కాసులిస్తే చాలు కరీంనగర్ కార్పొరేషన్‌లో కానిదంటూ ఏదీ లేదు. నిబంధన ఉన్నా లేకున్నా అసలు పోస్టే లేకున్నా డబ్బులిస్తే చాలు పదోన్నతి ఇచ్చేందుకు అధికారులు ఏమాత్రం వెనుకాడరు. పాలకవర్గాన్ని తప్పుదోవపట్టిస్తూ కొందరు ‘ముఖ్య’ ప్రతినిధుల అండతో లేని పోస్టుకు పదోన్నతి ఇవ్వడానికి ఫైల్ చకాచకా కదులుతున్న తీరే ఇందుకు నిదర్శనం.
కరీంనగర్ సిటీ:
కరీంనగర్ నగరపాలక సంస్థ కార్యాలయంలో రెవెన్యూ అధికారి(ఆర్‌ఓ)గా పనిచేస్తున్న మక్సూద్‌మీర్జాకు మేనేజర్‌గా పదోన్నతి కల్పించేందుకు రంగం సిద్ధమైంది. నగరపాలక సంస్థ పరంగా సీనియారిటీ ప్రకారం ఆయనకు మేనేజర్‌గా పదోన్నతి ఇవ్వొచ్చని, దీనికి ఆమోదం తెలపాలంటూ ఫైల్ నెం.సి1/1593/2014-15 ద్వారా కౌన్సిల్ ఎజెండాలో పొందుపరిచారు.
గత డిసెంబర్ 31న జరిగిన పాలకవర్గ సమావేశంలో ఈ అంశం ఆమోదం పొందింది. సాధారణ పదోన్నతే కదా ఇందులో విశేషమేమిటనే సందేహం రావడం సహజం. అయితే ఇక్కడే అసలు విషయం దాగి ఉంది. అసలు నగరపాలక సంస్థలో మేనేజర్ పోస్టే లేదు. లేని పోస్టు కోసం పదోన్నతి డ్రామా జోరుగా సాగుతుండటం విస్మయానికి గురిచేస్తోంది.
కరీంనగర్ మున్సిపాలిటీగా ఉన్న సమయంలో మేనేజర్ పోస్టు ఉండేది. కైలాసం అనే అధికారి మేనేజర్‌గా పనిచేస్తూ 2013, నవంబర్ 30న ఉద్యోగ విరమణ పొందారు. అప్పటినుంచి మేనేజర్ పోస్టు ఖాళీగా ఉంది కాబట్టి రెగ్యులర్ మేనేజర్ ‘అవసరం అత్యంత ఆవశ్యకం’ అంటూ ఆర్‌ఓకు పదోన్నతి ఇస్తున్నట్లు ఎజెండాలో పేర్కొన్నారు.
జీఓ ఎంఎస్ నెం.1368, ఎంఎ తేది: 28-12-1981 ప్రకారం మేనేజర్ పోస్టులో నియమించేందుకు జనరల్ బాడీ ఆమోదం పొందాలని పేర్కొన్నారు. కాని అంతకుముందే నగరపాలక సంస్థలో మేనేజర్ పోస్టును రద్దుపరిచి, ఆ స్థానంలో అసిస్టెంట్ కమిషనర్ పోస్టును ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జీఓ ఎంఎస్ నెం.218, తేదీ: 15-06-2011న ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం మేనేజర్ పోస్టు కేవలం మున్సిపాలిటీలకే వర్తిస్తుంది తప్ప నగరపాలక సంస్థకు కాదు.
అప్పటికే పనిచేస్తున్న మేనేజర్ రిటైర్డ్ కాగానే ఈ ఉత్తర్వు అమలులోకి వచ్చింది. కాని ఘనత వహించిన నగరపాలక సంస్థ అధికారులు మాత్రం కౌన్సిల్‌ను తప్పుదోవ పట్టిస్తూ ఆర్‌ఓకు మేనేజర్‌గా పదోన్నతి కల్పించేందుకు సిద్ధపడ్డారు. గతంలో మేనేజర్‌గా ఉన్న కైలాసం ఉద్యోగ విరమణ పొంది సంవత్సరం గడిచినా పట్టించుకోని అధికారులు, అకస్మాత్తుగా ఇప్పుడు ఫైల్ పెట్టడానికి కారణం ఊహించడం కష్టం కాదు. ఎజెండాలో పేర్కొన్నట్లు మేనేజర్ ‘అవసరం అత్యంత ఆవశ్యక’మైతే ఇన్నాళ్లు ఏం చేశారనేదే ప్రశ్న.
పదోన్నతికి పెద్ద తతంగమే...
