Development Path
-
దేశాభివృద్ధి ఆగదు
న్యూఢిల్లీ: కొత్త ఏడాదిలో భారత్ మరింత రెట్టించిన ఉత్సాహంతో అభివృద్ధి పథంలో దూసుకుపోవాలని ప్రధాని మోదీ అభిలషించారు. కోవిడ్ విసిరే సవాళ్లు దేశాభివృద్ధికి విఘాతం కలిగించడాన్ని భారత్ ఏమాత్రం అనుమతించబోదని ప్రధాని వ్యాఖ్యానించారు. ‘ జాతి ప్రయోజనాలే పరమావధిగా పూర్తి అప్రమత్తతతో, ముందస్తు జాగ్రత్తలతో కోవిడ్‌పై పోరును భారత్ కొనసాగిస్తుంది’ అని మోదీ ప్రకటించారు. శనివారం ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం–కిసాన్) పథకం పదో విడత నిధుల విడుదల సందర్భంగా ప్రధాని మోదీ ప్రసంగించారు. 2021 ఏడాదిలో కోవిడ్ కల్లోక కాలంలోనూ ఆరోగ్య, రక్షణ, వ్యవసాయ, మౌలిక సదుపాయాలు, అంకుర సంస్థల రంగాలు సాధించిన పురోగతిని మోదీ గుర్తుచేశారు. ‘ భిన్న రంగాల్లో సంస్కరణలు వేగం పుంజుకున్నాయి. ఆధునిక మౌలిక సదుపాయాలను భారత్ సమకూర్చుకుంది. ఈ అభివృద్ధి పథాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలి. ఈ క్రమంలో ఎదురయ్యే కోవిడ్ సవాళ్లను భారత్ ఎంతమాత్రం అనుమతించబోదు. గత సంవత్సరాల ఘన విజయాల నుంచి స్ఫూర్తి పొంది దేశం నూతన సంవత్సరంలో కొత్త ప్రయాణం మొదలుపెడుతోంది’ అని మోదీ అన్నారు. ‘కోవిడ్ సంక్షోభ కాలంలో రూ.2.6 లక్షల కోట్ల విలువైన ఆహార ధాన్యాలను మొత్తంగా 80 కోట్ల ప్రజలకు ఉచితంగా పంపిణీ చేశాం. కొత్త ఆక్సిజన్ ప్లాంట్లు, కొత్త వైద్య కళాశాలలు, వెల్నెస్ సెంటర్లు, ఆయుష్మాన్ భారత్ మిషన్, ఆయుష్మాన్ భారత్ డిజిటల్ హెల్త్ మిషన్లతో దేశ వైద్య మౌలిక వ్యవస్థను మరింత పటిష్టంచేశాం’ అని మోదీ చెప్పారు. ఎన్నో అంశాల్లో కోవిడ్‌కు ముందునాటి ఆర్థిక గణాంకాలను దాటేందుకు భారత ఆర్థికవ్యవస్థ సిద్ధమైందన్నారు. సెమీ కండక్టర్ల(చిప్‌లు) తయారీ వంటి అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టేందుకు భారత్ పటిష్ట ప్రణాళికలతో ముందుకెళ్తోందని ఆయన చెప్పారు. 10 కోట్ల రైతులకు రూ.20,946 కోట్లు పీఎం–కిసాన్ పథకం పదో విడత నిధుల విడుదలలో భాగంగా శనివారం ప్రధాని మోదీ 10.09 కోట్ల రైతులకు పంపిణీ చేసేందుకు రూ.20,946 కోట్లు విడుదలచేశారు. వినూత్న సాగు పద్దతులు, ప్రకృతి వ్యవసాయం వైపు వ్యవసాయం మళ్లాల్సిన ఆవశ్యకతను ప్రధాని గుర్తుచేశారు. పీఎం–కిసాన్ కింద అర్హులైన రైతు కుటుంబానికి కేంద్రం ఏటా రూ.6,000 నగదు సాయం చేస్తోంది. ఈ మొత్తాన్ని మూడు విడతల్లో ఇస్తారు. 2019 బడ్జెట్ సందర్భంగా పీఎం–కిసాన్ పథకాన్ని ప్రారంభించారు. ఇప్పటిదాకా మోదీ సర్కార్ మొత్తంగా రూ.1.8 లక్షల కోట్ల నిధులను రైతులకు పంపిణీ చేసింది. మోదీ నూతన సంవత్సర శుభాకాంక్షలు కొత్త ఏడాది తొలిరోజున ప్రధాని మోదీ దేశ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అందరూ మంచి ఆరోగ్యంతో, ఆనందంతో జీవించాలని ఆయన అభిలషించారు. -
తల‘సిరి’ గల నగరి
