సాక్షి, కరీంనగర్ : పార్లమెంటు ఎన్నికల్లో సాధించిన అనూహ్య విజయాలతో పట్టణాల్లో పాగా వేయాలని కమలనాథులు ఉవ్విళ్లూరుతున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో కరీంనగర్‌లో బీజేపీ భారీ మెజారిటీ సాధించడానికి కారణమైన అసెంబ్లీ సెగ్మెంట్లలోని పురపాలికలను తొలుత బీజేపీ నేతలు టార్గెట్ చేసుకున్నారు. పట్టణాల్లో బీజేపీకి అంతో ఇంతో బలం ఉండడం, తాజాగా పార్లమెంటు ఎన్నికల్లో ‘పువ్వు’ గుర్తు జనాల్లోకి వెళ్లడంతో పురపాలక సంఘాలను కైవసం చేసుకోవాలని ఆ పార్టీ పట్టుదలతో ఉంది. దీనికి తోడు కరీంనగర్ నుంచి విజయం సాధించిన ఎంపీ బండి సంజయ్‌కుమార్ కరీంనగర్ కార్పొరేషన్‌తోపాటు పార్లమెంటు పరిధిలోని మెజారిటీ మునిసిపాలిటీల్లో కాషాయజెండా ఎగురవేయించాలనే పట్టుదలతో ఉన్నారు. ఇందుకోసం తొలుత కరీంనగర్ కార్పొరేషన్‌ను టార్గెట్‌గా చేసుకున్నారు.
గత లోక్‌సభ ఎన్నికల్లో భారీ మెజారిటీ ఇచ్చిన చొప్పదండి, కొత్తపల్లి, వేములవాడ మునిసిపాలిటీల్లో సానుకూల ఫలితాలు పొందే దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ మునిసిపాలిటీల్లోని వార్డుల్లో గెలిచే స్థాయి నాయకులు ఎంత మేరకు ఉన్నారనేది ఇప్పుడు పార్టీ నేతలను తొలుస్తున్న ప్రశ్న. హుజూరాబాద్ నియోజకవర్గంలోని హుజూరాబాద్, జమ్మికుంటతోపాటు కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లపై బీజేపీకి పెద్దగా ఆశలు లేకపోయినా, ఇక్కడ కూడా అభ్యర్థులను నిలిపి బలం పెంచుకునే ఆలోచనతో ఉన్నారు.
కరీంనగర్ బల్దియాపై కాషాయమే లక్ష్యంగా..
మైనారిటీ వర్గాల ప్రభావం అధికంగా ఉన్న కరీంనగర్ మునిసిపల్ కార్పొరేషన్‌లో డివిజన్ల సంఖ్య 50 నుంచి 60కి పెరిగింది. కొత్తగా కలిసిన 8 గ్రామాలతో పది వార్డులు పెరిగాయి. అదే సమయంలో మైనారిటీ వర్గాల ప్రభావం ఉన్న డివిజన్ల సంఖ్య కూడా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఎంపీ బండి సంజయ్ మెజారిటీ ఓటు బ్యాంకును లక్ష్యంగా చేసుకుని ఎన్నికల్లో లబ్ధి పొందాలనే ఆలోచనతో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. మిత్రపక్షాలుగా ఉన్న టీఆర్‌ఎస్, ఎంఐఎంలకు ఓటు వేయడం వల్ల కరీంనగర్ ఇమేజ్ దెబ్బతింటుందని ఇప్పటికే ప్రచారం ప్రారంభించారు. పార్లమెంటు ఎన్నికల్లో కూడా ఇదే అంశాన్ని విభిన్న రీతుల్లో ప్రచారం చేసి ధర్మం పేరుతో ‘హిందుత్వ’ ఎజెండాను ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఈసారి కూడా ఇదే అంశాన్ని జనాల్లోకి బలంగా తీసుకెళ్లాలని నిర్ణయించారు.
స్మార్ట్‌సిటీ ప్రచార అస్త్రంగా...
