- ప్రభుత్వ ఆదేశాలు బేఖాతరు
- ఎంపికకు రాజకీయ రంగు
వార్డు కమిటీలపై నిర్లక్ష్యం
Published Sun, Aug 21 2016 11:42 PM | Last Updated on Mon, Sep 4 2017 10:16 AM
కరీంనగర్ కార్పొరేషన్ : కరీంనగర్ నగరపాలక సంస్థలో వార్డు కమిటీల ఏర్పాటుపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. డివిజన్లవారీగా వార్డు కమిటీలను ఏర్పాటు చేయాల్సి ఉండగా ఆ దిశగా దృష్టి సారించడం లేదు. కార్పొరేషన్‌లోని 50 డివిజన్లలో వార్డు కమిటీలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర మున్సిపల్‌శాఖ నుంచి గత జనవరిలోనే ఉత్తర్వులు వచ్చాయి. వార్డు కమిటీల ఏర్పాటుపై కౌన్సిల్ సమావేశంలో తీర్మానం చేసినా.. అమలుపై అధికారులు నిర్లక్ష్యం వీడడం లేదు.
అక్రమాలకు అడ్డుకట్ట
డివిజన్లలో వార్డు కమిటీలు ఏర్పాటు చేస్తే అక్రమాలకు అడ్డుకట్ట వేసే అవకాశం ఉంటుంది. అభివృద్ధి పనులు పరిశీలించేందుకు, సమస్యలను గుర్తించి అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు కమిటీలు ఉపయోగపడతాయి. కమిటీలు గుర్తించిన సమస్యలను అధికారులు మినిట్స్ రూపంలో కౌన్సిల్ దృష్టికి తీసుకెళ్తారు. దీని ప్రకారం కౌన్సిల్ సమావేశంలో వాటి పరిష్కారంపై చర్చించే అవకాశం ఉంటుంది. డివిజన్‌లలో జరిగే అభివృద్ధి పనులు, మౌలిక సదుపాయాల కల్పనలో లోపాలను ఎప్పటికప్పుడు రాతపూర్వకంగా అధికారుల దృష్టికి తీసుకెళ్లే వీలుంటుంది. ఫలితంగా పనుల్లో నాణ్యత పాటిస్తారు.
ఇలా ఎన్నుకుంటారు
డివిజన్ కార్పొరేటర్ చైర్మన్‌గా ఉండే ఒక్కో వార్డు కమిటీలో ఐదుగురు సభ్యులు ఉంటారు. సభ్యులను నామినేటెడ్ పద్ధతిలోనే ఎన్నుకుంటారు. డివిజన్ పరిధిలో ఉండే వివిధ సంఘాల నుంచి ముఖ్యులకు కమిటీలో అవకాశమిస్తారు. కార్పొరేషన్ నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత సభ్యుడిగా అవకాశం కల్పించాలంటూ దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులను మేయర్, ఇతర అధికారులు పరిశీలించి ప్రతిభను బట్టి కమిటీలోకి తీసుకుంటారు.
రాజకీయ రంగు
డివిజన్లలో వార్డు కమిటీలను నియమిస్తే కార్పొరేటర్ ఆ డివిజన్‌లో ఏ అభివృద్ధి పనులు చేపట్టాలన్నా కమిటీతో చర్చించాలి. కమిటీ సభ్యులు కూడా కార్పొరేటర్‌తో సమానంగా డివిజన్‌లో గుర్తించబడతారు. దీంతో కార్పొరేటర్‌కు ప్రాధాన్యత తగ్గుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇదే జరిగితే కార్పొరేటర్‌కు కమిటీ సభ్యులు భవిష్యత్‌లో పోటీదారులుగా మారే అవకాశం ఉంది. ఇలాంటి తలనొప్పిని తెచ్చుకునే బదులు కమిటీల నియామకం లేకుండా చేసుకోవాలనేది కార్పొరేటర్ల మనోగతంగా తెలుస్తోంది. ఇందుకు అనుగుణంగానే అధికారులు కూడా వ్యవహరిస్తుండడం పలు అనుమానాలు తావిస్తోంది.
Advertisement