⇒ రాజధానివాసుల తలసరి ఆదాయం రూ.1.04 లక్షలు ⇒ రాష్ట్ర మానవాభివృద్ధి నివేదికలో వెల్లడి ‘భాగ్య’నగరి అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది. విద్య, వైద్యంతో పాటు తలసరి ఆదాయం గ్రాఫ్ ఎగబాకుతోంది. తెలంగాణ రాష్ట్ర మానవాభివృద్ధి నివేదిక–2017 ప్రకారం హైదరాబాద్‌లో తలసరి ఆదాయం ఏడాదికి రూ.1.04 లక్షలు. పక్కా భవనాలు, మరుగుదొడ్డి సౌకర్యం ఉన్నవారు రాష్ట్రంలోని ఇతర జిల్లాలతో పోలిస్తే నగరంలోనే అధికశాతం. ఈ తాజా నివేదిక ప్రకారం వివిధ అంశాల్లో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల అభివృద్ధి పయనం ఇలావుంది...– సాక్షి, హైదరాబాద్ లక్షాధికారులే... తెలంగాణలో ఇతర జిల్లాలతో పోలిస్తే హైదరాబాద్ తలసరి ఆదాయంలో అగ్ర స్థానంలో నిలిచింది. నగరవాసుల తలసరి ఆదాయం ఏడాదికి రూ.1,04,587 ఉన్నట్టు నివేదిక పేర్కొంది. అయితే మహిళల తలసరి ఆదాయం రూ.69,081 మాత్రమే. రంగారెడ్డి జిల్లాలో పురుషులు రూ.89,973, మహిళలు రూ.55,317 తలసరి ఆదాయం కలిగి ఉన్నట్లు నివేదిక వెల్లడించింది. ఆరోగ్య, విద్య సూచీల్లో టాప్. ఆరోగ్యం, విద్య సూచీల్లో హైదరాబాద్ నగరం అగ్రభాగాన నిలిచింది. ఆరోగ్యం విషయంలో 0.888 పాయింట్లు సాధించి తెలంగాణ జిల్లాల్లో టాప్‌లో నిలిచింది. రంగారెడ్డి జిల్లా 0.733 పాయింట్లతో ద్వితీయస్థానంలో ఉంది. ఇక విద్యాసూచీలో 0.774 పాయింట్లతో హైదరాబాద్ ప్రథమ స్థానాన్ని దక్కించుకోగా..0.546 పాయింట్లతో రంగారెడ్డి జిల్లా రెండోస్థానంలో ఉంది. అక్షరాస్యతలోనూ అందలమే అక్షరాస్యత విషయంలోనూ హైదరాబాద్ అగ్రస్థానంలో ఉంది. జిల్లాలో 83.3 శాతం మంది అక్షరాస్యులున్నారు. ద్వితీయ స్థానంలో నిలిచిన రంగారెడ్డి జిల్లాలో 75.9 శాతం అక్షరాస్యత నమోదైంది. ప్రైవేటు బడులూ అధికమే హైదరాబాద్ జిల్లాలో తెలంగాణలోనే అత్యధికంగా 71.6 శాతం ప్రైవేటు పాఠశాలలున్నాయి. రెండో స్థానంలో ఉన్న రంగారెడ్డి జిల్లాలో ఈ శాతం 47 మాత్రమే. ఆస్పత్రుల్లో ప్రసవాలు ఆస్పత్రుల్లో సురక్షిత పరిసరాల్లో ప్రసవాల విషయంలో నగరం అగ్రభాగాన నిలిచింది. నగరంలో 97.2 శాతం ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ప్రసవాలు జరుగుతున్నాయి. రంగారెడ్డి జిల్లాలో ఈ శాతం 95.3. పాఠశాలలూ ఎక్కువే ప్రతి 10 చదరపు మీటర్ల పరిధిలో హైదరాబాద్ జిల్లాలో అత్యధికంగా 209.40 పాఠశాలలున్నాయి. రంగారెడ్డి జిల్లాలో 51.11 పాఠశాలలతో రెండో స్థానంలో ఉంది. పాఠశాలకు హాజరులో రంగారెడ్డి టాప్ అత్యధికంగా 99.1 శాతం మంది విద్యార్థులు రంగారెడ్డి జిల్లాలో పాఠశాలలకు హాజరవుతుండగా, హైదరాబాద్ 97.4 శాతంతో, నిజామాబాద్ జిల్లా తరువాత మూడో స్థానంలో ఉంది. కలవరపరుస్తున్న మాతా, శిశు మరణాలు నగరంలో ప్రతి వెయ్యిమంది శిశు జననాలకు 20 మంది.. రంగారెడ్డి జిల్లాలో 33 మంది పురుట్లోనే మృత్యువాతపడుతుండడం కలచివేస్తోంది. హైదరాబాద్‌లో ప్రతి లక్షమంది గర్భిణుల్లో ప్రసవ సమయంలో 71 మంది... రంగారెడ్డిలో 78 మంది మృత్యువాత పడుతుండడం ఆందోళన కలిగిస్తోంది. సేవారంగ ఆదాయం అదుర్స్ నగరంలో సేవారంగం