పరిహారం వెంటనే చెల్లించండి
ఏపీ రాష్ట్ర ప్రభుత్వానికి మంత్రి హరీశ్‌రావు విజ్ఞప్తి
పులిచింతల నిర్వాసితుల కోసం రూ.40 కోట్లు విడుదల చేయండి
నీటి నిల్వపై సహకరించేందుకు సిద్ధంగా ఉన్నాం
ఏపీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేనికి హరీశ్ సూచన
హైదరాబాద్: పులిచింతల ప్రాజెక్టుతో తెలంగాణ ప్రాంతంలో ముంపునకు గురవుతున్న నిర్వాసితులకు నష్టపరిహారాన్ని వీలైనంత త్వరగా విడుదల చేయాలని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరారు. ఆ ప్రాజెక్టులో నీటిని నిల్వచేసుకునే విషయంలో సహకరించేందుకు తాము సిద్ధమని.. అయితే ముందుగా నిర్వాసితులకు చెల్లించాల్సిన రూ. 132 కోట్లలో వెంటనే రూ. 40 కోట్లు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు తాను ఏపీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వర్‌రావుతో మాట్లాడానని.. ఆయన దీనిపై సానుకూలంగా స్పందించారని హరీశ్ తెలిపారు. కృష్ణానదిపై నాగార్జునసాగర్, ప్రకాశం బ్యారేజీకి మధ్యలో సుమారు 45 టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తున్న పులిచింతల ప్రాజెక్టు కింద 28 గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. ఇందులో తెలంగాణలోని నల్లగొండ జిల్లాకు చెందిన 13 గ్రామాలున్నాయి. అయితే పునరావాస ప్రక్రియ మాత్రం ఇంకా పూర్తికాలేదు.
కొద్దిరోజుల కింద పులిచింతలలో 10.8 టీఎంసీల నీటిని నిల్వ చేయడంతో.. నల్లగొండ జిల్లాలోని అడ్లూరు, వెలటూరు, కిష్ఠాపురంతో పాటు మరో గ్రామంలోకి నీరు వచ్చి చేరింది. దీనిపై తెలంగాణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో.. ఇరు రాష్ట్రాల ముఖ్య కార్యదర్శుల సమావేశాన్ని నిర్వహించి, ప్రాజెక్టులో 8 టీఎంసీల నీటిని మాత్రమే నిల్వ చేసుకునేలా ఒప్పందం చేసుకున్నారు. దాంతోపాటు తెలంగాణలోని నిర్వాసితులకు ఇవ్వాల్సిన నష్టపరిహారంలో రూ. 20 కోట్లను తక్షణమే విడుదల చేస్తామని ఏపీ హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఆదివారం పులిచింతల నిర్వాసిత గ్రామాల్లో పునరావాస చర్యలపై ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్‌రావు, ఉన్నతాధికారులతో మంత్రి హరీశ్‌రావు సమీక్షించారు. పరిహారం విడుదలపై సమావేశం నుంచే ఏపీ మంత్రి దేవినేనితో హరీశ్ ఫోన్లో మాట్లాడారు.
సహకరించడానికి సిద్ధం..
సమావేశం అనంతరం హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. ‘‘ప్రాజెక్టులో ఏపీ నీటిని నిల్వ చేసుకుంటే మాకెలాంటి అభ్యంతరం లేదు. వారికి సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. అయితే ప్రాజెక్టులో 20 టీఎంసీల నీటిని నిల్వ చేయాలంటే... ఆ మేరకు నిర్వాసితుల పునరావాసానికి రూ. 132 కోట్లు అవసరం. ఇందులో వెంటనే రూ. 40 కోట్లు విడుదల చేస్తే నాలుగు గ్రామాల పునరావాసం పూర్తవుతుంది..’’ అని చెప్పారు. ఇదే అంశమై ఏపీ మంత్రితో మాట్లాడానని.. ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఇక లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌ల తరలింపునకు సంబంధించి ఇరు రాష్ట్రాల అధికారులతో కమిటీ వేశామని, వారు ఇచ్చే నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని హరీశ్ పేర్కొన్నారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు పరిధిలో ఉన్న క్వార్టర్లలో చాలా వరకు కొన్నేళ్లుగా నిరుపయోగంగా ఉన్నాయని.. అందులో శాఖకు అవసరమైన వాటిని ఉంచుకొని, మిగతా వాటిని వేలం ద్వారా అమ్మేయాలని నిర్ణయించామని తెలిపారు. కాగా చెరువుల పునరుద్ధరణపై సోమవారం ముఖ్యమంత్రితో చర్చించి, మార్గదర్శకాలు ఖరారు చేస్తామని చెప్పారు.