర్యాటకాభివృద్ధి జరుగుతుందని జిల్లా వాసుల్లో ఆశలు రేపడంతో అవి నెరవేరక నిరాశే మిగిలింది.
– పోచంరెడ్డి సుబ్బారెడ్డి, సభ్యులు, ఇంటాక్, కడప
పల్వరైజింగ్ మిల్లులు మూత
రైల్వేకోడూరు : ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థపై ఆధారపడి దాదాపు 246 పల్వరైజింగ్ మిల్లులు ఉన్నాయి. దివగంత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో మంగంపేట పరిసర ప్రాంత అభివృద్ధి కోసం 296 జీవోతో పల్వరైజింగ్ మిల్లులు ఏర్పాటు చేశారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే అప్పటి వరకు పల్వరైజింగ్ మిల్లులకు సరఫరా అవుతున్న బెరైటీస్ ఖనిజం నిలిచిపోవడంతో స్థానికంగా ఏర్పాటు చేసుకున్న చాలా మిల్లులు మూత పడి కరెంటు బిల్లులు కూడా చెల్లించలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో మిల్లులపై ప్రత్యక్షంగా పరోక్షంగా ఆధారపడిన వేలాది కుటుంబాలు జీవనోపాధిని కోల్పోయి రోడ్డున పడ్డాయి. చాలా మంది మిల్లుల యజమానులు అప్పుల ఉబిలో కూరుకుపోయి అష్టకష్టాలు పడుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో మంగంపేట ఖనిజానికి గిరాకీ తగ్గింది. వ్యాపారాలు లేక పోవడంతో అందులో పని చేసే ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితి నెలకొంది.
అంతర్జాతీయంగా గిరాకీ తగ్గిన బెరైటీస్ ఖనిజం..
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే ఖనిజ సరఫరా నిలిపివేయడంతో వ్యాపారాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. అంతర్జాతీయంగా బెరైటీస్ ఖనిజానికి గిరాకీ తగ్గింది. వ్యాపారాలు లేకపోవడంతో మిల్లులకు కరెంటు బిల్లులు, బ్యాంకు రుణాలు కట్టలేక అప్పులతో ఇబ్బందులు పడుతున్నాము..
– గల్లా శ్రీనివాసులు, మిల్లు యజమాని, మంగంపేట
ముడిఖనిజం ఎగుమతులతో మిల్లుల మూత
బెరైటీస్ ముడి ఖనిజం ఎగుమతులు చేస్తుండటంతో స్థానికంగా ఏర్పాటు చేసుకున్న మిల్లులు వ్యాపారాలు లేక మూత çపడ్డాయి. ముడి ఖనిజాన్ని స్థానికంగా పొడిచేసి విదేశాలకు విక్రయించాలి. ఇందుకు విరుద్ధంగా టీడీపీ ప్రభుత్వం ముడిఖనిజ ఎగుమతులను పోత్సహించడంతో వేలాది మంది కార్మికులు జీవనోపాధి కోల్పోయారు.
– తల్లెం రమణారెడ్డి, పల్వరైజింగ్ మిల్లు యజమాని, మంగంపేట.
ఉర్దూ యూనివర్సిటీ... ఉఫ్
కడప కార్పొరేషన్: రాష్ట్రంలో ముస్లిం మైనార్టీలు అధికంగా ఉండే వైఎస్ఆర్ జిల్లాకు ప్రకటించిన ఉర్దూ యూనివర్సిటీని తెలుగుదేశం ప్రభుత్వం కర్నూలు జిల్లాకు తరలించింది. ఈ జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఎక్కువ సీట్లు రాలేదనే కక్షతోనే అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన ఏ ఒక్క హామీని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు అమలు చేయకుండా వివక్ష చూపారు. ఇందులో భాగంగానే ఉర్దూ యూనివర్సిటీని కడపలో కాకుండా కర్నూలులో ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. జిల్లాలో ముస్లిం మైనార్టీలు సుమారు పది లక్షల మంది ఉన్నారు. వీరి పిల్లలు ఉర్దూ మీడియంలో పదవ తరగతి, ఇంటర్ చదివిన తర్వాత డిగ్రీ, ఆపై చదవాలంటే ఇతర జిల్లాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది.
తల్లిదండ్రులను ఆడపిల్లలను బయటి ప్రాంతాలకు పంపి చదివించలేక టెన్త్, ఇంటర్‌తో చదువు ఆపేసే పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాయలసీమ జిల్లాకు కేంద్రంగా ఉన్న వైఎస్ఆర్ జిల్లాలో ఉర్దూ యూనివర్సిటీ వస్తే మన జిల్లాకేగాక అనంతపురం, చిత్తూరు, కర్నూలు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఉన్న ముస్లింలకు ఎంతో మేలు జరిగేది. జిల్లాలో నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కూడా లభించేవి. రాజకీయ కక్షతో చంద్రబాబు దీనిని కర్నూల్లో ఏర్పాటు చేయడం వల్ల చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల వారికి ఉర్దూ యూనివర్సిటీ దూరమైంది. ఉర్దూ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని ఎన్నో ఆందోళనలు, ఉద్యమాలు చేసినా ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు.
