- సీఎం చంద్రబాబును కలిసిన ఎమ్మెల్యేలు జగ్గిరెడ్డి, రాజేశ్వరి
అభివృద్ధిలో వివక్ష
Published Sat, Nov 26 2016 12:39 AM | Last Updated on Tue, May 29 2018 2:55 PM
కాకినాడ:
అభివృద్ధి సంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వం వివక్ష చూపుతోందని కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబును వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల బృందం కలిసింది. ప్రభుత్వ పథకాల అమలులో ప్రతిపక్షపార్టీ ఎమ్మెల్యేలున్న చోట ప్రభుత్వం పక్షపాతంతో వ్యవహరిస్తుందని ఆ బృందం వివరించింది. ఆ బృందంలో కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి కూడా వెళ్ళారు. తన నియోజకవర్గంలో సీఎం రిలీఫ్ ఫండ్ కోసం ఎదురు చూస్తున్న బాధితులు ఎంతో మంది దరఖాస్తులు అందజేసినా మంజూరు చేయకపోవడాన్ని జగ్గిరెడ్డి ప్రశ్నించారు. నియోజకవర్గ ఎమ్మెల్యేగా తాను అందజేసే దరఖాస్తులను పట్టించుకోవడం లేదని చెప్పారు. అధికార పార్టీ నేతలు, ఇతరులు సీఎం రిలీఫ్ ఫండ్ కోసం దరఖాస్తులు పంపిస్తుంటే ఇట్టే మంజూరు చేస్తున్నారని చెప్పారు. ఇంతటి వివక్ష మునుపెన్నడూ ఏ ప్రభుత్వ హయాంలోను చూడలేదని జగ్గిరెడ్డి సీఎం దృష్టికి తీసుకువెళ్ళారు. నియోజకవర్గ అభివృద్ధి నిధులు రెండున్నరేళ్లవుతున్నా ఒక్క చిల్లిగవ్వ కూడా విడుదల చేయలేయకపోవడాన్ని జగ్గిరెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రానికి పొరుగున ఉన్న తెలంగాణలో అక్కడ ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గానికి మూడు కోట్లు ప్రతి ఎమ్మెల్యేకు విడుదల చేయగా, కేంద్ర ప్రభుత్వం కూడా ఎంపీ ల్యాడ్స్ కేటాయింపుల విషయంలో ఐదు కోట్ల చొప్పున విడుదల చేస్తున్న విషయాన్ని జగ్గిరెడ్డి ఆ సందర్భంలో చెప్పారు. సీఎంను కలిసిన వారిలో జిల్లా నుంచి జగ్గిరెడ్డితో పాటు రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి ఉన్నారు.
Advertisement