ఆదిలాబాద్‌పై ప్రత్యేక శ్రద్ధ
నెన్నెల, న్యూస్‌లైన్ : ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ పెడతామని జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. కోదండరాం ఆయన స్వగ్రామమైన నెన్నెల మండలం జోగాపూర్‌కు బుధవారం వచ్చిన సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. తూర్పు జిల్లాలో మామిడి మార్కెట్ ఏర్పాటుకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామన్నారు. గ్రామాల్లో గ్రామాభివృద్ధి కమిటీలు ఏర్పాటు చేసి నిధుల కోసం పోరాటాలు చేయాలన్నారు. ఈ ప్రాంతంలో పాల శీథలీకరణ కేంద్రం అవసరం ఎంతైన ఉందన్నారు.
ఉదయం నుంచి సాయంత్రం వరకు గ్రామస్థులు, స్థానిక నాయకులతో ఆయన పిచ్చాపాటిగా మాట్లాడారు. వృద్ధుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. గతంలో గ్రామానికి వచ్చిన ప్రతి సారి ఒకటి రెండు గంటలు మాత్రమే ఉండే ఆయన రోజంత ఉండటంతో గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది. కొదండరాంతో పాటు మండల జేఏసీ చైర్మన్ టీ. రణవీర్ సింగ్, పీఏసీఎస్ చైర్మన్ ఇందూరి రమేష్, నాయకులు మల్లాగౌడ్, నాగపూరి శంకరి, చెన్నోజి శంకరయ్య, సర్పంచులు తిరుపతి గౌడ్, రమేష్‌గౌడ్ ఉన్నారు.