Kisan sampada Yojana
-
మూడేళ్లలో 67% తగ్గిన పీఎం కిసాన్ లబ్ధిదారులు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రధానమంత్రి కిసాన్ పథకం లబ్ధిదారులు ఏటికేడు తగ్గిపోతున్నారు. 2019 ఫిబ్రవరిలో ఈ పథకం ప్రారంభమైన సమయంలో మొదటి విడత లబ్ధిదారుల సంఖ్య 11.84 కోట్ల మంది కాగా, ఈ ఏడాది జూన్‌లో మొదటి ఇన్స్టాల్మెంట్ 3.87 కోట్ల మంది ఖాతాల్లోనే జమ అయింది. అంటే, దాదాపు 8 కోట్ల మంది రైతులను ఈ జాబితా నుంచి తొలగించారు. సమాచార హక్కు చట్టం(ఆర్టీఏ) కింద అడిగిన ప్రశ్నకు సాక్షాత్తూ కేంద్ర వ్యవసాయ శాఖ ఈ మేరకు సమాధానమిచ్చింది. లబ్ధిదారుల సంఖ్య 67% తగ్గిపోవడానికి దారితీసిన కారణాలను మాత్రం ప్రభుత్వం వెల్లడించలేదు. పీఎం–కిసాన్ పథకం ఇప్పటి వరకు రైతుల ఖాతాల్లో రూ.2 లక్షల కోట్లు జమ చేసినట్లు ప్రభుత్వం చెప్పుకుంటోంది. ఏడాదికి రూ.6 వేలను రూ.2 వేల చొప్పున మూడు విడతలుగా ఏడాదిలో రైతులకు అందించేందుకు పీఎం–కిసాన్‌ను కేంద్రం 2019 ఫిబ్రవరిలో లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రకటించింది. ఈ ఏడాది అక్టోబర్‌లో తాజాగా 12వ విడత ఇన్‌స్టాల్‌మెంట్‌ను చెల్లించింది. మొదటి విడతలో 11.84 కోట్ల రైతులు లబ్ధిదారులుగా ఉండగా, ఆరో విడత వచ్చే సరికి ఈ సంఖ్య 9.87 కోట్లకు తగ్గింది. ఆ తర్వాత క్రమేపీ తగ్గుతూ వస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో లబ్ధిదారుల సంఖ్య 55.68 లక్షల నుంచి 28.2 లక్షలకు, మహారాష్ట్రలో 1.09 కోట్ల నుంచి 37.51 లక్షలకు, గుజరాత్లో 63.13 లక్షల నుంచి 28.41 లక్షలకు రైతు లబ్ధిదారుల సంఖ్య పడిపోయింది. దేశంలోని మూడొంతుల మంది రైతుల్లో రెండొంతుల మందికి కూడా పీఎం–కిసాన్ అందకపోవడం దారుణమని ఆల్ ఇండియా కిసాన్ సభ ప్రెసిడెంట్ అశోక్ ధావలె అంటున్నారు. ఈ పథకాన్ని క్రమేపీ కనుమరుగు చేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని ఆరోపిస్తున్నారు. -
దేశాభివృద్ధి ఆగదు
న్యూఢిల్లీ: కొత్త ఏడాదిలో భారత్ మరింత రెట్టించిన ఉత్సాహంతో అభివృద్ధి పథంలో దూసుకుపోవాలని ప్రధాని మోదీ అభిలషించారు. కోవిడ్ విసిరే సవాళ్లు దేశాభివృద్ధికి విఘాతం కలిగించడాన్ని భారత్ ఏమాత్రం అనుమతించబోదని ప్రధాని వ్యాఖ్యానించారు. ‘ జాతి ప్రయోజనాలే పరమావధిగా పూర్తి అప్రమత్తతతో, ముందస్తు జాగ్రత్తలతో కోవిడ్‌పై పోరును భారత్ కొనసాగిస్తుంది’ అని మోదీ ప్రకటించారు. శనివారం ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం–కిసాన్) పథకం పదో విడత నిధుల విడుదల సందర్భంగా ప్రధాని మోదీ ప్రసంగించారు. 