కరీంనగర్ కార్పొరేషన్, న్యూస్‌లైన్ : ఎన్నికలు స్వేచ్ఛాయుతంగా నిర్వహించడంలో మైక్రో అబ్జర్వర్ల పాత్ర ఎంతో అవసరమని జిల్లా ఎన్నికల పరిశీలకులు పి.పార్థసారథి అన్నారు. గురువారం కళాభారతిలో మైక్రో ఆబ్జర్వర్లకు శిక్షణ కల్పించారు. ఆబర్వర్లకు ఎన్నికల విధుల్లో ప్రత్యక్ష పాత్ర లేకున్నా.. నిఘా నేత్రాలతో పరిశీలిస్తూ తప్పిదాలు, ఉల్లంఘనలు జరిగినా వెంటనే ఎన్నికల పరిశీలకుల దృష్టికి తేవాలన్నారు. పోలింగ్‌కు ముందు మాక్ పోల్, ఓటింగ్ గది, పోలింగ్ స్టేషన్‌ను పరిశీలించాలని సూచించారు. అభ్యర్థికి ఒక పోలింగ్ ఏజెంట్ మాత్రమే పోలింగ్ కేంద్రంలో ఉండేలా చూడాలన్నారు.
అబ్జర్వర్ల కోసం జిల్లాస్థాయిలో నోడల్ అధికారిని, కార్పొరేషన్, మున్సిపల్ స్థాయిలో ఒక్కో నోడల్ అధికారిని నియమించామన్నారు. వి.ఉషారాణి మాట్లాడుతూ ఎన్నికలు, ఏర్పాట్లు, రాజకీయ నాయకుల ప్రవర్తన సక్రమంగా ఉందా? లేదో? చూసే బాధ్యత మైక్రో అబ్జర్వర్లపై ఉందన్నారు. పోలింగ్ కేంద్రాల్లో సెల్‌ఫోన్ స్విఛాఫ్ చేయాలన్నారు. పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌పై అవగాహన కల్పించారు. ఈవీఎంల పనితీరుపై మాక్‌పోల్ నిర్వహణపై ఆచరణాత్మకంగా చేసి చూపించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో చంద్రశేఖర్, కరీంనగర్ కార్పొరేషన్ కమిషనర్ కె.రమేశ్, ఆర్వీఎం పీవో శ్యాంప్రసాద్‌లాల్, మైక్రో ఆబ్జర్వర్లు పాల్గొన్నారు