దేవినేని బాజీ ఆకస్మిక మృతి
విజయవాడ(ఆటోనగర్) :
మాజీ మంత్రి దేవినేని రాజశేఖర్(నెహ్రూ) సోదరుడు, వ్యాపారవేత్త దేవినేని బాజీప్రసాద్(60) మంగళవారం వేకువజామున ఆకస్మికంగా మరణించారు. ఆయనకు గతంలో రెండుసార్లు గుండెపోటు రాగా, ఆపరేషన్లు చేశారు. ఈ క్రమంలో మంగళవారం వేకువజామున నాలుగు గంటల సమయంలో మరోసారి గుండెనొప్పి రావడంతో ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యంలో మృతి చెందారు. బాజీప్రసాద్కు భార్య అపర్ణ (రెండో డివిజన్ కార్పొరేటర్), ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. భారతీనగర్లోని స్వగృహంలో ఆయన భౌతికకాయం వద్ద పలు వురు ప్రముఖులు నివాళులర్పించారు. సీఎం చంద్రబాబు నాయుడు ఫోన్లో బాజీప్రసాద్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. మంత్రులు దేవినేని ఉమా, కామినేని శ్రీనివాస్, ఎమ్మెల్యేలు బొండా ఉమా, బోడే ప్రసాద్, ఎంపీ కేశినేని శ్రీనివాస్(నాని), నగర మేయర్ కోనేరు శ్రీధర్, వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు గౌతంరెడ్డి తదితరులు బాజీప్రసాద్ భౌతికాయం వద్ద నివాళులర్పించి, దేవినేని నెహ్రూ, కుటుంబ సభ్యులను పరామర్శించారు. సాయంత్రం గుణదల కార్మెల్నగర్లోని సొంత వ్యవసాయ క్షేత్రంలో బాజీప్రసాద్ అంత్యక్రియలు నిర్వహించారు.