కరీంనగర్‌ను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమే స్మార్ట్‌సిటీగా ప్రకటించిందని, నిధులను సక్రమంగా వెచ్చించడంలో ఇప్పటివరకు బల్దియాను ఏలిన టీఆర్‌ఎస్ విఫలమైందనే ప్రచారానికి బీజేపీ తెరలేపింది. కార్పొరేషన్‌లో బీజేపీ అధికారంలో ఉంటే మరిన్ని నిధులు తీసుకురావడంతోపాటు నగరాన్ని అభివృద్ధి చేస్తామని సంజయ్ తన ప్రసంగాల్లో చెబుతున్నారు. ఒక రకంగా రేపటి ఎన్నికల్లో ఇదే ప్రధాన ప్రచారాస్త్రంగా మారనుందన్న మాట. అయితే ముఖ్యమంత్రి కేసీఆర్, అప్పటి ఎంపీ వినోద్‌కుమార్ వల్లనే కరీంనగర్‌ను స్మార్ట్‌సిటీ జాబితాలో చేర్చినట్లు టీఆర్‌ఎస్ నేతలు చెబుతున్నారు. ఎమ్మెల్యే కమలాకర్ ఓ అడుగు ముందుకేసి ‘పేరుకే స్మార్ట్‌సిటీ తప్ప రూపాయి రావడం లేదు. బీజేపీ నేతలకు చిత్తశుద్ధి లేదు’ అని బాహాటంగానే విమర్శిస్తున్నారు. పురపాలక ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఏమాత్రం పరిగణనలోకి తీసుకోకుండా టీఆర్‌ఎస్‌ను టార్గెట్ చేయాలని వ్యూహాత్మకంగా బీజేపీ నేతలు ముందుకు సాగుతున్నారు.
పట్టణాల్లో బీజేపీకి గెలిచే కేడర్ ఎక్కడ..?
కరీంనగర్‌లో సంజయ్ ఇమేజ్‌కు తోడు మోదీ హవాతో పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. ఆ ప్రభావం కొంత మేర పట్టణాల్లో ఇప్పటికి ఉన్నప్పటికీ, బీజేపీ అభ్యర్థులను గెలిపించే స్థాయిలో పనిచేస్తుందా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. కరీంనగర్‌లో గత మునిసిపల్ ఎన్నికల్లో సంజయ్‌తోపాటు విజయ మాత్రమే బీజేపీ నుంచి కార్పొరేటర్లుగా గెలుపొందారు. ఇప్పుడు కరీంనగర్ మునిసిపాలిటీని కైవసం చేసుకోవాలంటే కనీసం 31 మంది కార్పొరేటర్లు గెలవాలి. కరీంనగర్‌లో కొంత మేర సంజయ్ ఎఫెక్ట్ ఇప్పటికీ ఉన్నా, మిగతా మునిసిపాలిటీల్లో పరిస్థితి అంత ఈజీగా లేదని ఆ పార్టీ వర్గాలే చెబుతున్నాయి. హుజూరాబాద్, జమ్మికుంట మునిసిపాలిటీల్లో మంత్రి ఈటల ప్రభావం ఎక్కువగా ఉంది. సిరిసిల్ల మునిసిపాలిటీలో ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రామన్న చేసిన అభివృద్ధి పనులే అడుగడుగునా కనిపిస్తున్నాయి. చొప్పదండి, కొత్తపల్లి కొత్త మునిసిపాలిటీలే. వేములవాడ మునిసిపాలిటీలో మాత్రం ఈసారి బీజేపీ బలం పుంజుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
నేడు సభ్యత్వంతోపాటే ఎన్నికల సందడి
బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా శనివారం హైదరాబాద్‌లో ప్రారంభించారు. కరీంనగర్‌లో ఆదివారం సభ్యత్వ నమోదుకు ఎంపీ సంజయ్‌కుమార్, జిల్లా పార్టీ అధ్యక్షుడు సత్యనారాయణ ముహూర్తం నిర్ణయించారు. మహబూబ్‌నగర్ మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. అనంతరం సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో బల్దియా ఎన్నికల్లో బీజేపీ అనుసరించాల్సిన వ్యూహాన్ని పార్టీ యంత్రాంగానికి వివరించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment