Karimnagar Corporation
-
ప్రగతికి పట్టణం కడదాం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పట్టణాలను ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు కృషి చేయాలని పురపాలక శాఖ మంత్రి కె. తారక రామారావు పిలుపునిచ్చారు. పట్టణ ప్రగతి లక్ష్యాలను పూర్తి చేస్తే తెలంగాణలోని ప్రతి పట్టణానికీ జాతీయస్థాయి గుర్తింపు వస్తుందని పేర్కొన్నారు. గురువారం జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు, మున్సిపల్ మేయర్లు, చైర్పర్సన్లు, కమిషనర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతినెలా స్థానిక సంస్థలకు క్రమం తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇస్తోందని మంత్రి తెలిపారు. సీఎం కేసీఆర్ ఆలోచనల మేరకు ప్రవేశపెట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమ లక్ష్యాలను అందుకునే దిశగా ముందుకు సాగాలని ఈ సందర్భంగా సూచించారు. ఇప్పటికే పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని, వాటిని అమలు చేసిన పురపాలికలకు జాతీయ స్థాయిలో అవార్డులు దక్కిన విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పట్టణాల పురోగతి కోసం ప్రత్యేకంగా టీయూఎఫ్‌ఐసీడీ అనే సంస్థను ఏర్పా టు చేసిందని తెలిపారు. పట్టణ ప్రగతికి అదనంగా నిధులు సమకూరుస్తున్న విషయాన్ని గుర్తించాలని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇచ్చే ప్రత్యేక నిధులతో పట్టణాల్లో మౌలిక వసతుల కల్పన కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయని, అయితే స్థానిక సంస్థల పరిధిలో ఉన్న పారిశుధ్యం, తాగునీటి సరఫరా, విద్యుత్ దీపాలు, గ్రీనరీ నిర్వహణ వంటి కార్యక్రమాల పైన ఎక్కువ దృష్టి సారించాలని ఆదేశించారు. అభివృద్ధిలో పట్టణాల్లోని పౌరులను కూడా భాగస్వాములు చేసేలా వారితో మమేకమై పనిచేయాలని కోరారు. రానున్న ఆరు నెలల్లో సమీకృత శాకాహార, మాంసాహార మార్కెట్ల నిర్మాణ పనులు పూర్తి చేయాలని, వాటితోపాటు ఇతర పెండింగ్ పనులపై దృష్టి సారించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో తప్ప మరెక్కడా లేదు.. స్థానిక సంస్థల వ్యవహారాల కోసం ప్రత్యేకంగా ఒక కలెక్టర్ స్థాయి అధికారిని నియమించడం తెలంగాణలో తప్ప దేశంలో ఎక్కడా లేదని కేటీఆర్ అన్నారు. ప్రభుత్వ ఆలోచనలను అర్థం చేసుకుని అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. స్థానిక సంస్థలను పర్యవేక్షిస్తున్న అదనపు కలెక్టర్లు పట్టణాల ఆకస్మిక తనిఖీలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ఇతర పట్టణాలతో పోటీపడి అభివృద్ధి దిశగా ముందుకు కదలాలన్నారు. పారిశుధ్య నిర్వహణ, పచ్చదనం పెంచడం వంటి కార్యక్రమాలు చేపట్టాలని అధికారులకు, ప్రజాప్రతినిధులకు మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. పురపాలనలో కరీంనగర్ కార్పొరేషన్‌తో పాటు ఇల్లందు వంటి పురపాలికలు వినూత్నంగా ముందుకు దూసుకుపోతున్నాయన్నారు. ఈ విషయంలో అధికారులు, ప్రజాప్రతినిధులను మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి అరవింద్ కుమార్, సీడీఎంఏ డాక్టర్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
మూడో మేయర్ సునీల్‌రావు
సాక్షి, కరీంనగర్: కరీంనగర్ కార్పొరేషన్‌కు జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించి మేయర్ పీఠం కైవసం చేసుకుంది. మేయర్‌గా సునీల్‌రావు, డెప్యూటీ మేయర్‌గా చల్లా స్వరూపరాణిని ఎన్నుకున్నారు. మేయర్‌గా సునీల్‌రావు శనివారం బాధ్యతలను స్వీకరించనున్నారు. కార్పొరేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసే ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్, రాష్ట్ర బీసీ సంక్షేమం, పౌరసరఫరా శాఖ మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, ఎమ్మెల్యేలు, ఇతర నాయకుల సమక్షంలో బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈమేరకు కార్పొరేషన్ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఐదోసారి కార్పొరేటర్.. మూడో మేయర్ సునీల్‌రావు(52) భార్య అపర్ణ మాజీ కార్పొరేటర్. వీరికి కుమారుడు ప్రద్యుమ్నరావు, కూతురు స్వప్నిక ఉన్నారు. 1987లో నగర కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా రాజకీయ జీవితం ప్రారంభించారు. 1992లో జిల్లా యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ, 1995 నుంచి 2001 వరకూ జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్, 2001 నుంచి 2005 వరకూ కాంగ్రెస్ నుంచి మున్సిపల్ కౌన్సిలర్, 2005 నుంచి 2010 కాంగ్రెస్ మున్సిపల్ కార్పొరేటర్‌గా, 2005 నుంచి 2009 వరకూ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా పని చేశారు. 2014 మున్సిపల్ ఎన్నికల్లో సునీల్‌రావు కాంగ్రెస్ తరఫున, ఆయన భార్య అపర్ణ ఇండిపెండెంట్‌గా విజయం సాధించారు. తర్వాత కొద్ది రోజులకే ఇద్దరూ టీఆర్ఎస్లో చేరారు. 2014 నుంచి టీఆర్ఎస్లో చురుకైనా పాత్ర పోషిస్తున్నారు. 2020లో జరిగిన తాజా కార్పొరేషన్ ఎన్నికల్లో 33వ డివిజన్ నుంచి టీఆర్ఎస్ కార్పొరేటర్‌గా 1997 ఓట్ల భారీ మోజారిటీతో విజయం సాధించారు. కరీంనగర్ తొలి మేయర్‌గా కాంగ్రెస్ పార్టీ నుంచి డి.శంకర్ ఎన్నికయ్యారు. 2014లో టీఆర్ఎస్ నుంచి రవీందర్ సింగ్ మేయర్‌గా ఉన్నారు. -
కన్నారంపై కమలం కన్ను