2021 ఏడాదిలో కోవిడ్ కల్లోక కాలంలోనూ ఆరోగ్య, రక్షణ, వ్యవసాయ, మౌలిక సదుపాయాలు, అంకుర సంస్థల రంగాలు సాధించిన పురోగతిని మోదీ గుర్తుచేశారు. ‘ భిన్న రంగాల్లో సంస్కరణలు వేగం పుంజుకున్నాయి. ఆధునిక మౌలిక సదుపాయాలను భారత్ సమకూర్చుకుంది. ఈ అభివృద్ధి పథాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలి. ఈ క్రమంలో ఎదురయ్యే కోవిడ్ సవాళ్లను భారత్ ఎంతమాత్రం అనుమతించబోదు. గత సంవత్సరాల ఘన విజయాల నుంచి స్ఫూర్తి పొంది దేశం నూతన సంవత్సరంలో కొత్త ప్రయాణం మొదలుపెడుతోంది’ అని మోదీ అన్నారు. ‘కోవిడ్ సంక్షోభ కాలంలో రూ.2.6 లక్షల కోట్ల విలువైన ఆహార ధాన్యాలను మొత్తంగా 80 కోట్ల ప్రజలకు ఉచితంగా పంపిణీ చేశాం. కొత్త ఆక్సిజన్ ప్లాంట్లు, కొత్త వైద్య కళాశాలలు, వెల్నెస్ సెంటర్లు, ఆయుష్మాన్ భారత్ మిషన్, ఆయుష్మాన్ భారత్ డిజిటల్ హెల్త్ మిషన్లతో దేశ వైద్య మౌలిక వ్యవస్థను మరింత పటిష్టంచేశాం’ అని మోదీ చెప్పారు. ఎన్నో అంశాల్లో కోవిడ్‌కు ముందునాటి ఆర్థిక గణాంకాలను దాటేందుకు భారత ఆర్థికవ్యవస్థ సిద్ధమైందన్నారు. సెమీ కండక్టర్ల(చిప్‌లు) తయారీ వంటి అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టేందుకు భారత్ పటిష్ట ప్రణాళికలతో ముందుకెళ్తోందని ఆయన చెప్పారు. 10 కోట్ల రైతులకు రూ.20,946 కోట్లు పీఎం–కిసాన్ పథకం పదో విడత నిధుల విడుదలలో భాగంగా శనివారం ప్రధాని మోదీ 10.09 కోట్ల రైతులకు పంపిణీ చేసేందుకు రూ.20,946 కోట్లు విడుదలచేశారు. వినూత్న సాగు పద్దతులు, ప్రకృతి వ్యవసాయం వైపు వ్యవసాయం మళ్లాల్సిన ఆవశ్యకతను ప్రధాని గుర్తుచేశారు. పీఎం–కిసాన్ కింద అర్హులైన రైతు కుటుంబానికి కేంద్రం ఏటా రూ.6,000 నగదు సాయం చేస్తోంది. ఈ మొత్తాన్ని మూడు విడతల్లో ఇస్తారు. 2019 బడ్జెట్ సందర్భంగా పీఎం–కిసాన్ పథకాన్ని ప్రారంభించారు. ఇప్పటిదాకా మోదీ సర్కార్ మొత్తంగా రూ.1.8 లక్షల కోట్ల నిధులను రైతులకు పంపిణీ చేసింది. మోదీ నూతన సంవత్సర శుభాకాంక్షలు కొత్త ఏడాది తొలిరోజున ప్రధాని మోదీ దేశ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అందరూ మంచి ఆరోగ్యంతో, ఆనందంతో జీవించాలని ఆయన అభిలషించారు. -
రైతన్నల ఆదాయం రెట్టింపు చేస్తాం
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా రైతన్నల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు చేపట్టినట్లు ప్రధాని మోదీ చెప్పారు. ఆయన సోమవారం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి(పీఎం–కిసాన్) పథకం కింద తొమ్మిదో విడతలో 9.75 కోట్ల మందికిపైగా రైతుల ఖాతాల్లోకి రూ.19,500 కోట్లు బదిలీ చేశారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో పంటల సాగుకు పీఎం–కిసాన్ సొమ్ము రైతాంగానికి ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. అన్నదాతల ఆదాయాన్ని పెంచాలన్నదే తమ లక్ష్యమని, అన్ని రకాల వనరులను కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. మన రైతాంగం సంక్షేమం కోసం ఎన్నో పథకాల్లోకి తీసుకొచ్చామని గుర్తుచేశారు. రూ.