అనుమతికి మించి !
-
నగరంలో వెలుస్తున్న నిర్మాణాలు
-
ర్యాంపులతో రోడ్డు ఆక్రమణ
-
సెల్లార్‌లు సైతం అద్దెలకు !
-
పట్టించుకోని అధికారులు
కరీంనగర్ కార్పొరేషన్ : కరీంనగర్‌లో భవన యజమానులు నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. ఏటా వందల సంఖ్యలో ఇళ్లు నిర్మిస్తుండగా..70 శాతం నిబంధనులకు విరుద్ధంగానే సాగుతున్నాయి. సెట్‌బ్యాక్ మొదలుకొని సెల్లార్‌లు, అనుమతి లేని అంతస్తులు కళ్ల ఎదుటే నిర్మిస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదు. మున్సిపాలిటీ నుంచి తీసుకున్న అనుమతికి నిర్మాణాలకు సంబంధం ఉండడం లేదు.
సెల్లార్‌లకు అనుమతే లేదు
కరీంనగర్ నగరపాలక సంస్థలో అసలు సెల్లార్‌లకు అనుమతులే లేవు. అయినా 100 గజాల స్థలంలోనూ సెల్లార్ నిర్మిస్తున్నారు. బహుళ అంతస్తుల భవనాల్లో 70 శాతానికి పైగా నిర్మాణాలకు సెల్లార్‌లు తీస్తున్నారు. పైగా సెమీ సెల్లార్ పేరుతో అధికారుల కళ్లకు ‘మామూలు’గానే గంతలు కడుతున్నారు. సెల్లార్ నిర్మించినా పార్కింగ్ చేసిన దాఖలాలు లేవు. వాటిని కూడా వ్యాపార అవసరాలు అద్దెలకు ఇచ్చుకుంటున్నారు. పెద్దపెద్ద వాణిజ్య సముదాయాలకు కూడా సెల్లార్ పార్కింగ్‌లు లేవు. ఆస్పత్రులు, షాపింగ్‌మాల్స్ ఎదుట రోడ్లపైనే పార్కింగ్ చేస్తున్నారు. కార్పొరేషన్ అధికారులు సైతం అప్పుడప్పుడు హడావిడి చేస్తూ నోటీసులతో చేతులు దులుపుకుంటున్నారు.
పెంట్‌హౌస్‌లపై చర్యల్లేవు
భవన నిర్మాణాల్లో నిబంధనలు తుంగలో తొక్కుతున్నారు. స్థలాన్ని బట్టి సిల్టుతో కలుపుకొని జీ+1 నుంచి జీ+4 వరకు అనుమతులు ఇస్తుంటారు. 100 గజాలలోపు స్థలం ఉంటే జీ+1, 200 గజాలపైన ఉంటే జీ+2, 500 గజాల స్థలం ఉంటే జీ+4 వరకు అనుమతులు మంజూరు చేస్తారు. అయితే భవనం చిన్నదైనా పెద్దదైనా అసలుకు కొసరు ఉండాల్సిందే అన్నట్లు నిర్మాణదారులు తయారయ్యారు. రెండు నుంచి నాలుగు అంతస్తుల వరకు ఉండే భవనాల్లో తప్పనిసరిగా పెంట్‌హౌస్ నిర్మిస్తున్నారు. అధికారులు అడ్డుకుంటే అయితే రాజకీయ పలుకుబడి, లేదంటే డబ్బు ఎరజూపి కాపాడుకుంటున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి అక్రమ సెల్లార్‌లు, పెంట్‌హౌస్‌లపై చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.
చర్యలు చేపడతాం
– రవీందర్, ఏసీపీ
నగరంలో సెల్లార్‌లను కమర్షియల్ అవసరాలకు వాడుతున్న పలు భవన యజమానులకు గతంలో నోటీసులు జారీ చేశాం. కొందరి నుంచి సమాధానం వచ్చింది. సెల్లార్‌లకే ఉపయోగిస్తామని హామీ ఇచ్చారు. అనుమతుల్లేకుండా నిర్మిస్తున్న పెంట్‌హౌస్‌లపై చర్యలు చేపడతాం. ఆన్‌లైన్ ద్వారా భవన అనుమతుల కోసం రెండు నెలల్లో 51 దరఖాస్తులు వచ్చాయి. వీటిని పరిశీలించి అనుమతులు ఇస్తాం. ఎలాంటి తప్పులు జరిగినా కఠిన చర్యలు తీసుకుంటాం.