సాక్షి, కరీంనగర్ : పార్లమెంటు ఎన్నికల్లో సాధించిన అనూహ్య విజయాలతో పట్టణాల్లో పాగా వేయాలని కమలనాథులు ఉవ్విళ్లూరుతున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో కరీంనగర్లో బీజేపీ భారీ మెజారిటీ సాధించడానికి కారణమైన అసెంబ్లీ సెగ్మెంట్లలోని పురపాలికలను తొలుత బీజేపీ నేతలు టార్గెట్ చేసుకున్నారు. పట్టణాల్లో బీజేపీకి అంతో ఇంతో బలం ఉండడం, తాజాగా పార్లమెంటు ఎన్నికల్లో ‘పువ్వు’ గుర్తు జనాల్లోకి వెళ్లడంతో పురపాలక సంఘాలను కైవసం చేసుకోవాలని ఆ పార్టీ పట్టుదలతో ఉంది. దీనికి తోడు కరీంనగర్ నుంచి విజయం సాధించిన ఎంపీ బండి సంజయ్‌కుమార్ కరీంనగర్ కార్పొరేషన్‌తోపాటు పార్లమెంటు పరిధిలోని మెజారిటీ మునిసిపాలిటీల్లో కాషాయజెండా ఎగురవేయించాలనే పట్టుదలతో ఉన్నారు. ఇందుకోసం తొలుత కరీంనగర్ కార్పొరేషన్‌ను టార్గెట్‌గా చేసుకున్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో భారీ మెజారిటీ ఇచ్చిన చొప్పదండి, కొత్తపల్లి, వేములవాడ మునిసిపాలిటీల్లో సానుకూల ఫలితాలు పొందే దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ మునిసిపాలిటీల్లోని వార్డుల్లో గెలిచే స్థాయి నాయకులు ఎంత మేరకు ఉన్నారనేది ఇప్పుడు పార్టీ నేతలను తొలుస్తున్న ప్రశ్న. హుజూరాబాద్ నియోజకవర్గంలోని హుజూరాబాద్, జమ్మికుంటతోపాటు కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లపై బీజేపీకి పెద్దగా ఆశలు లేకపోయినా, ఇక్కడ కూడా అభ్యర్థులను నిలిపి బలం పెంచుకునే ఆలోచనతో ఉన్నారు. కరీంనగర్ బల్దియాపై కాషాయమే లక్ష్యంగా.. మైనారిటీ వర్గాల ప్రభావం అధికంగా ఉన్న కరీంనగర్ మునిసిపల్ కార్పొరేషన్లో డివిజన్ల సంఖ్య 50 నుంచి 60కి పెరిగింది. కొత్తగా కలిసిన 8 గ్రామాలతో పది వార్డులు పెరిగాయి. అదే సమయంలో మైనారిటీ వర్గాల ప్రభావం ఉన్న డివిజన్ల సంఖ్య కూడా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఎంపీ బండి సంజయ్ మెజారిటీ ఓటు బ్యాంకును లక్ష్యంగా చేసుకుని ఎన్నికల్లో లబ్ధి పొందాలనే ఆలోచనతో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. మిత్రపక్షాలుగా ఉన్న టీఆర్ఎస్, ఎంఐఎంలకు ఓటు వేయడం వల్ల కరీంనగర్ ఇమేజ్ దెబ్బతింటుందని ఇప్పటికే ప్రచారం ప్రారంభించారు. పార్లమెంటు ఎన్నికల్లో కూడా ఇదే అంశాన్ని విభిన్న రీతుల్లో ప్రచారం చేసి ధర్మం పేరుతో ‘హిందుత్వ’ ఎజెండాను ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఈసారి కూడా ఇదే అంశాన్ని జనాల్లోకి బలంగా తీసుకెళ్లాలని నిర్ణయించారు. స్మార్ట్‌సిటీ ప్రచార అస్త్రంగా... కరీంనగర్‌ను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమే స్మార్ట్‌సిటీగా ప్రకటించిందని, నిధులను సక్రమంగా వెచ్చించడంలో ఇప్పటివరకు బల్దియాను ఏలిన టీఆర్ఎస్ విఫలమైందనే ప్రచారానికి బీజేపీ తెరలేపింది. కార్పొరేషన్లో బీజేపీ అధికారంలో ఉంటే మరిన్ని నిధులు తీసుకురావడంతోపాటు నగరాన్ని అభివృద్ధి చేస్తామని సంజయ్ తన ప్రసంగాల్లో చెబుతున్నారు. ఒక రకంగా రేపటి ఎన్నికల్లో ఇదే ప్రధాన ప్రచారాస్త్రంగా మారనుందన్న మాట. అయితే ముఖ్యమంత్రి కేసీఆర్, అప్పటి ఎంపీ వినోద్‌కుమార్ వల్లనే కరీంనగర్‌ను స్మార్ట్‌సిటీ జాబితాలో చేర్చినట్లు టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. ఎమ్మెల్యే కమలాకర్ ఓ అడుగు ముందుకేసి ‘పేరుకే స్మార్ట్‌సిటీ తప్ప రూపాయి రావడం లేదు. బీజేపీ నేతలకు చిత్తశుద్ధి లేదు’ అని బాహాటంగానే విమర్శిస్తున్నారు. పురపాలక ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఏమాత్రం పరిగణనలోకి తీసుకోకుండా టీఆర్ఎస్ను టార్గెట్ చేయాలని వ్యూహాత్మకంగా బీజేపీ నేతలు ముందుకు సాగుతున్నారు. పట్టణాల్లో బీజేపీకి గెలిచే కేడర్ ఎక్కడ..? కరీంనగర్లో సంజయ్ ఇమేజ్‌కు తోడు మోదీ హవాతో పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. ఆ ప్రభావం కొంత మేర పట్టణాల్లో ఇప్పటికి ఉన్నప్పటికీ, బీజేపీ అభ్యర్థులను గెలిపించే స్థాయిలో పనిచేస్తుందా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. కరీంనగర్లో గత మునిసిపల్ ఎన్నికల్లో సంజయ్‌తోపాటు విజయ మాత్రమే బీజేపీ నుంచి కార్పొరేటర్లుగా గెలుపొందారు. ఇప్పుడు కరీంనగర్ మునిసిపాలిటీని కైవసం చేసుకోవాలంటే కనీసం 31 మంది కార్పొరేటర్లు గెలవాలి. కరీంనగర్లో కొంత మేర సంజయ్ ఎఫెక్ట్ ఇప్పటికీ ఉన్నా, మిగతా మునిసిపాలిటీల్లో పరిస్థితి అంత ఈజీగా లేదని ఆ పార్టీ వర్గాలే చెబుతున్నాయి. హుజూరాబాద్, జమ్మికుంట మునిసిపాలిటీల్లో మంత్రి ఈటల ప్రభావం ఎక్కువగా ఉంది. సిరిసిల్ల మునిసిపాలిటీలో ఎమ్మెల్యే, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రామన్న చేసిన అభివృద్ధి పనులే అడుగడుగునా కనిపిస్తున్నాయి. చొప్పదండి, కొత్తపల్లి కొత్త మునిసిపాలిటీలే. వేములవాడ మునిసిపాలిటీలో మాత్రం ఈసారి బీజేపీ బలం పుంజుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నేడు సభ్యత్వంతోపాటే ఎన్నికల సందడి బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా శనివారం హైదరాబాద్‌లో ప్రారంభించారు. కరీంనగర్లో ఆదివారం సభ్యత్వ నమోదుకు ఎంపీ సంజయ్‌కుమార్, జిల్లా పార్టీ అధ్యక్షుడు సత్యనారాయణ ముహూర్తం నిర్ణయించారు. మహబూబ్‌నగర్ మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. అనంతరం సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో బల్దియా ఎన్నికల్లో బీజేపీ అనుసరించాల్సిన వ్యూహాన్ని పార్టీ యంత్రాంగానికి వివరించనున్నారు. -
ఐఏఎస్ అధికారికి జైలు శిక్ష
సాక్షి, హైదరాబాద్: కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారనే ఆరోపణల కేసులో ఐఏఎస్ అధికారి (ఇప్పుడు గద్వాల–జోగులాంబ జిల్లా కలెక్టర్‌గా ఉన్నారు) గతంలో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా చేసిన కె.శశాంక్‌కు నెల రోజుల సాధారణ జైలు శిక్ష, రూ.25 వేలు జరిమానా విధిస్తూ హైకోర్టు తీర్పు చెప్పింది. జరిమానా సొమ్మును శశాంక్ వ్యక్తిగతంగా చెల్లించాలని, ఒకవేళ జరిమానా చెల్లించకపోతే 2 వారాలు అదనంగా సాధారణ జైలు శిక్ష అనుభవించాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అప్పీల్ నిమిత్తం తీర్పు అమలును 6 వారాలపాటు నిలిపివేస్తున్నట్లు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డి మంగళవారం ప్రకటించారు. కరీంనగర్‌లోని సిఖ్వాడి వీధిలోని తన ఇంటి స్థలం విషయంలో హైకోర్టు ఆదేశాల్ని ధిక్కరించారని పేర్కొంటూ పూనం కౌర్ అలియాస్ పున్న భాయ్ దాఖలు చేసిన కేసులో ఈ తీర్పు వెలువడింది. సిఖ్వాడి వీధిలోని రెండు షాపులతో కూడిన ఇంటిని 2014లో కూల్చివేయడంపై ఆమె హైకోర్టును ఆశ్రయించారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ నిర్మించే షాపుల సముదాయంలో ఆమెకు షాపు కేటాయించాలని, లేనిపక్షంలో భూసేకరణ చట్ట ప్రకారం ఆమెకు పరిహారం చెల్లించాలని అప్పట్లో హైకోర్టు కార్పొరేషన్ కమిషనర్‌గా ఉన్న శశాంక్‌కు ఆదేశాలు జారీ చేసింది. వీటిని అమలు చేయకపోవడంతో ఆమె కోర్టు ధిక్కార వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. -
సుందర నగరానికి సహకరించాలి
కరీంనగర్‌కార్పొరేషన్ : కరీంనగర్ నగరపాలక సంస్థలో నూతనంగా కొనుగోలు చేసిన స్వీపింగ్ మిషన్‌ను సోమవారం కోర్టు చౌరస్తాలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి, రాష్ట్ర ఆర్థిక శాఖ ఈటల రాజేందర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్మార్ట్‌సిటీ హోదా దక్కించుకున్న కరీంనగర్ పరిశుభ్రంగా ఉండేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతుందని తెలిపారు. ఈ క్రమంలోనే నగరానికి స్వీపింగ్ మిషన్లు కొనుగోలు చేస్తున్నట్లు వెల్లడించారు. స్వీపింగ్ మిషన్లు కొనుగోలు చేయడం ద్వారా నైట్ స్వీపింగ్ కార్మికులకు భారం తగ్గుతుందని, ప్రధాన రహదారుల్లో ప్రమాదాలను నియంత్రించొచ్చని పేర్కొన్నారు. రహదారులు పరిశుభ్రంగా ఉంటే నగరం సుందరంగా మారుతుందని, ప్రతి ఒక్కరూ సుందర నగరం కోసం సహకరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ, మేయర్ రవీందర్‌సింగ్, డిప్యూటీ మేయర్ గుగ్గిళ్లపు రమేశ్, నగరపాలక సంస్థ కమిషనర్ శశాంక, మున్సిపల్ అధికారులు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. అభివృద్ధి పనులు ప్రారంభం నగరంలోని 35వ డివిజన్ సప్తగిరికాలనీలో ముఖ్యమంత్రి ప్రత్యేక నిధుల నుంచి చేపట్టనున్న రూ.2.4కోట్ల అభివృద్ధి పనులకు మంత్రులు శంకుస్థాపన చేశారు. వారు మాట్లాడుతూ ప్రపంచంలోనే అత్యంత చిన్న సుందర నగరంగా కరీంనగర్‌కు గుర్తింపు ఉందని, కరీంనగర్‌ను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మేయర్ రవీందర్‌సింగ్, కార్పొరేటర్ కవితబుచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కార్పొరేషన్లో విలీనాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన
మంకమ్మతోట : కరీంనగర్ కార్పొరేషన్లో గ్రామాలను విలీనం చేయడాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నగరంలోని కలెక్టరేట్ వద్ద బుధవారం ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కె.నగేశ్ మాట్లాడుతూ ప్రజాభిప్రాయం తీసుకోకుండా ప్రజాభీష్టానికి విరుద్ధంగా నగర కార్పొరేషన్లో 11 గ్రామాలను విలీనం చేయడాన్ని ఖండించారు. ప్రభుత్వం బలవంతంగా విలీనం చేస్తే ప్రజల మద్దతుతో ప్రతిఘటిస్తామని హెచ్చరించారు. విలీనం చేస్తున్న ఈ గ్రామాల్లో వేలాదిమంది ప్రజలు, రైతులు కూలీలుగా జీవనం సాగిస్తున్నారన్నారు. ప్రజల నిర్ణయం తీసుకోకుండా బలవంతంగా విలీనం చేస్తే.. వారు వ్యవసాయం కోల్పోయి జీవనోపాధికి దూరమయ్యే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. పన్నుల భారం పడి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారని, దాదాపు 5కిలోమీటర్ల దూరం వచ్చి పనులు చేయించుకోవాల్సి వస్తుందని అన్నారు. గతంలో కట్టరాంపూర్, కోతిరాంపూర్, రాంనగర్ గ్రామాలు విలీనం జరిగి 15 సంవత్సరాలు గడుస్తున్నా.. ఇప్పటికీ అభివృద్ధికి నోచుకోలేదని విమర్శించారు. రాష్ట్ర నాయకుడు అక్కెనపెల్లి కుమార్, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు బోగె పద్మ, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వరాల శ్రీనివాస్, యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎడ్ల సురేందర్‌రెడ్డి, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు బండమీది అంజయ్య, జిల్లా అధికార ప్రతినిధులు ఎండీ షాహెన్షా, కోట రాజ్‌కుమార్, యూత్ పట్టణ అధ్యక్షుడు సాధిక బలాల, యువత జిల్లా కార్యదర్శి ఎండీ ఫెరోజ్, పార్టీ ఆఫీస్ ఇన్చార్జి ఎండీ రహీమోద్దీన్, మాజీ రాష్ట్ర కార్యదర్శి సొల్లు అజయ్‌వర్మ, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు వన్నారం అక్షయ్‌యాదవ్, విద్యార్థి విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి దేవునూరి శ్రీనివాస్, విద్యార్థి విభాగం జిల్లా కార్యదర్శి ఆకోజు విఠలాచారి, జిల్లా కార్యదర్శి జంగిలి రవిచందర్, పట్టణ ప్రధాన కార్యదర్శి సుంకె ఆనంద్, కార్మిక విభాగం పట్టణ అధ్యక్షుడు ఇప్పనపెల్లి శేఖర్, బీసీ సెల్ పట్టణ అధ్యక్షుడు కడార్ల నాగార్జునాచారి, క్రిస్టియన్ మైనార్టీ యూత్ పట్టణ అధ్యక్షుడు జి.నికోలస్, మైనార్టీ సెల్ పట్టణ అధ్యక్షుడు యూనస్, సోషల్ మీడియా ఇన్చార్జి ఎండీ వలీయోద్దీన్, జిల్లా ప్రధాన కార్యదర్శి రామకృష్ణారెడ్డి, నాయకులు అస్లమ్, తిరుపతి, జయశ్రీ పాల్గొన్నారు. -
స్మార్ట్‌సిటీ కార్యాచరణ