లక్ష కోట్లతో అగ్రి–ఇన్ఫ్రా ఫండ్ ఏర్పాటు చేశామన్నారు. హనీ బీ(తేనెటీగలు) మిషన్‌తో మన దేశం నుంచి తేనె ఎగుమతులు భారీగా పెరిగాయని, తద్వారా తేనెటీగల పెంపకందారులు అదనపు ఆదాయం పొందుతున్నారని వివరించారు. జమ్మూకశ్మీర్‌లో సాగయ్యే కుంకుమ పువ్వును ‘నాఫెడ్’ రిటైల్ స్టోర్ల ద్వారా విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. రికార్డు స్థాయిలో ఉత్పత్తి కరోనా ప్రతికూల కాలంలోనూ 2020–21లో రైతులు రికార్డు స్థాయిలో ఆహార ధాన్యాలు ఉత్పత్తి చేశారని మోదీ ప్రశంసించారు. వరి, గోధుమలు, చక్కెర ఉత్పత్తిలోనే కాదు, వంట నూనెల ఉత్పత్తిలోనూ స్వయం సమృద్ధి సాధించాలి్సన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఇండియాలో తృణ ధాన్యాల ఉత్పత్తి గత ఆరేళ్లలో 50 శాతం పెరిగిందని, దేశీయంగా వంట నూనెల ఉత్పత్తి విషయంలోనూ ఇదే స్ఫూర్తిని చాటాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతిలో మన దేశం టాప్–10 దేశాల జాబితాలో చేరిందన్నారు. -
అది రైతులకు అవమానం
బహ్రైచ్: కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, తూర్పు ఉత్తరప్రదేశ్ ఇన్చార్జి ప్రియాంకా గాంధీ ఆదివారం ఉత్తరప్రదేశ్‌లోని బహ్రైచ్ జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె బీజేపీ అమలు చేస్తున్న పీఎం–కిసాన్ పథకంపై విరుచుకుపడ్డారు. వాస్తవానికి ఈ పథకంతో బీజేపీ రైతులను అవమానిస్తోందన్నారు. ప్రధాని మోదీ గొప్పగా ప్రకటించుకున్నప్పటికీ ఈ పథకం ద్వారా రైతులకు అందుతున్నది రోజుకు రూ.3.50 మాత్రమే, ఇది ముమ్మాటికి రైతులను అవమానించడమే అని ఆమె అన్నారు. బీజేపీ ఎప్పుడూ జాతీయవాదం గురించి ప్రస్తావిస్తుందనీ, నిజానికి రైతులు, ప్రజల సమస్యలు వినడం, వాటికి పరిష్కారం చూపడమే నిజమైన జాతీయవాదం అని తాను భావిస్తున్నానని అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బహ్రైచ్ స్థానం నుంచి పోటీ చేస్తున్న సావిత్రిభాయ్ పూలే తరఫున ప్రియాంక ప్రచారం చేశారు. జాతీయవాదం గురించి ప్రధాని పదేపదే తన ప్రసంగాల్లో ప్రస్తావిస్తుంటారని, ప్రజలు కష్టాలు పరిష్కరించడమే నిజమైన జాతీయవాదంగా తాను భావిస్తానని, స్వోత్కర్షపైనే ఎప్పుడూ మోదీ దృష్టిసారిస్తారనిఅన్నారు. -