అసిస్టెంట్ కమిషనర్‌కు బదులు లేని మేనేజర్‌కు పదోన్నతి కల్పించడానికి పెద్ద తతంగమే నడుస్తోంది. మేనేజర్‌గా పదోన్నతి కల్పించే అధికారం నగరపాలక సంస్థకు ఉంది. అదే అసిస్టెంట్ కమిషనర్‌గా పదోన్నతి కల్పించాలంటే ప్రభుత్వమే చేయాల్సి ఉంటుంది. పైగా సీనియారిటీ ప్రకారం ఆ పోస్టును భర్తీ చేస్తారు. అంటే అసిస్టెంట్ కమిషనర్‌గా పదోన్నతి కోసం ఏ కార్పొరేషన్ నుంచి అయినా పోటీపడొచ్చు.
మేనేజర్‌గా పదోన్నతి స్థానికంగానే ఇవ్వొచ్చు. మీర్జా కం టే వరంగల్ కార్పొరేషన్ అధికారి ఒకరు సీని యారిటీ జాబితాలో ముందున్నారు. నిబంధనల ప్రకారం అయితే ఆయనకు అసిస్టెంట్ కమిషనర్‌గా పదోన్నతి రావడం కష్టమే. పైగా మరో మూడు నెలల్లో ఆయన సర్వీస్ పూర్తవుతుంది. అందుకే లేని పోస్టును చూపిస్తూ చేతిలో పని కాబట్టే మేనేజర్‌గా పదోన్నతి కల్పించేందుకు రంగం సిద్ధమైంది. హడావుడిగా ఈ ఫైల్‌ను ముందుకు కదిలించడంలో రూ.లక్షలు చేతులు మారాయనే ఆరోపణలు వినవస్తున్నాయి. కాసులు అందాయి కాబట్టే లేని పోస్టుకు సైతం పదోన్నతి కల్పించే సాహసం చేశారనే విమర్శలు వస్తున్నాయి.
జీవో 151 ప్రకారం 11 మందికి పదోన్నతి
నిబంధనల ప్రకారం ఇవ్వాల్సిన పదోన్నతులను మాత్రం అధికారులు పట్టించుకోవడం లేదు. మున్సిపాలిటీ పోస్టులను ప్రభుత్వం రివైజ్డ్ చేసిన సమయంలో నగరపాలక సంస్థకు ఏడు సూపరింటెండెంట్ పోస్టులు వచ్చాయి. జీఓ 151 ప్రకారం ముగ్గురు సీనియర్ అసిస్టెంట్లు ఎండీ.ఖాదర్ మొయినొద్దిన్, వి.రాములు, మోసిన్ బిన్ అవాజ్‌లకు సూపరింటెండెంట్‌గా పదోన్నతి కల్పించారు.
వీరితో పాటు నలుగురు జూనియర్ అసిస్టెంట్లు, ఒక రికార్డు అసిస్టెంట్‌కు సీనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతి ఇచ్చారు. నాన్ పీహెచ్ వర్కర్‌లైన రాణి, పెంటూష, ఖాజాలకు జూనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పిస్తూ అప్పటి స్పెషల్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ ఉత్తర్వులు జారీ చేశారు. నాటి కమిషనర్ అమయ్‌కుమార్‌పై పలు ఆరోపణలు రావడంతో పదోన్నతులను ‘సెట్‌సైడ్’ ఆర్డర్‌లో పెట్టారు.
దీనిపై ఉద్యోగులు ట్రిబ్యునల్‌ను ఆశ్రయించగా, సెట్‌సైడ్ ఆర్డర్‌పై స్టే వచ్చింది. ఇచ్చిన పదోన్నతులు సక్రమంగానే ఉన్నాయని మున్సిపల్ నుంచి కౌంటర్ దాఖలు చేస్తే ఈ ఉద్యోగులు సీనియారిటీ నష్టపోకుండా ఉంటారు. కాని కార్పొరేషన్ అధికారులు ఈ ప్రయత్నం చేయడం లేదు. పైగా లేని మేనేజర్ పోస్టులో పదోన్నతి ఇచ్చేందుకు మాత్రం అమితాసక్తి కనబరుస్తున్నారు. కౌన్సిల్‌ను సైతం తప్పుదోవ పట్టించి జరుగుతున్న పదోన్నతి తతంగంపై ఉన్నతాధికారులు దృష్టిసారించాల్సిన అవసరముంది.
కాసులిస్తే కానిదేది?
Published Sat, Jan 3 2015 2:19 AM | Last Updated on Sat, Sep 2 2017 7:07 PM
Advertisement
Advertisement