కరీంనగర్ స్మార్ట్‌సిటీ పనులను త్వరలో ప్రారంభించేందుకు కార్యాచరణ రూపొందించినట్లు నగరపాలక సంస్థ కమిషనర్ కె.శశాంక తెలిపారు. స్మార్ట్‌సిటీ అభివృద్ధి పనుల టెండర్లకు ప్రణాళిక తయారుచేసి దశలవారీగా పనులు చేపట్టి పూర్తిచేయాలని కాంట్రాక్టర్ ఆర్వీ అసోసియేషన్ కన్సల్టెన్సీ బృందాన్ని ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం నగరపాలక సంస్థ కాన్ఫరెన్స్హాల్లో ఆర్వీ కన్సల్టెన్సీ బృందంతో సమావేశమయ్యారు. ఏరియా బేస్డ్ డెవలప్మెంట్లో భాగంగా మొదటి దశలో చేపట్టే ప్రాజెక్టు పనులపై చర్చిస్తూ వివరణ కోరారు. స్టేజ్–1, 2ను పరిగణనలోకి తీసుకుని స్మార్ట్‌సిటీ అభివృద్ధి పనులపై పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా రూట్‌మ్యాప్‌లను పరిశీలించారు. కరీంనగర్ కార్పొరేషన్ : స్మార్ట్ పనులకు సంబంధించి ప్రాజెక్టు టెండర్లపై సలహాలు, సూచనలు చేశారు. ఏరియా డెవలప్‌మెంట్స్‌కు సంబంధించి ముఖ్యమైన లొకేషన్‌ను ముందస్తుగా గుర్తించాలన్నారు. స్టేజ్–1లో చేపట్టబోయే సోలార్ రూప్‌టాప్, స్మార్ట్ ఎనర్జీ, డిస్ట్రిబ్యూషన్, స్మార్ట్‌రోడ్స్, అండర్‌గ్రౌండ్ నెట్వర్క్, టూరిజం ఇన్ఫర్మేషన్, మానేరు రివర్‌ఫ్రంట్, హరితహోటల్, గ్రీనరీఅండ్పార్కులు, పార్కింగ్ ప్లేస్, మల్టీపర్పస్స్కూల్స్ అభివృద్ధిపై చర్చించారు. మాస్టర్‌ప్లాన్ ప్రకారం సంబంధిత ప్రాజెక్టు పనుల టెండర్ల వివరాలు, పనులను ప్రారంభించి పూర్తిచేసే విధానంపై కన్సల్టెన్సీ సభ్యుల వివరణ కోరారు. నగరంలో నడుస్తున్న మొదటి దశ రూ.100 కోట్ల పనులు, రెండోదశ రూ.147 కోట్ల పనులపై సలహాలు సూచనలు చేశారు. స్మార్ట్‌సిటీ పనులను ఏరియాల వారీగా గుర్తించి ముఖ్యమైన పనులను ముందస్తుగా చేపట్టి పూర్తిచేయాలని ఆదేశించారు. మరో వైపు స్టేజీ–2లో చేపట్టే అభివృద్ధి పనులకు సంబంధించి కూరగాయల మార్కెట్లు, హ్యాకింగ్ వెండర్ జోన్స్, మార్కెట్‌యార్డు రీ డిజైనింగ్‌లో టౌన్‌ప్లానింగ్ అధికారుల సమన్వయంతో పనులు చేపట్టాలన్నారు. సిగ్నల్ సిస్టమ్, జీబ్రాక్రాసింగ్, కెమెరా కనెక్షన్స్, హెల్త్‌సెంటర్ల ఏర్పాటు, 24 గంటల మంచినీటి సరఫరాతోపాటు తదితర అంశాలపై వివరించారు. జిల్లాలో సంబంధిత అధికారుల సహకారాలతో స్మార్ట్‌సిటీ ప్రాజెక్టు పనులను వేగవంతంగా పూర్తిచేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో ఎస్ఈ శరత్‌బాబు, ఆర్వీ కన్సల్టెన్సీ బృందం సభ్యులు పాల్గొన్నారు. రూ.147 కోట్ల ప్రతిపాదనలు అందించాలి నగరంలో రెండోవిడతలో చేపట్టే రూ.147 కోట్ల అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రతిపాదనలు ఒక్కరోజులోనే సిద్ధం చేయాలని శశాంక ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో మంగళవారం ప్రజారోగ్యశాఖ, మున్సిపల్ ఇంజినీరింగ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సీసీ రోడ్లు, డ్రెయినేజీలు, మిషన్‌భగీరథ పనులపై చర్చించి అధికారులకు సూచనలు చేశారు. యూజీడీ పనులకు సంబంధించిన ట్రంక్‌లైన్, ఐకాన్స్, ఇన్స్పెక్షన్ చాంబర్ల వివరాలను అందించాలన్నారు. పనులు చేపట్టే ముందు ఏయే ప్రదేశాల్లో ఇన్స్పెక్షన్ చాంబర్లు వేయాలో ప్లానింగ్ చేయాలని సూచించారు. మిషన్‌భగీరథ పనుల పురోగతిని వివరించాలన్నారు. జూన్ 10లోపు మిషన్‌భగీరథ పనులు ఓ కొలిక్కి వచ్చేలా పనుల్లో వేగవంతం పెంచాలని సూచంచారు. సమావేశంలో ఎస్ఈ శరత్‌బాబు, ఈఈ భద్రయ్య తదితరులు పాల్గొన్నారు. -
లీకేజీల జోరు..
తాగునీరు డ్రెయినేజీ పాలు మరమ్మతులకు లక్షలు వృథా అయినా ఆగని పైపులైన్ పగుళ్లు రోజు 2 ఎంఎల్డీలు వృథా కరీంనగర్ కార్పొరేషన్ : నగరంలో ఓ వైపు తాగునీటి కరువు ఉంటే..మరో వైపు ఎక్కడపడితే అక్కడ పైపులైన్లకు లీకేజీలు ఏర్పడుతున్నాయి. ప్రతీ రోజు దాదాపు 2 ఎంఎల్డీల నీరు లీకేజీలతో వృథా అవుతుందని అంచనా. ఇంత నీరు డ్రెయినేజీ పాలవుతున్న కార్పొరేషన్ అధికారులు మాత్రం స్పందించడం లేదు. లీకులను అడ్డుకునే చర్యలు తీసుకోవడం లేదు. నగరానికి ప్రతి రోజు 30 ఎంఎల్డీల నీరు సరఫరా అవుతోంది. హైలెవల్, లోవెల్ విభాగాల్లో రోజు విడిచి రోజు సరఫరా చేస్తున్నారు. వీధికొక లీకేజీతో నీటి ప్రెషర్ తగ్గి చివరన ఉన్న నల్లాలకు సరిగ్గా సరఫరా కావడం లేదు. భగత్‌నగర్ ట్యాంకులోకి నీటిని నింపకుండానే బైపాస్ ద్వారా సరఫరా చేస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. లీకులతో నీరు కూడా కలుషితమవుతుందనే ఫిర్యాదులు వస్తున్నాయి. డ్రెయినేజీలో కలుస్తున్న తాగునీరు పైపులైన్ లీకేజీలు అరికట్టేందుకు ప్రతి నెల రూ.లక్షల్లో ఖర్చుచేస్తున్నారు. అయినా సత్ఫలితాలివ్వడం లేదు. నగరానికి సరఫరా అయ్యే 30 ఎంఎల్డీల్లో 2 ఎంఎల్డీల నీరు వృథాగానే పోతుందని సిబ్బంది అంచనా. ఈ వృథా నీటితో కనీసం ఒక డివిజన్‌కు నీటి సరఫరా చేయవచ్చు. నీటి సరఫరా సమయంలో సామర్థ్యం కంటే వాల్వ్‌లు ఎక్కువగా తిప్పడంతో ఉధృతి పెరిగి పైపులైన్లు పగులుతున్నాయని తెలుస్తోంది. మరమ్మతులు విఫలమవడానికి అధికారులు ఈ సూత్రాన్నే పాటిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక్కడే లీకేజీలు.. నగరంలోని హైలెవల్, లోలెవల్ సంప్‌లకు నీటి సరఫరా అందించే ఫిల్టర్‌బెడ్ నుంచి అంబేద్కర్ స్టేడియం వరకు ఉన్న ప్రధాన పైపులైన్‌కు ప్రతిరోజు ఎక్కడో ఒక లీకేజీ ఏర్పడుతూనే ఉంది. భగత్‌నగర్, రాంచంద్రాపూర్‌కాలనీ, సప్తగిరికాలనీ, రాంనగర్, బ్యాంక్‌కాలనీ, సుభాష్‌నగర్, అశోక్‌నగర్, కాపువాడ, కోతిరాంపూర్, శర్మనగర్, కిసాన్‌నగర్, అంబేద్కర్‌నగర్ ప్రాంతాల్లో లెక్కకు మించి లీకులు కనిపిస్తూనే ఉన్నాయి. వీటిని అరికట్టేందుకు ప్రతిరోజు ఆయా డివిజన్లలో తవ్వకాలు చేపడుతున్నారు. పాతపైపులైన్లు కావడంతోనే ఎప్పుడో 30, 40 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన పైపులు కావడంతో ప్రెషర్ తట్టుకోవడం లేదు. పాత పైపులైన్లు ఉన్న ప్రాంతాల్లో ఎక్కువ మరమ్మతులు వస్తున్నాయని, వీటి స్థానంలో కొత్త పైపులైన్లు వేయాలనే డిమాండ్ ఉంది. హడావిడిగా మరమ్మతులు చేపడుతుండడంతో లీకేజీలు మళ్లీ ఏర్పడుతున్నాయని నగరవాసులు చర్చించుకుంటున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి లీకేజీలపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. -