ద్వారా ఆదాయం అధికంగా ఉన్నట్లు నివేదికలో తేలింది. ఐటీ, బీపీఓ, కేపీఓ రంగాలకు నిలయమైన భాగ్యనగరంలో సేవారంగం శరవేగంగా పురోగమిస్తోంది. ఈ రంగంలో 2011–12 అంచనాల ప్రకారం రూ.78,755 కోట్ల ఆదాయం వస్తోంది. పరిశ్రమల ద్వారా రూ.14,898 కోట్లు, వ్యవసాయంలో రూ.1,055 కోట్లే లభిస్తోంది. రంగారెడ్డిలో సేవారంగంలో రూ.36,266 కోట్లు, పరిశ్రమల రంగంలో రూ.26,064 కోట్లు, వ్యవసా యంలో రూ.4,515 కోట్లు ఆదాయం వస్తోంది. విద్య, వైద్య ఖర్చులు అధికమే హైదరాబాద్‌లో తలసరి ఆదాయం లక్షకు మించినప్పటికీ విద్య, వైద్యం కోసం చేస్తున్న ఖర్చులతో పోలిస్తే ఆదాయం ఏమూలకూ సరిపోవడంలేదు. వీటికి ప్రభుత్వ కేటాయింపులు పెరిగి అందరికీ ఉచిత విద్య, వైద్యం అందించినపుడే మానవాభివృద్ధి సూచికలో మరింత పురోభివృద్ధి సాధ్యం. – ప్రొఫెసర్ డి.నరసింహారెడ్డి, చేతన సొసైటీ -
మోడి లక్ష్యం బంగారు భారత్
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు హరిబాబు గన్నవరం : దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించగల సత్తా ప్రధానమంత్రి నరేంద్రమోడికి మాత్రమే ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ కంభంపాటి హరిబాబు అన్నారు. స్థానిక ఆర్యవైశ్య కళ్యాణ మండపం సమీపంలో బీజేపీ ఆధ్వర్యంలో మోడి వందరోజుల పాలనపై విజయోత్సవ సభ నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న హరిబాబు మాట్లాడుతూ మన దేశాన్ని బంగారు భారత్‌గా తీర్చిదిద్దేందుకు మోడి చిత్తశుద్ధితో పని చేస్తున్నారని తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు తాత్కాలిక రాజధానిని ఏర్పాటు చేసి అక్కడి నుంచి పాలన సాగించాలని సూచించారు. అధికార వికేంద్రీకరణతోపాటు జిల్లాల సంఖ్యను 25కు పెంచాలన్నారు. రాష్ట్రంలో జల రవాణాను పెంపొందించేందుకు, ఏపీని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసేందుకు కేంద్రం సంసిద్ధంగా ఉందన్నారు. మచిలీపట్నం పోర్టు నిర్మాణానికి, గన్నవరం విమానాశ్రయ అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రాష్ట్ర మంత్రి కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ యూపీఏ ప్రభుత్వం భ్రష్టు పట్టించిన అన్ని వ్యవస్థలను మోడి గాడిలో పెడుతున్నారని పేర్కొన్నారు. కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు మాట్లాడుతూ పేద కుటుంబానికి చెందిన మోడి దేశ ప్రధాని కావడం అందరికీ గర్వకారణమన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చిగురుపాటి కుమారస్వామి ఆధ్వర్యాన జరిగిన ఈ సభలో ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జమ్ముల శ్యాంకిషోర్, కార్యవర్గ సభ్యులు మోటుపల్లి శామ్యూల్, ఆర్.రవీంద్రరాజు, మహిళా మోర్చ అధ్యక్షురాలు మాలతిరాణి, కిసాన్ మోర్చ ఉపాధ్యక్షుడు తుమ్మల అంజిబాబు, నియోజకవర్గ కన్వీనర్ నాదెండ్ల మోహన్ తదితరులు పాల్గొన్నారు. సభ అనంతరం పలు పార్టీల నాయకులు బీజేపీలో చేరారు.