ఆహారశుద్ధి ప్రక్రియే ఏకైక మార్గం
అప్పుడే పెరుగుతున్న ఆహార అవసరాలను అధిగమించగలం: హర్‌సిమ్రత్‌కౌర్
సాక్షి, హైదరాబాద్: దేశంలో పెరుగుతున్న ఆహార అవసరాలను అధిగమించాలంటే ఆహార శుద్ధి ప్రక్రియే ఏకైక మార్గమని కేంద్ర ఆహార శుద్ధి పరిశ్రమల శాఖ మంత్రి హర్‌సిమ్రత్‌కౌర్ బాదల్ పేర్కొన్నారు. కూరగాయలు, పండ్ల సాగులో ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉన్నప్పటికీ.. మనదేశం ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని, ఆహార ఉత్పత్తుల వినియోగంలో భారత్ ఆరో స్థానంలో ఉందని చెప్పారు. నవంబర్ 3 నుంచి ఢిల్లీలో జరిగే వరల్డ్ ఫుడ్ ఇండియా– 2017 ప్రచారంలో భాగంగా గురువారం ఇక్కడ నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.
ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా ప్రారంభమయ్యే వరల్డ్ ఫుడ్ ఇండియా–2017లో పలు దేశాలు, రాష్ట్రాలు, వివిధ సంస్థలు, పరిశ్రమలు.. ఆహారశుద్ధి ప్రక్రియకు సంబంధించిన సాంకేతికత, ఉత్పత్తులను ప్రదర్శిస్తారు. హర్‌సిమ్రత్‌కౌర్ మాట్లాడుతూ.. దేశంలో ఉత్పత్తి అవుతున్న ఆహారంలో పది శాతం మాత్రమే శుద్ధి అవుతోందని, ఈ పరిస్థితి మెరుగుపడాల్సి ఉందన్నారు. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం కిసాన్ సంపద యోజన పేరిట ప్రత్యేక పథకాన్ని అమల్లోకి తెచ్చిందని అన్నారు. రూ.6,000 కోట్ల కార్పస్ ఫండ్‌తో ఈ పథకాన్ని ప్రారంభించినట్లు చెప్పారు. ఈ పథకం ద్వారా ఆహార శుద్ధి పరిశ్రమల ఏర్పాటులో భారీ రాయితీలు ఇస్తున్నట్లు చెప్పారు. ఆహారశుద్ధి ప్రక్రియ వల్ల వ్యర్థాలను అరికట్టడమే కాకుండా రైతులకు, వినియోగదారులకు కూడా లబ్ధి కలుగుతుందన్నారు. అలాగే ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, నాణ్యతతో పాటు ధరలు కూడా అదుపులోకి వస్తాయన్నారు.
విత్తన పరిశ్రమకు కేంద్రంగా హైదరాబాద్: కేటీఆర్
రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు మాట్లాడుతూ కోళ్ల పరిశ్రమతో పాటు విత్తన పరిశ్రమకు హైదరాబాద్ కేంద్రంగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రానికి నాలుగు మెగా ఆహార శుద్ధి యూనిట్లు మంజూరు చేసినందుకు కేంద్ర ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. వీటిలో ఇప్పటికే ఒక యూనిట్ పూర్తయిందని, మరో మూడింటిని అతి త్వరలో పూర్తి చేస్తామన్నారు. ఈ సందర్భంగా ఆహారశుద్ధి పరిశ్రమల శాఖ సంయుక్త కార్యదర్శి అనురాధప్రసాద్.. కిసాన్ సంపద యోజన పథకానికి సంబంధించిన వివరాలను పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. కార్యక్రమంలో సీఐఐ జాతీయ కౌన్సిల్ సభ్యులు కంబట్టా, రాష్ట్ర చైర్మన్ వి.రాజన్న తదితరులు పాల్గొన్నారు.