development issue
-
మౌలిక సదుపాయాల లేమివల్లే కశ్మీర్లో ఉగ్రభూతం: రాజ్‌నాథ్
న్యూఢిల్లీ: స్వాతంత్య్రానంతరం జమ్మూకశ్మీర్‌లో దశాబ్దాలుగా మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందలేదని, అందుకే ఉగ్రవాదం విస్తరించిందని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. సరిహద్దులోని ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో రూ.2,180 కోట్లతో నిర్మించిన వంతెనలు, రహదారులు, హెలిప్యాడ్లు తదితర 75 నూతన ప్రాజెక్టులను ఆయన శుక్రవారం తూర్పు లద్దాఖ్‌లోని దార్బుక్–ష్యోక్–దౌలత్ బేగ్ ఓల్డీలో వర్చువల్‌గా ప్రారంభించారు. రాజ్‌నాథ్ ప్రారంభించిన వంతెనల్లో.. సముద్ర మట్టానికి 14,000 అడుగుల ఎత్తున డీఎస్–డీబీఓ రోడ్డుపై నిర్మించిన 120 మీటర్ల పొడవైన ‘క్లాస్–70 ష్యోక్ సేతు’ ఉంది. వీటిని బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిర్మించారు. వీటిలో 45 వంతెనలు, 27 రోడ్లు, రెండు హెలిప్యాడ్లు, ఒక ‘కార్బన్ న్యూట్రల్ హాబిటాట్’ ఉన్నాయి. కశ్మీర్లో 20 ప్రాజెక్టులు, లద్దాఖ్‌లో 18, అరుణాచల్ ప్రదేశ్‌లో 18, ఉత్తరాఖండ్‌లో 5, సిక్కిం, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, రాజస్తాన్‌లో 14 ప్రాజెక్టులు నిర్మించారు. ‘కార్బన్ న్యూట్రల్ హాబిటాట్’లో ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ 57 మంది తల దాచుకోవచ్చు. -
అభివృద్ధిలో వివక్ష
సీఎం చంద్రబాబును కలిసిన ఎమ్మెల్యేలు జగ్గిరెడ్డి, రాజేశ్వరి కాకినాడ: అభివృద్ధి సంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వం వివక్ష చూపుతోందని కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబును వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల బృందం కలిసింది. ప్రభుత్వ పథకాల అమలులో ప్రతిపక్షపార్టీ ఎమ్మెల్యేలున్న చోట ప్రభుత్వం పక్షపాతంతో వ్యవహరిస్తుందని ఆ బృందం వివరించింది. ఆ బృందంలో కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి కూడా వెళ్ళారు. తన నియోజకవర్గంలో సీఎం రిలీఫ్ ఫండ్ కోసం ఎదురు చూస్తున్న బాధితులు ఎంతో మంది దరఖాస్తులు అందజేసినా మంజూరు చేయకపోవడాన్ని జగ్గిరెడ్డి ప్రశ్నించారు. నియోజకవర్గ ఎమ్మెల్యేగా తాను అందజేసే దరఖాస్తులను పట్టించుకోవడం లేదని చెప్పారు. అధికార పార్టీ నేతలు, ఇతరులు సీఎం రిలీఫ్ ఫండ్ కోసం దరఖాస్తులు పంపిస్తుంటే ఇట్టే మంజూరు చేస్తున్నారని చెప్పారు. ఇంతటి వివక్ష మునుపెన్నడూ ఏ ప్రభుత్వ హయాంలోను చూడలేదని జగ్గిరెడ్డి సీఎం దృష్టికి తీసుకువెళ్ళారు. నియోజకవర్గ అభివృద్ధి నిధులు రెండున్నరేళ్లవుతున్నా ఒక్క చిల్లిగవ్వ కూడా విడుదల చేయలేయకపోవడాన్ని జగ్గిరెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రానికి పొరుగున ఉన్న తెలంగాణలో అక్కడ ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గానికి మూడు కోట్లు ప్రతి ఎమ్మెల్యేకు విడుదల చేయగా, కేంద్ర ప్రభుత్వం కూడా ఎంపీ ల్యాడ్స్ కేటాయింపుల విషయంలో ఐదు కోట్ల చొప్పున విడుదల చేస్తున్న విషయాన్ని జగ్గిరెడ్డి ఆ సందర్భంలో చెప్పారు. సీఎంను కలిసిన వారిలో జిల్లా నుంచి జగ్గిరెడ్డితో పాటు రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి ఉన్నారు.