![Private Hospitals Treating Covid Without Permission - Sakshi](/styles/webp/s3/article_images/2020/08/27/Private-Hospitals-Treating-.gif.webp?itok=IKQJQlTh)
భీమవరంలో ప్రైవేటు ఆస్పత్రిని తనిఖీ చేస్తున్న వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు(ఫైల్)
సాక్షి ప్రతినిధి, ఏలూరు: కోవిడ్ మహమ్మారిని అడ్డం పెట్టుకుని వైద్యం పేరుతో దోపిడీ చేస్తున్న ప్రైవేటు ఆస్పత్రులకు ప్రభుత్వం చెక్ పెట్టింది. మానవత్వాన్ని మర్చిపోయి ధనమే పరమావధిగా వ్యవహరిస్తున్న వైద్య యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించిన సంగతి తెలిసిందే. జిల్లాలో ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ రెండు ఆస్పత్రులను సీజ్ చేసింది. మరికొన్ని ఆస్పత్రులలో తనిఖీలకు రంగం సిద్ధం చేస్తోంది. ఎవరైనా ప్రైవేటు ఆస్పత్రులలో అనుమతి లేకుండా కోవిడ్ వైద్యం చేసినా, ప్రభుత్వం నిర్ణయించిన ధరల కన్నా ఎక్కువ వసూలు చేసినా కఠినంగా వ్యవహరిస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో కోవిడ్ వైద్యానికి అనుమతి ఉన్న ఆస్పత్రులతో పాటు, ఆరోగ్యశ్రీకి అనుమతి ఉన్న ఆస్పత్రుల యాజమాన్యాలతో కలెక్టర్ రేవు ముత్యాలరాజు గురువారం సమావేశం కానున్నారు.
ఏలూరు, భీమవరంలలో ఆస్పత్రుల సీజ్
ఇప్పటికే ఏలూరులోని మురళీకృష్ణ మల్టీస్పెషాలిటీ ఆస్పత్రితో పాటు భీమవరంలోని గాయత్రీ హాస్పిటల్‌పై వైద్య ఆరోగ్య శాఖ అధికారులు దాడులు చేసి వాటిలో అక్రమంగా కోవిడ్ చికిత్సలు నిర్వహిస్తున్నట్లు నిర్ధారించారు. దీంతో వాటిని సీజ్ చేసి రికార్డులు పరిశీలిస్తున్నారు. ఒకటి రెండు రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు. ఆ ఆస్పత్రుల యాజమాన్యాలకు ఇప్పటికే నోటీసులు ఇచ్చారు. వారు సమాధానం ఇచ్చిన తర్వాత క్రిమినల్ చర్యలకు ఉపక్రమించేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధమవుతోంది.
రోగుల నుంచి భారీగా డిపాజిట్లు: మురళీకృష్ణ ఆస్పత్రిలో తనిఖీలు చేసినప్పుడు ఒక్కో రోగిని చేర్చుకునే ముందు వారి వద్ద నుంచి 2 లక్షల రూపాయల వరకూ డిపాజిట్లు కట్టించుకున్నట్లు నిర్ధారణైంది. ఆ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 12 మంది వరకూ మృత్యువాత పడినట్లు సమాచారం. కనీసం వెంటిలేటర్ సదుపాయం కూడా లేకుండానే ఈ ఆస్పత్రి వైద్యం పేరుతో దోపిడీకి పాల్పడినట్లు అధికారుల తనిఖీలలో తేలింది. గాయత్రి ఆస్పత్రిలో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఇటీవల ఓ సచివాలయ ఉద్యోగి భర్త కూడా ఇదే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆస్పత్రి వైఫల్యం వల్లే తన భర్త చనిపోయాడంటూ ఆ మహిళ ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. ఇంకా చాలా ప్రైవేటు వైద్యశాలల్లో అనుమతి లేకుండా కరోనా రోగులకు వైద్యం జరుగుతున్నట్టు తెలుస్తోంది. అదేవిధంగా రెమిడిసివిర్ మందులు కూడా పెద్ద ఎత్తున వాడుతున్నట్లు తెలిసింది.
ప్రైవేటుకు ప్రభుత్వ కిట్లు: ఇదే సమయంలో ప్రభుత్వం ఉపయోగిస్తున్న కోవిడ్–19 ఏజీ రాపిడ్ కిట్లను కూడా ప్రైవేటు ల్యాబ్‌లలో గుర్తించారు. ఈ కిట్లు కేవలం ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ఉంటాయి. ఈ కిట్లు అడ్దదారిలో ప్రైవేటు ఆస్పత్రులకు, ల్యాబ్‌లకు వెళ్లిపోవడం వెనుక ప్రభుత్వ ఉద్యోగుల సహకారం ఉన్నట్లు స్పష్టంగా కనపడుతోంది. ఈ ఇంటిదొంగలపై చర్యలు తీసుకునేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఎక్కడ కిట్లు మాయమయ్యాయి? ఎవరు సరఫరా చేస్తున్నారు? అన్న అంశాలపై విచారణ చేస్తున్నారు. కరోనా నిర్ధారణ పరీక్షలు చేయాలంటే ప్రభుత్వం నుంచి అనుమతి తప్పనిసరి. అయితే ల్యాబ్ నిర్వాహకులు అనుమతులు లేకుండా కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తుండగా, ప్రైవేటు ఆస్పత్రులు అసలు కోవిడ్ పరీక్షలు చేయకుండా సీటీ స్కాన్ చేసి దాని ద్వారా కోవిడ్ వైద్యం చేసేస్తున్నారు.
ఫైర్ ఎన్‌వోసీ తప్పనిసరి : డీఎంహెచ్‌ఓ
విజయవాడ కోవిడ్ సెంటర్లో జరిగిన అగ్నిప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకుని ఫైర్ ఎన్‌వోసీ తప్పనిసరి చేసినట్లు డీఎంహెచ్‌ఓ కె.సునంద తెలిపారు. ఫైర్ సేఫ్టీ లేకపోతే కొత్తగా అనుమతులు ఇవ్వబోమని, ఇప్పుడు ఉన్న ఆస్పత్రులకు కూడా ఫైర్‌సేఫ్టీ ఏర్పాటు చేసుకోవాలని, లేకుంటే ఆస్పత్రులు మూసివేస్తామని హెచ్చరించారు. అనుమతి లేకుండా వైద్యం చేసినా, రోగుల ప్రాణాలతో చెలగాటం ఆడినా ప్రైవేటు ఆస్పత్రుల్లో తనిఖీలు కొనసాగిస్తామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment