పీఎం కిసాన్ నిధులు విడుదల చేస్తున్న మోదీ
న్యూఢిల్లీ: కొత్త ఏడాదిలో భారత్ మరింత రెట్టించిన ఉత్సాహంతో అభివృద్ధి పథంలో దూసుకుపోవాలని ప్రధాని మోదీ అభిలషించారు. కోవిడ్ విసిరే సవాళ్లు దేశాభివృద్ధికి విఘాతం కలిగించడాన్ని భారత్ ఏమాత్రం అనుమతించబోదని ప్రధాని వ్యాఖ్యానించారు. ‘ జాతి ప్రయోజనాలే పరమావధిగా పూర్తి అప్రమత్తతతో, ముందస్తు జాగ్రత్తలతో కోవిడ్‌పై పోరును భారత్ కొనసాగిస్తుంది’ అని మోదీ ప్రకటించారు.
శనివారం ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం–కిసాన్) పథకం పదో విడత నిధుల విడుదల సందర్భంగా ప్రధాని మోదీ ప్రసంగించారు. 2021 ఏడాదిలో కోవిడ్ కల్లోక కాలంలోనూ ఆరోగ్య, రక్షణ, వ్యవసాయ, మౌలిక సదుపాయాలు, అంకుర సంస్థల రంగాలు సాధించిన పురోగతిని మోదీ గుర్తుచేశారు. ‘ భిన్న రంగాల్లో సంస్కరణలు వేగం పుంజుకున్నాయి. ఆధునిక మౌలిక సదుపాయాలను భారత్ సమకూర్చుకుంది. ఈ అభివృద్ధి పథాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలి. ఈ క్రమంలో ఎదురయ్యే కోవిడ్ సవాళ్లను భారత్ ఎంతమాత్రం అనుమతించబోదు.
గత సంవత్సరాల ఘన విజయాల నుంచి స్ఫూర్తి పొంది దేశం నూతన సంవత్సరంలో కొత్త ప్రయాణం మొదలుపెడుతోంది’ అని మోదీ అన్నారు. ‘కోవిడ్ సంక్షోభ కాలంలో రూ.2.6 లక్షల కోట్ల విలువైన ఆహార ధాన్యాలను మొత్తంగా 80 కోట్ల ప్రజలకు ఉచితంగా పంపిణీ చేశాం. కొత్త ఆక్సిజన్ ప్లాంట్లు, కొత్త వైద్య కళాశాలలు, వెల్‌నెస్ సెంటర్లు, ఆయుష్మాన్ భారత్ మిషన్, ఆయుష్మాన్ భారత్ డిజిటల్ హెల్త్ మిషన్‌లతో దేశ వైద్య మౌలిక వ్యవస్థను మరింత పటిష్టంచేశాం’ అని మోదీ చెప్పారు. ఎన్నో అంశాల్లో కోవిడ్‌కు ముందునాటి ఆర్థిక గణాంకాలను దాటేందుకు భారత ఆర్థికవ్యవస్థ సిద్ధమైందన్నారు. సెమీ కండక్టర్ల(చిప్‌లు) తయారీ వంటి అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టేందుకు భారత్ పటిష్ట ప్రణాళికలతో ముందుకెళ్తోందని ఆయన చెప్పారు.
10 కోట్ల రైతులకు రూ.20,946 కోట్లు
పీఎం–కిసాన్ పథకం పదో విడత నిధుల విడుదలలో భాగంగా శనివారం ప్రధాని మోదీ 10.09 కోట్ల రైతులకు పంపిణీ చేసేందుకు రూ.20,946 కోట్లు విడుదలచేశారు. వినూత్న సాగు పద్దతులు, ప్రకృతి వ్యవసాయం వైపు వ్యవసాయం మళ్లాల్సిన ఆవశ్యకతను ప్రధాని గుర్తుచేశారు. పీఎం–కిసాన్ కింద అర్హులైన రైతు కుటుంబానికి కేంద్రం ఏటా రూ.6,000 నగదు సాయం చేస్తోంది. ఈ మొత్తాన్ని మూడు విడతల్లో ఇస్తారు. 2019 బడ్జెట్ సందర్భంగా పీఎం–కిసాన్ పథకాన్ని ప్రారంభించారు. ఇప్పటిదాకా మోదీ సర్కార్ మొత్తంగా రూ.1.8 లక్షల కోట్ల నిధులను రైతులకు పంపిణీ చేసింది.
మోదీ నూతన సంవత్సర శుభాకాంక్షలు
కొత్త ఏడాది తొలిరోజున ప్రధాని మోదీ దేశ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అందరూ మంచి ఆరోగ్యంతో, ఆనందంతో జీవించాలని ఆయన అభిలషించారు.
Comments
Please login to add a commentAdd a comment