కరీంనగర్ కార్పొరేషన్, న్యూస్‌లైన్ : ఆదివారం నిర్వహించే నగరపాలక సంస్థ ఎన్నికలకు సర్వం సిద్ధం చేశారు అధికారులు. 50 డివిజన్లకు జరగనున్న ఈ ఎన్నికలకు 209 పోలింగ్‌స్టేషన్లను ఏర్పాటు చేశారు. ఈ స్టేషన్లకు ఈవీఎంలను తరలించారు. 1130 మంది సిబ్బందిని ఎన్నికల విధులకు నియమించారు. ఇందులో 230 మంది రిటర్నింగ్, 230 మంది అసిస్టెంట్ రిటర్నింగ్, 670 మంది ఇతర ఎన్నికల సిబ్బందిని నియమించారు.
26 పోలింగ్ స్టేషన్లను సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లుగా గుర్తించి 10 పోలింగ్ స్టేషన్లలో మైక్రో అబ్జర్వర్లు, 16 పోలింగ్ స్టేషన్‌లలో వీడియోగ్రాఫర్లను ఏర్పాటు చేశారు. 50 డివిజన్లకు 17 రూట్లు ఏర్పాటు చేశారు. ప్రతి రూట్‌కు ఒక జోనల్ ఆఫీసర్, ఒక రూట్ ఆఫీసర్‌ను కేటాయించారు. ఎన్నికల సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఉన్నాతాధికారులకు తెలియపరిచేందుకు జోనల్ అధికారులకే విధులు అప్పగించారు.
తేలనున్న అభ్యర్థుల భవితవ్యం
50 డివిజన్లకు వివిధ పార్టీలకు చెందిన 376 మంది పోటీలో ఉన్నారు. ఆదివారం జరగనున్న పోలింగ్‌తో వారి భవిత ఈవీఎం బాక్సుల్లో నిక్షిప్తం కానుంది. కార్పొరేషన్ పరిధిలో 2,28,872 ఓటర్లున్నారు. వీరిలో పురుషులు 1,18,886 మంది మహిళలు 1,09,970, ఇతరులు 16 మంది ఉన్నారు. యువతను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు తమ ప్రచారాన్ని ఆ దిశగానే కొనసాగించారు.
మహిళల ఓట్లతో పాటు గ్రూపు మహిళల ఓట్లు కీలకం కావడంతో గ్రూపులను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు తమ శాయశక్తుగా ప్రలోభాలకు గురిచేస్తూ ప్రచారాన్ని నిర్వహించారు. ఆయా పార్టీల ఎంపీ, ఎమ్మెల్యేలు విస్తృతంగా ప్రచారంలో పాల్గొని అభ్యర్థులకు మద్దతుగా పాదయాత్రలను, ప్రచారాన్ని నిర్వహించారు. అభ్యర్థులు, నాయకులు హామీలు, వాగ్దానాలు, చేయబోయే అభివృద్ది కార్యక్రమాలను వారి ప్రచారంలో ఊదరగొట్టినప్పటికీ.. ఓటర్లు తమ మనస్సాక్షితో నేడు వేసే ఓటుతోనే వారి భవతవ్యం తేటతెల్లం కానుంది.