వార్డు కమిటీలపై నిర్లక్ష్యం
ప్రభుత్వ ఆదేశాలు బేఖాతరు ఎంపికకు రాజకీయ రంగు కరీంనగర్ కార్పొరేషన్ : కరీంనగర్ నగరపాలక సంస్థలో వార్డు కమిటీల ఏర్పాటుపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. డివిజన్లవారీగా వార్డు కమిటీలను ఏర్పాటు చేయాల్సి ఉండగా ఆ దిశగా దృష్టి సారించడం లేదు. కార్పొరేషన్‌లోని 50 డివిజన్లలో వార్డు కమిటీలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర మున్సిపల్‌శాఖ నుంచి గత జనవరిలోనే ఉత్తర్వులు వచ్చాయి. వార్డు కమిటీల ఏర్పాటుపై కౌన్సిల్ సమావేశంలో తీర్మానం చేసినా.. అమలుపై అధికారులు నిర్లక్ష్యం వీడడం లేదు. అక్రమాలకు అడ్డుకట్ట డివిజన్లలో వార్డు కమిటీలు ఏర్పాటు చేస్తే అక్రమాలకు అడ్డుకట్ట వేసే అవకాశం ఉంటుంది. అభివృద్ధి పనులు పరిశీలించేందుకు, సమస్యలను గుర్తించి అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు కమిటీలు ఉపయోగపడతాయి. కమిటీలు గుర్తించిన సమస్యలను అధికారులు మినిట్స్ రూపంలో కౌన్సిల్ దృష్టికి తీసుకెళ్తారు. దీని ప్రకారం కౌన్సిల్ సమావేశంలో వాటి పరిష్కారంపై చర్చించే అవకాశం ఉంటుంది. డివిజన్లలో జరిగే అభివృద్ధి పనులు, మౌలిక సదుపాయాల కల్పనలో లోపాలను ఎప్పటికప్పుడు రాతపూర్వకంగా అధికారుల దృష్టికి తీసుకెళ్లే వీలుంటుంది. ఫలితంగా పనుల్లో నాణ్యత పాటిస్తారు. ఇలా ఎన్నుకుంటారు డివిజన్ కార్పొరేటర్ చైర్మన్‌గా ఉండే ఒక్కో వార్డు కమిటీలో ఐదుగురు సభ్యులు ఉంటారు. సభ్యులను నామినేటెడ్ పద్ధతిలోనే ఎన్నుకుంటారు. డివిజన్ పరిధిలో ఉండే వివిధ సంఘాల నుంచి ముఖ్యులకు కమిటీలో అవకాశమిస్తారు. కార్పొరేషన్ నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత సభ్యుడిగా అవకాశం కల్పించాలంటూ దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులను మేయర్, ఇతర అధికారులు పరిశీలించి ప్రతిభను బట్టి కమిటీలోకి తీసుకుంటారు. రాజకీయ రంగు డివిజన్లలో వార్డు కమిటీలను నియమిస్తే కార్పొరేటర్ ఆ డివిజన్లో ఏ అభివృద్ధి పనులు చేపట్టాలన్నా కమిటీతో చర్చించాలి. కమిటీ సభ్యులు కూడా కార్పొరేటర్‌తో సమానంగా డివిజన్లో గుర్తించబడతారు. దీంతో కార్పొరేటర్‌కు ప్రాధాన్యత తగ్గుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇదే జరిగితే కార్పొరేటర్‌కు కమిటీ సభ్యులు భవిష్యత్‌లో పోటీదారులుగా మారే అవకాశం ఉంది. ఇలాంటి తలనొప్పిని తెచ్చుకునే బదులు కమిటీల నియామకం లేకుండా చేసుకోవాలనేది కార్పొరేటర్ల మనోగతంగా తెలుస్తోంది. ఇందుకు అనుగుణంగానే అధికారులు కూడా వ్యవహరిస్తుండడం పలు అనుమానాలు తావిస్తోంది. -
ఎట్టకేలకు వేటు
ముగ్గురు బల్దియా ఎస్ఏల సస్పెన్షన్ పీఎఫ్ చెల్లింపులో నిర్లక్ష్య ఫలితం కరీంనగర్ కార్పొరేషన్: కరీంనగర్ నగరపాలక సంస్థలో కాంట్రాక్టు కార్మికుల పీఎఫ్ చెల్లింపులో నిర్లక్ష్య వ్యవహారంపై ముగ్గురు ఉద్యోగులపై వేటు పడింది. వెయ్యి మంది కార్మికులకు సంబంధించిన పీఎఫ్ చెల్లింపులో జరిగిన జాప్యంతో బల్దియాలకు పీఎఫ్ శాఖ రూ.3.82 కోట్లు జరిమానా వి«ధించిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారానికి సంబంధించి విచారణ పూర్తయిన అనంతరం సీనియర్ అసిస్టెంట్లు కనకరాజు, తిరుపతి, ఖాదర్మోహినొద్దీన్ను సస్పెండ్ చేస్తూ సోమవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. 2007 ఫిబ్రవరి నుంచి 2014 మే వరకు కార్మికులకు చెల్లించాల్సిన పీఎఫ్‌లో జరిగిన జాప్యంపై పీఎఫ్శాఖ బల్దియాకు భారీ జరిమానా విధించింది. దీంతో అధికారులు, పాలకవర్గం జరిమానా తప్పించుకునే ప్రయత్నం చేసినప్పటికీ వీలుకాలేదు. పీఫ్ అధికారులు బల్దియా అకౌంట్లు ఫ్రీజింగ్ చేసి మరీ జరిమానా వసూలు చేశారు. ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న నగర మేయర్ రవీందర్‌సింగ్, కమిషనర్ కృష్ణభాస్కర్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేయగా ఆమె విచారణకు ఆదేశించింది. మరో ఇద్దరిపై చర్యలు విచారణాధికారిగా కొనసాగుతున్న జిల్లా కోఆపరేటివ్ అధికారి అంబయ్య నగరపాలక సంస్థకు చెందిన ఏడుగురు ఉద్యోగులను ఈ ఏడాది జూలై 11న కోఆపరేటివ్ కార్యాలయానికి పిలిపించుకొని విచారణ చేపట్టారు. సదరు ఉద్యోగులతో పీఎఫ్ చెల్లింపులో జరిగిన నిర్లక్ష్యంపై లిఖిత పూర్వకంగా వాంగ్మూలం తీసుకున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిని గుర్తించేందుకు చేపట్టిన విచారణలో ముగ్గురిని బాధ్యులుగా చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు సోమవారం సీనియర్ అసిస్టెంట్లు కన కరాజు, తిరుపతి, ప్రస్తుతం ఆర్వో–1గా పనిచేస్తున్న ఖాదర్మోహినొద్దీన్లను సస్పెండ్‌చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కార్మికుల సొమ్మును వేతనాల్లోంచి మిన హాయించుకుని పీఎఫ్ కార్యాలయానికి చెల్లించకపోవడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్న ఉన్నతాధికారులు మరో ఇద్దరు ఉద్యోగులపై కఠిన ఉండే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. బల్దియా ఉద్యోగులు నిర్లక్ష్యం కారణంగా వివిధ పన్నుల రూపంలో జమైనా ప్రజాధనం జరిమానా రూపంలో పీఫ్ ఖాతాకు పోవడం విశేషం. -
అనుమతికి మించి !
నగరంలో వెలుస్తున్న నిర్మాణాలు ర్యాంపులతో రోడ్డు ఆక్రమణ సెల్లార్లు సైతం అద్దెలకు ! పట్టించుకోని అధికారులు కరీంనగర్ కార్పొరేషన్ : కరీంనగర్లో భవన యజమానులు నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. ఏటా వందల సంఖ్యలో ఇళ్లు నిర్మిస్తుండగా..70 శాతం నిబంధనులకు విరుద్ధంగానే సాగుతున్నాయి. సెట్‌బ్యాక్ మొదలుకొని సెల్లార్లు, అనుమతి లేని అంతస్తులు కళ్ల ఎదుటే నిర్మిస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదు. మున్సిపాలిటీ నుంచి తీసుకున్న అనుమతికి నిర్మాణాలకు సంబంధం ఉండడం లేదు. సెల్లార్లకు అనుమతే లేదు కరీంనగర్ నగరపాలక సంస్థలో అసలు సెల్లార్లకు అనుమతులే లేవు. అయినా 100 గజాల స్థలంలోనూ సెల్లార్ నిర్మిస్తున్నారు. బహుళ అంతస్తుల భవనాల్లో 70 శాతానికి పైగా నిర్మాణాలకు సెల్లార్లు తీస్తున్నారు. పైగా సెమీ సెల్లార్ పేరుతో అధికారుల కళ్లకు ‘మామూలు’గానే గంతలు కడుతున్నారు. సెల్లార్ నిర్మించినా పార్కింగ్ చేసిన దాఖలాలు లేవు. వాటిని కూడా వ్యాపార అవసరాలు అద్దెలకు ఇచ్చుకుంటున్నారు. పెద్దపెద్ద వాణిజ్య సముదాయాలకు కూడా సెల్లార్ పార్కింగ్లు లేవు. ఆస్పత్రులు, షాపింగ్‌మాల్స్ ఎదుట రోడ్లపైనే పార్కింగ్ చేస్తున్నారు. కార్పొరేషన్ అధికారులు సైతం అప్పుడప్పుడు హడావిడి చేస్తూ నోటీసులతో చేతులు దులుపుకుంటున్నారు. పెంట్‌హౌస్‌లపై చర్యల్లేవు భవన నిర్మాణాల్లో నిబంధనలు తుంగలో తొక్కుతున్నారు. స్థలాన్ని బట్టి సిల్టుతో కలుపుకొని జీ+1 నుంచి జీ+4 వరకు అనుమతులు ఇస్తుంటారు. 100 గజాలలోపు స్థలం ఉంటే జీ+1, 200 గజాలపైన ఉంటే జీ+2, 500 గజాల స్థలం ఉంటే జీ+4 వరకు అనుమతులు మంజూరు చేస్తారు. అయితే భవనం చిన్నదైనా పెద్దదైనా అసలుకు కొసరు ఉండాల్సిందే అన్నట్లు నిర్మాణదారులు తయారయ్యారు. రెండు నుంచి నాలుగు అంతస్తుల వరకు ఉండే భవనాల్లో తప్పనిసరిగా పెంట్‌హౌస్ నిర్మిస్తున్నారు. అధికారులు అడ్డుకుంటే అయితే రాజకీయ పలుకుబడి, లేదంటే డబ్బు ఎరజూపి కాపాడుకుంటున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి అక్రమ సెల్లార్లు, పెంట్‌హౌస్‌లపై చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. చర్యలు చేపడతాం – రవీందర్, ఏసీపీ నగరంలో సెల్లార్లను కమర్షియల్ అవసరాలకు వాడుతున్న పలు భవన యజమానులకు గతంలో నోటీసులు జారీ చేశాం. కొందరి నుంచి సమాధానం వచ్చింది. సెల్లార్లకే ఉపయోగిస్తామని హామీ ఇచ్చారు. అనుమతుల్లేకుండా నిర్మిస్తున్న పెంట్‌హౌస్‌లపై చర్యలు చేపడతాం. ఆన్లైన్ ద్వారా భవన అనుమతుల కోసం రెండు నెలల్లో 51 దరఖాస్తులు వచ్చాయి. వీటిని పరిశీలించి అనుమతులు ఇస్తాం. ఎలాంటి తప్పులు జరిగినా కఠిన చర్యలు తీసుకుంటాం. -
కాసులిస్తే కానిదేది?
కాసులిస్తే చాలు కరీంనగర్ కార్పొరేషన్లో కానిదంటూ ఏదీ లేదు. నిబంధన ఉన్నా లేకున్నా అసలు పోస్టే లేకున్నా డబ్బులిస్తే చాలు పదోన్నతి ఇచ్చేందుకు అధికారులు ఏమాత్రం వెనుకాడరు. పాలకవర్గాన్ని తప్పుదోవపట్టిస్తూ కొందరు ‘ముఖ్య’ ప్రతినిధుల అండతో లేని పోస్టుకు పదోన్నతి ఇవ్వడానికి ఫైల్ చకాచకా కదులుతున్న తీరే ఇందుకు నిదర్శనం. కరీంనగర్ సిటీ: కరీంనగర్ నగరపాలక సంస్థ కార్యాలయంలో రెవెన్యూ అధికారి(ఆర్ఓ)గా పనిచేస్తున్న మక్సూద్మీర్జాకు మేనేజర్‌గా పదోన్నతి కల్పించేందుకు రంగం సిద్ధమైంది. నగరపాలక సంస్థ పరంగా సీనియారిటీ ప్రకారం ఆయనకు మేనేజర్‌గా పదోన్నతి ఇవ్వొచ్చని, దీనికి ఆమోదం తెలపాలంటూ ఫైల్ నెం.సి1/1593/2014-15 ద్వారా కౌన్సిల్ ఎజెండాలో పొందుపరిచారు. గత డిసెంబర్ 31న జరిగిన పాలకవర్గ సమావేశంలో ఈ అంశం ఆమోదం పొందింది. సాధారణ పదోన్నతే కదా ఇందులో విశేషమేమిటనే సందేహం రావడం సహజం. అయితే ఇక్కడే అసలు విషయం దాగి ఉంది. అసలు నగరపాలక సంస్థలో మేనేజర్ పోస్టే లేదు. లేని పోస్టు కోసం పదోన్నతి డ్రామా జోరుగా సాగుతుండటం విస్మయానికి గురిచేస్తోంది. కరీంనగర్ మున్సిపాలిటీగా ఉన్న సమయంలో మేనేజర్ పోస్టు ఉండేది. కైలాసం అనే అధికారి మేనేజర్‌గా పనిచేస్తూ 2013, నవంబర్ 30న ఉద్యోగ విరమణ పొందారు. అప్పటినుంచి మేనేజర్ పోస్టు ఖాళీగా ఉంది కాబట్టి రెగ్యులర్ మేనేజర్ ‘అవసరం అత్యంత ఆవశ్యకం’ అంటూ ఆర్ఓకు పదోన్నతి ఇస్తున్నట్లు ఎజెండాలో పేర్కొన్నారు. జీఓ ఎంఎస్ నెం.1368, ఎంఎ తేది: 28-12-1981 ప్రకారం మేనేజర్ పోస్టులో నియమించేందుకు జనరల్ బాడీ ఆమోదం పొందాలని పేర్కొన్నారు. కాని అంతకుముందే నగరపాలక సంస్థలో మేనేజర్ పోస్టును రద్దుపరిచి, ఆ స్థానంలో అసిస్టెంట్ కమిషనర్ పోస్టును ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జీఓ ఎంఎస్ నెం.218, తేదీ: 15-06-2011న ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం మేనేజర్ పోస్టు కేవలం మున్సిపాలిటీలకే వర్తిస్తుంది తప్ప నగరపాలక సంస్థకు కాదు. అప్పటికే పనిచేస్తున్న మేనేజర్ రిటైర్డ్ కాగానే ఈ ఉత్తర్వు అమలులోకి వచ్చింది. కాని ఘనత వహించిన నగరపాలక సంస్థ అధికారులు మాత్రం కౌన్సిల్‌ను తప్పుదోవ పట్టిస్తూ ఆర్ఓకు మేనేజర్‌గా పదోన్నతి కల్పించేందుకు సిద్ధపడ్డారు. గతంలో మేనేజర్‌గా ఉన్న కైలాసం ఉద్యోగ విరమణ పొంది సంవత్సరం గడిచినా పట్టించుకోని అధికారులు, అకస్మాత్తుగా ఇప్పుడు ఫైల్ పెట్టడానికి కారణం ఊహించడం కష్టం