చివరకు కడప ఎమ్మెల్యే అంజద్‌బాషా ఆమరణ దీక్షకు దిగితే ప్రభుత్వం దిగి వచ్చి ఉర్దూ యూనివర్సిటీ స్థానంలో హజ్ హౌస్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అది కూడా అంత సులభంగా రాలేదు. అక్కడ, ఇక్కడ అంటూ లీకులిచ్చి కాలయాపన చేశారు. రాష్ట్రం అంతటికీ ఒకేచోట హజ్ హౌస్ ఏర్పాటు చేస్తామని, అది కూడా కడపలోనే నిర్మిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి అంతలోనే మాట మార్చి కడపతో పాటు విజయవాడలో కూడా హజ్‌హౌస్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. కడప– చెన్నూరు మధ్యలో ఏర్పాటు చేసిన ఈ హజ్ హౌస్ పనులు కూడా ఇంకా పెండింగ్‌లోనే ఉన్నప్పటికీ ఎన్నికలొస్తున్నాయని హడావిడిగా ప్రారంభించారు. నాలుగున్నరేళ్లు ముస్లిం మైనార్టీలపై ఇలా వివక్ష చూపిన ముఖ్యమంత్రి నేడు ఎంతో ప్రేమ ఉన్నట్లు నటించటం పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఉర్దూ యూనివర్సిటీ తరలింపు దారుణం
వైఎస్ఆర్ జిల్లాలో ఉర్దూ యూనివర్సిటీ, డీఆర్డీఓ ప్రాజెక్టులు ఇస్తామని సీఎం చంద్రబాబు అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. తర్వాత ఉర్దూ యూనివర్సిటీని కర్నూలుకు, డీఆర్డీఓను చిత్తూరుకు తరలించారు. ఈ యూనివర్సిటీ వచ్చి ఉంటే జిల్లాలోని మైనార్టీ విద్యార్థులకు, నిరుద్యోగులకు ఎంతో ఉపయోగంగా ఉండేది. రాజకీయ కక్షతోనే యూనివర్సిటీని తరలించారు.
– ఆలూరు ఖాజా, వైఎస్‌ఆర్‌ఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు.
విద్య, ఉద్యోగావకాశాలు కోల్పోయాము
ఉర్దూ యూనివర్సిటీని కర్నూలు జిల్లాకు తరలించడం వల్ల జిల్లాలోని మైనార్టీ విద్యార్థులు విద్య, ఉద్యోగావకాశాలు కోల్పోయారు. కడప ప్రజలపై టీడీపీ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఇదే నిదర్శనం. జిల్లాలోని మైనార్టీల అవకాశాలపై దెబ్బకొట్టిన చంద్రబాబు వారి ఓట్లు అడగటం హాస్యాస్పదం.
–షేక్ అబ్దుల్ సమద్, యువజన నాయకుడు.
ఉద్యానం.. ఉత్తిదే
కడప అగ్రికల్చర్ : తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జిల్లాకు వచ్చిన 32 సార్లు సీఎం చంద్రబాబునాయుడు, రాష్ట్ర వ్యవసాయశాఖా మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి నోటి నుంచి జిల్లాలో ‘హార్టికల్చర్ హబ్’, ఉద్యాన యూనివర్సిటీ ఏర్పాటు, టెర్మినల్ మార్కెట్, మెగాఫుడ్ పార్క్ గురించి పదే పదే గొప్పలు చెప్తున్నా చేతల్లో చూపించలేదని ఉద్యాన రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో ఉద్యాన పంటలు విస్తారంగా సాగు చేస్తున్నారని కచ్చితంగా ఉద్యాన యూనివర్సిటీని రైల్వేకోడూరులో ఏర్పాటు చేసి ప్రొఫెసర్లను నియమించి, అనుసంధానంగా శాస్త్రవేత్తలను ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. కానీ ఇంత వరకు యూనివర్సిటీ ఏర్పాటు చేసింది ఎక్కడని రైతులు ప్రశ్నిస్తున్నారు. జిల్లాలో ఉద్యాన పంట దిగుబడులకు కొదువలేదు. మార్కెట్లో గిట్టుబాటు ధరలు లేనప్పుడు విలువ ఆ«ధారిత (వాల్యూ అడిషన్) ఉత్పత్తులు చేసునేందుకు అవసరమైన గ్రేడింగ్, ప్రాసెసింగ్, జ్యూస్, ఫల్ప్, పౌడర్ పరిశ్రమల యూనిట్లు, అనుబంధ పరిశ్రమలతో కూడిన మెగా ఫుడ్‌పార్కులను ఏర్పాటు చేయిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీ అమలుకు నోచుకోలేదు.
