సాంకేతిక విద్యలో నాణ్యత పెంచాలి
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: అభివృద్ధిలో కీలక పాత్ర పోషించే సాంకేతిక విద్యలో నాణ్యత పెంచాల్సిన బాధ్యత అధ్యాపకులపైనే ఉందని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ సహాయమంత్రి పల్లంరాజు అన్నారు. సంగారెడ్డి మండలం ఎద్దుమైలారం ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ లోని ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్లో శని వారం జరిగిన సదస్సులో ఆయన ప్రసంగించారు. పోటీతత్వం, సృజనాత్మకంగా ఆలోచించ గలిగే మానవ వనరులు ప్రస్తుత ఆర్థిక వ్యవస్థలో కీలకపాత్ర పోషిస్తున్నట్టు తెలిపారు. శాస్త్ర, సాంకేతిక అంశాలపై అధ్యాపకులకు మంచి పట్టు ఉన్నప్పుడే బోధనలో నాణ్యత ఉంటుందన్నారు. సాంకేతిక పరంగా పురోగమిస్తున్నందున అధ్యాపకులు కూడా ఎప్పటికప్పుడు నూతన అంశాలపై అవగాహన పెంచుకోవాల్సిందిగా పల్లం రాజు సూచించారు.
నూతన పరిశోధనలు చేసేందుకు ఎలాంటి నిధుల కొరత లేదని మానవ వనరుల అభివృద్ధి మంత్రి త్వ శాఖ అదనపు కార్యదర్శి అనిత వెల్లడిం చారు. ఈ సదస్సులో బెంగళూరుకు చెందిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ప్రొఫెసర్ ఎస్కే నంది, ఐఐటీ హైదరాబాద్ డెరైక్టర్ యూబీ దేశాయ్ పాల్గొన్నారు.