కాదు. ఎజెండాలో పేర్కొన్నట్లు మేనేజర్ ‘అవసరం అత్యంత ఆవశ్యక’మైతే ఇన్నాళ్లు ఏం చేశారనేదే ప్రశ్న. పదోన్నతికి పెద్ద తతంగమే... అసిస్టెంట్ కమిషనర్‌కు బదులు లేని మేనేజర్‌కు పదోన్నతి కల్పించడానికి పెద్ద తతంగమే నడుస్తోంది. మేనేజర్‌గా పదోన్నతి కల్పించే అధికారం నగరపాలక సంస్థకు ఉంది. అదే అసిస్టెంట్ కమిషనర్‌గా పదోన్నతి కల్పించాలంటే ప్రభుత్వమే చేయాల్సి ఉంటుంది. పైగా సీనియారిటీ ప్రకారం ఆ పోస్టును భర్తీ చేస్తారు. అంటే అసిస్టెంట్ కమిషనర్‌గా పదోన్నతి కోసం ఏ కార్పొరేషన్ నుంచి అయినా పోటీపడొచ్చు. మేనేజర్‌గా పదోన్నతి స్థానికంగానే ఇవ్వొచ్చు. మీర్జా కం టే వరంగల్ కార్పొరేషన్ అధికారి ఒకరు సీని యారిటీ జాబితాలో ముందున్నారు. నిబంధనల ప్రకారం అయితే ఆయనకు అసిస్టెంట్ కమిషనర్‌గా పదోన్నతి రావడం కష్టమే. పైగా మరో మూడు నెలల్లో ఆయన సర్వీస్ పూర్తవుతుంది. అందుకే లేని పోస్టును చూపిస్తూ చేతిలో పని కాబట్టే మేనేజర్‌గా పదోన్నతి కల్పించేందుకు రంగం సిద్ధమైంది. హడావుడిగా ఈ ఫైల్‌ను ముందుకు కదిలించడంలో రూ.లక్షలు చేతులు మారాయనే ఆరోపణలు వినవస్తున్నాయి. కాసులు అందాయి కాబట్టే లేని పోస్టుకు సైతం పదోన్నతి కల్పించే సాహసం చేశారనే విమర్శలు వస్తున్నాయి. జీవో 151 ప్రకారం 11 మందికి పదోన్నతి నిబంధనల ప్రకారం ఇవ్వాల్సిన పదోన్నతులను మాత్రం అధికారులు పట్టించుకోవడం లేదు. మున్సిపాలిటీ పోస్టులను ప్రభుత్వం రివైజ్డ్ చేసిన సమయంలో నగరపాలక సంస్థకు ఏడు సూపరింటెండెంట్ పోస్టులు వచ్చాయి. జీఓ 151 ప్రకారం ముగ్గురు సీనియర్ అసిస్టెంట్లు ఎండీ.ఖాదర్ మొయినొద్దిన్, వి.రాములు, మోసిన్ బిన్ అవాజ్లకు సూపరింటెండెంట్‌గా పదోన్నతి కల్పించారు. వీరితో పాటు నలుగురు జూనియర్ అసిస్టెంట్లు, ఒక రికార్డు అసిస్టెంట్‌కు సీనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతి ఇచ్చారు. నాన్ పీహెచ్ వర్కర్లైన రాణి, పెంటూష, ఖాజాలకు జూనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పిస్తూ అప్పటి స్పెషల్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ ఉత్తర్వులు జారీ చేశారు. నాటి కమిషనర్ అమయ్కుమార్పై పలు ఆరోపణలు రావడంతో పదోన్నతులను ‘సెట్సైడ్’ ఆర్డర్లో పెట్టారు. దీనిపై ఉద్యోగులు ట్రిబ్యునల్‌ను ఆశ్రయించగా, సెట్సైడ్ ఆర్డర్‌పై స్టే వచ్చింది. ఇచ్చిన పదోన్నతులు సక్రమంగానే ఉన్నాయని మున్సిపల్ నుంచి కౌంటర్ దాఖలు చేస్తే ఈ ఉద్యోగులు సీనియారిటీ నష్టపోకుండా ఉంటారు. కాని కార్పొరేషన్ అధికారులు ఈ ప్రయత్నం చేయడం లేదు. పైగా లేని మేనేజర్ పోస్టులో పదోన్నతి ఇచ్చేందుకు మాత్రం అమితాసక్తి కనబరుస్తున్నారు. కౌన్సిల్‌ను సైతం తప్పుదోవ పట్టించి జరుగుతున్న పదోన్నతి తతంగంపై ఉన్నతాధికారులు దృష్టిసారించాల్సిన అవసరముంది. -
న‘గరం’...గరంగా..
టవర్‌సర్కిల్: కరీంనగర్ నగరపాలక సంస్థ సమావేశం మందిరంలో గురువారం జరిగిన తొలి అత్యవసర సమావేశం వాడివేడిగా జరిగింది. రంజాన్ పండుగ ఏర్పాట్లపై ఈనెల 21న మజీద్ కమిటీలతో జరిపిన సమావేశానికి అధికార పక్షం కార్పొరేటర్లకు మాత్రమే సమాచారమిచ్చారని, తమ డివిజన్లలోనూ ముస్లింలు ఉన్నారని, తమకెందుకు సమాచారం ఇవ్వలేదని కాంగ్రెస్ ఫ్లోర్‌లీడర్ గందె మాధవి నిలదీశారు. మజీదు కమిటీలను మాత్రమే ఆహ్వానించామని టీఆర్ఎస్ ఫ్లోర్‌లీడర్ ఆరిఫ్ సమాధానపరిచేందుకు ప్రయత్నించినా ఆమె శాంతించలేదు. అజెండా కాపీని రాత్రి 10.30 గంటలకు అందజేస్తే అందులోని అంశాలను ఎలా అవగాహన చేసుకుంటామని, ఇదంతా ప్రతిపక్షాల గొంతునొక్కడానికి పన్నిన కుట్ర అని విమర్శించారు. కమిషనర్ పాలకవర్గానికి వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. ప్రణాళిక కార్యక్రమం ఈనెల 21వరకు జరగడంతో అంచనాలు రూపొందించడం ఆలస్యమైందని, రాజకీయాలు పక్కన పెట్టి అజెండా లో ఉన్న వాటిపై మాట్లాడాలని మేయర్ రవీందర్‌సింగ్ నచ్చజెప్పేప్రయత్నంచేశారు. డెప్యూటీ మేయర్ గుగ్గిళ్లపు రమేశ్ మాట్లాడుతూ.. ఎవ రూ రాద్ధాంతం చేయొద్దని, కొత్త ఆలోచనలతో నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుకునేందుకు క లిసికట్టుగా పనిచేయాలన్నారు. కాంగ్రెస్ ప్రభు త్వ హయాంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అప్ప టి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఏం చేసుకుంటారో చేసుకోండి అన్న విషయాన్ని మరిచిపోవద్దన్నారు. దీంతో ఆగ్రహించిన కాంగ్రెస్ కార్పొరేటర్లు తమను బెదిరిస్తున్నారని, తమ గొంతునొక్కే ప్ర యత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రచారబోర్డుల్లో అవకతవకలు జరిగాయని చెబుతున్న మే యర్ అధికారులపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. పదేపదే మాధవి అడ్డుపడుతుండడంతో మిగతావారికి మాట్లాడే అవకాశం ఇవ్వాలని ఒక్కరే మాట్లాడడం సరికాదని సభ్యులంతా ధ్వజమెత్తారు. మేం పిచ్చోళ్లం కాదని అందరికోసం మాట్లాడుతున్నామని కాం గ్రెస్ కార్పొరేటర్లు సమాధానమిచ్చారు. మొత్తమ్మీద సమావేశం వాడివేడిగా ప్రారంభమై.. అజెండా అంశాలతో ముగిసింది. ఈ సమావేశంలో అన్ని డివిజన్ల కార్పొరేటర్లు, కమిషనర్ రమేశ్ పాల్గొన్నారు. -
కరీంనగర్ కార్పోరేషన్ టిఆర్ఎస్ కైవసం
-
కాంగ్రెస్‌కే పట్టం