ఉప ఉత్పత్తుల పరిశ్రమ ఒక్కటి కూడా రాలేదు..
అరటి పంట నుంచి జ్యూస్, క్రీములు, ఒడియాలు, నారు, పేపరు ప్లేట్లు మాదిరిగా తయారు చేసే పరిశ్రమలు వస్తున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్నపల్లె లిఫ్ట్ ఇరిగేషన్ ప్రారంభోత్సవానికి వచ్చినప్పుడు గొప్పలు చెప్పారు. కానీ ఇంత వరకు ఒక్కటంటే ఒక్క పరిశ్రమ ఏర్పాటు చేయలేదు. అరటికి మా ప్రాంతం పెట్టింది పేరు, నాలుగైదు రోజులు నిల్వ ఉన్నా చెడిపోనంత నాణ్యత కలిగిన కాయలు. ముఖ్యమంత్రి మాటలు చెప్పడం తప్ప ఉద్యాన రైతులకు చేసిందేమీ లేదు. –ఎంసీ శేఖరరెడ్డి, ఉద్యాన రైతు, లింగాల, లింగాల మండలం.
మార్కెట్ సదుపాయం కల్పించకుండా దగా చేసిన ప్రభుత్వం..:
లింగాల మండలానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రెండు సార్లు వచ్చారు. వచ్చిన సమయంలో ఇక్కడి రైతులు బంగారు పంటలు పండిస్తున్నారని. ఉద్యాన పంటల్లో అరటికి ఈ ప్రాంతం అనువైనదని, మార్కెటింగ్ సదుపాయం కల్పిస్తామని, రైతులను లక్షాధికారులను చేస్తామని నమ్మబలికారు. కానీ ఇప్పటికి ఎలాంటి మార్కెటింగ్ సదుపాయం కల్పించలేదు.
– అలవలపాటి ప్రతాప్‌రెడ్డి, ఉద్యాన రైతు, లింగాల, లింగాల మండలం.
హంద్రీ నీవా.. నీటి మూటే
రాయచోటి: హంద్రీ– నీవా ప్రాజెక్టుకు 2016 కంతా కృష్ణా జలాలు పారిస్తానన్న ముఖ్యమంత్రి చంద్రబాబు మాటలు నీటి మూటలేనని తేలిపోయింది. 2015లో అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీ నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సహా రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి హంద్రీ–నీవా ప్రాజెక్టు పనుల్లో జరుగుతున్న అవినీతి, నిర్లక్ష్యంపై ప్రభుత్వాన్ని నిలదీశారు. దీనిపై అప్పట్లో సీఎం చంద్రబాబు స్పందిస్తూ హంద్రీ నీవా కాలువల్లో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు పడుకున్నా 2016లో మీపై నుంచి నీరు తీసుకెళతానంటూ ఆవేశపూరితంగా ప్రసంగించారు. ఈ మాటలు చెప్పి ఏళ్లు గడిచినా కృష్ణా జలాలు తేలేకపోయారు. పైగా ఇటీవల ఎన్నికల ప్రచార సభలో రాయచోటిలో ముఖ్యమంత్రి చంద్రబాబు తిరిగి అదే హామీ ఇవ్వడాన్ని చూసి జనం నవ్వుకున్నారు.
నిత్యం కరువుతో అల్లాడే రాయచోటి ప్రాంతానికి సాగునీటిని అందించేందుకు నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సంకల్పించారు. హంద్రీ నీవా పనులు ప్రారంభించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా చిన్నమండెం మండల సమీపంలోని శ్రీనివాసపురం వద్ద ఒక టీఎంసీ సామర్థ్యంతో ప్రాజెక్టు నిర్మాణానికి వైఎస్సార్ అనుమతి ఇచ్చారు. వైఎస్ఆర్ అకాల మరణంతో ఈ పనులు ఆగిపోయాయి. టీడీపీ ప్రభుత్వం ఈ పనుల గురించి ఏమాత్రం పట్టించుకోలేదు. హంద్రీ నీవా కెనాల్‌ను పూర్తిచేసి రాయచోటి ప్రాంతానికి సాగు నీరు ఇవ్వాలని ప్రతిపక్ష పార్టీ నేత వైఎస్ జగన్మోహన్రెడ్డతో పాటు ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి పలుమార్లు అసెంబ్లీలో గళమెత్తినా స్పందన లేదు. అదిగో ఇదిగో అంటూ అధికార పార్టీ నాయకులు మాటలతో కాలం గడపడం తప్ప రైతులకు ఒరిగిందేమీ లేదు.