ఆహారశుద్ధి ప్రక్రియే ఏకైక మార్గం
అప్పుడే పెరుగుతున్న ఆహార అవసరాలను అధిగమించగలం: హర్‌సిమ్రత్‌కౌర్ సాక్షి, హైదరాబాద్: దేశంలో పెరుగుతున్న ఆహార అవసరాలను అధిగమించాలంటే ఆహార శుద్ధి ప్రక్రియే ఏకైక మార్గమని కేంద్ర ఆహార శుద్ధి పరిశ్రమల శాఖ మంత్రి హర్‌సిమ్రత్‌కౌర్ బాదల్ పేర్కొన్నారు. కూరగాయలు, పండ్ల సాగులో ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉన్నప్పటికీ.. మనదేశం ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని, ఆహార ఉత్పత్తుల వినియోగంలో భారత్ ఆరో స్థానంలో ఉందని చెప్పారు. నవంబర్ 3 నుంచి ఢిల్లీలో జరిగే వరల్డ్ ఫుడ్ ఇండియా– 2017 ప్రచారంలో భాగంగా గురువారం ఇక్కడ నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా ప్రారంభమయ్యే వరల్డ్ ఫుడ్ ఇండియా–2017లో పలు దేశాలు, రాష్ట్రాలు, వివిధ సంస్థలు, పరిశ్రమలు.. ఆహారశుద్ధి ప్రక్రియకు సంబంధించిన సాంకేతికత, ఉత్పత్తులను ప్రదర్శిస్తారు. హర్‌సిమ్రత్‌కౌర్ మాట్లాడుతూ.. దేశంలో ఉత్పత్తి అవుతున్న ఆహారంలో పది శాతం మాత్రమే శుద్ధి అవుతోందని, ఈ పరిస్థితి మెరుగుపడాల్సి ఉందన్నారు. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం కిసాన్ సంపద యోజన పేరిట ప్రత్యేక పథకాన్ని అమల్లోకి తెచ్చిందని అన్నారు. రూ.6,000 కోట్ల కార్పస్ ఫండ్‌తో ఈ పథకాన్ని ప్రారంభించినట్లు చెప్పారు. ఈ పథకం ద్వారా ఆహార శుద్ధి పరిశ్రమల ఏర్పాటులో భారీ రాయితీలు ఇస్తున్నట్లు చెప్పారు. ఆహారశుద్ధి ప్రక్రియ వల్ల వ్యర్థాలను అరికట్టడమే కాకుండా రైతులకు, వినియోగదారులకు కూడా లబ్ధి కలుగుతుందన్నారు. అలాగే ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, నాణ్యతతో పాటు ధరలు కూడా అదుపులోకి వస్తాయన్నారు. విత్తన పరిశ్రమకు కేంద్రంగా హైదరాబాద్: కేటీఆర్ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు మాట్లాడుతూ కోళ్ల పరిశ్రమతో పాటు విత్తన పరిశ్రమకు హైదరాబాద్ కేంద్రంగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రానికి నాలుగు మెగా ఆహార శుద్ధి యూనిట్లు మంజూరు చేసినందుకు కేంద్ర ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. వీటిలో ఇప్పటికే ఒక యూనిట్ పూర్తయిందని, మరో మూడింటిని అతి త్వరలో పూర్తి చేస్తామన్నారు. ఈ సందర్భంగా ఆహారశుద్ధి పరిశ్రమల శాఖ సంయుక్త కార్యదర్శి అనురాధప్రసాద్.. కిసాన్ సంపద యోజన పథకానికి సంబంధించిన వివరాలను పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. కార్యక్రమంలో సీఐఐ జాతీయ కౌన్సిల్ సభ్యులు కంబట్టా, రాష్ట్ర చైర్మన్ వి.రాజన్న తదితరులు పాల్గొన్నారు.