ఏప్రిల్ 9న ఎంపీగా నామినేషన్ 11 తర్వాత పునరంకిత సభ ఎంపీ పొన్నం ప్రభాకర్ కరీంనగర్ సిటీ, న్యూస్‌లైన్: మున్సిపల్ ఎన్నికల్లో ఓటింగ్ సరళిని చూస్తే కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని 35 డివిజన్లలో కాంగ్రెస్‌కు విజయం దక్కడం ఖాయమని ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. త్వరలో జరగనున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌కే ప్రజలు పట్టం కట్టనున్నారన్నారు. డీసీసీ కార్యాలయంలో ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల ఫలితాల తర్వాత జిల్లా నాయకులు సమష్టిగా జెడ్పీ చైర్మన్, మేయర్, చైర్మన్ అభ్యర్థులను ఎంపిక చేస్తామన్నారు. కరీంనగర్ లోకసభ కాంగ్రెస్ అభ్యర్థిగా సెగ్మెంట్ పరిధిలోని ఏడుగురు నియోజకవర్గ అభ్యర్థులతో కలిసి ఏప్రిల్ 9న తాను నామినేషన్ వేస్తానన్నారు. 11వ తేదీ తర్వాతనే సోనియాగాంధీతో పునరంకిత సభను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఏప్రిల్ ఒకటి నుంచి రోజుకు మూడు మండలాల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తానన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తొలిసారిగా వస్తున్న ఉగాది పండుగ సందర్భంగా జిల్లా ప్రజలకు పొన్నం ప్రభాకర్ శుభాకాంక్షలు తెలిపారు. అన్ని రంగాల్లో ప్రజలకు విజయం కలగాలని, జిల్లా అభివృద్ధి పథంలో పయనించాలని ఆకాంక్షించారు. సమావేశంలో పీసీసీ కార్యద ర్శులు డి.శంకర్, బొమ్మ శ్రీరాంచక్రవర్తి, అర్బన్బ్యాంక్ చైర్మన్ కర్ర రాజశేఖర్, ఏఎంసీ చైర్మన్ ఆకారపు భాస్కర్‌రెడ్డి, జిల్లా వక్ఫ్‌బోర్డు చైర్మన్ ఎస్ఏ.మోసిన్, డీసీసీ అధికార ప్రతినిధి కటకం వెంకటరమణ పాల్గొన్నారు. -
నేడే మున్సి‘పోల్స్’
కరీంనగర్ కార్పొరేషన్, న్యూస్‌లైన్ : ఆదివారం నిర్వహించే నగరపాలక సంస్థ ఎన్నికలకు సర్వం సిద్ధం చేశారు అధికారులు. 50 డివిజన్లకు జరగనున్న ఈ ఎన్నికలకు 209 పోలింగ్స్టేషన్లను ఏర్పాటు చేశారు. ఈ స్టేషన్లకు ఈవీఎంలను తరలించారు. 1130 మంది సిబ్బందిని ఎన్నికల విధులకు నియమించారు. ఇందులో 230 మంది రిటర్నింగ్, 230 మంది అసిస్టెంట్ రిటర్నింగ్, 670 మంది ఇతర ఎన్నికల సిబ్బందిని నియమించారు. 26 పోలింగ్ స్టేషన్లను సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లుగా గుర్తించి 10 పోలింగ్ స్టేషన్లలో మైక్రో అబ్జర్వర్లు, 16 పోలింగ్ స్టేషన్లలో వీడియోగ్రాఫర్లను ఏర్పాటు చేశారు. 50 డివిజన్లకు 17 రూట్లు ఏర్పాటు చేశారు. ప్రతి రూట్‌కు ఒక జోనల్ ఆఫీసర్, ఒక రూట్ ఆఫీసర్‌ను కేటాయించారు. ఎన్నికల సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఉన్నాతాధికారులకు తెలియపరిచేందుకు జోనల్ అధికారులకే విధులు అప్పగించారు. తేలనున్న అభ్యర్థుల భవితవ్యం 50 డివిజన్లకు వివిధ పార్టీలకు చెందిన 376 మంది పోటీలో ఉన్నారు. ఆదివారం జరగనున్న పోలింగ్‌తో వారి భవిత ఈవీఎం బాక్సుల్లో నిక్షిప్తం కానుంది. కార్పొరేషన్ పరిధిలో 2,28,872 ఓటర్లున్నారు. వీరిలో పురుషులు 1,18,886 మంది మహిళలు 1,09,970, ఇతరులు 16 మంది ఉన్నారు. యువతను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు తమ ప్రచారాన్ని ఆ దిశగానే కొనసాగించారు. మహిళల ఓట్లతో పాటు గ్రూపు మహిళల ఓట్లు కీలకం కావడంతో గ్రూపులను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు తమ శాయశక్తుగా ప్రలోభాలకు గురిచేస్తూ ప్రచారాన్ని నిర్వహించారు. ఆయా పార్టీల ఎంపీ, ఎమ్మెల్యేలు విస్తృతంగా ప్రచారంలో పాల్గొని అభ్యర్థులకు మద్దతుగా పాదయాత్రలను, ప్రచారాన్ని నిర్వహించారు. అభ్యర్థులు, నాయకులు హామీలు, వాగ్దానాలు, చేయబోయే అభివృద్ది కార్యక్రమాలను వారి ప్రచారంలో ఊదరగొట్టినప్పటికీ.. ఓటర్లు తమ మనస్సాక్షితో నేడు వేసే ఓటుతోనే వారి భవతవ్యం తేటతెల్లం కానుంది. -
ఎన్నికల్లో మైక్రో అబ్జర్వర్ల పాత్ర కీలకం
కరీంనగర్ కార్పొరేషన్, న్యూస్‌లైన్ : ఎన్నికలు స్వేచ్ఛాయుతంగా నిర్వహించడంలో మైక్రో అబ్జర్వర్ల పాత్ర ఎంతో అవసరమని జిల్లా ఎన్నికల పరిశీలకులు పి.పార్థసారథి అన్నారు. గురువారం కళాభారతిలో మైక్రో ఆబ్జర్వర్లకు శిక్షణ కల్పించారు. ఆబర్వర్లకు ఎన్నికల విధుల్లో ప్రత్యక్ష పాత్ర లేకున్నా.. నిఘా నేత్రాలతో పరిశీలిస్తూ తప్పిదాలు, ఉల్లంఘనలు జరిగినా వెంటనే ఎన్నికల పరిశీలకుల దృష్టికి తేవాలన్నారు. పోలింగ్‌కు ముందు మాక్ పోల్, ఓటింగ్ గది, పోలింగ్ స్టేషన్‌ను పరిశీలించాలని సూచించారు. అభ్యర్థికి ఒక పోలింగ్ ఏజెంట్ మాత్రమే పోలింగ్ కేంద్రంలో ఉండేలా చూడాలన్నారు. అబ్జర్వర్ల కోసం జిల్లాస్థాయిలో నోడల్ అధికారిని, కార్పొరేషన్, మున్సిపల్ స్థాయిలో ఒక్కో నోడల్ అధికారిని నియమించామన్నారు. వి.ఉషారాణి మాట్లాడుతూ ఎన్నికలు, ఏర్పాట్లు, రాజకీయ నాయకుల ప్రవర్తన సక్రమంగా ఉందా? లేదో? చూసే బాధ్యత మైక్రో అబ్జర్వర్లపై ఉందన్నారు. పోలింగ్ కేంద్రాల్లో సెల్‌ఫోన్ స్విఛాఫ్ చేయాలన్నారు. పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌పై అవగాహన కల్పించారు. ఈవీఎంల పనితీరుపై మాక్‌పోల్ నిర్వహణపై ఆచరణాత్మకంగా చేసి చూపించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో చంద్రశేఖర్, కరీంనగర్ కార్పొరేషన్ కమిషనర్ కె.రమేశ్, ఆర్వీఎం పీవో శ్యాంప్రసాద్‌లాల్, మైక్రో ఆబ్జర్వర్లు పాల్గొన్నారు