Devulapally Prabhakar Rao
-
విద్యుత్ తేజో ‘ప్రభాకరుడు’
కొందరికి పదవుల వల్ల పేరొస్తుంది. కానీ, కొందరు వ్యక్తుల కృషి వల్ల ఆ పదవులకు వన్నె వస్తుంది. అలాంటి అరుదైన వ్యక్తులలో ట్రాన్స్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు ఒకరు. ఆయన వృత్తిలో ప్రవేశిస్తున్నప్పుడే ఎ.పి.ఎస్.ఇ.బి వ్యవస్థ ఏర్పడింది. ఇపుడు ఆ సంస్థ వయస్సు 50 ఏళ్లయితే ప్రభాకర్‌రావు సర్వీసు కూడా 50 ఏళ్లు అయ్యింది. ఇది కూడా అరుదైన సంఘటనగానే మిగిలిపోయింది. ప్రభాకర్‌రావు విద్యుత్ శాఖకే వెలుగులు పంచి వన్నె తెచ్చారు. ఇది కూడా ఆయనకు చెరగని కీర్తి తెచ్చి పెట్టింది. ఆయన వృత్తిలో ఎందరెందరో ఉద్యోగులను, ఇంజనీర్లను, ఆడిటింగ్ సెక్షన్ ఆఫీసర్లను, పలురకాల ట్రేడ్ యూనియన్లు చూశారు. వాళ్లందరి తలలో నాలుకలాగా వ్యవహరించటం ఆయన వ్యక్తిత్వానికి నిదర్శనం. అవిభక్త ఆంధ్రప్రదేశ్‌లో నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి, వై.ఎస్. రాజశేఖరరెడ్డి నుంచి చివరి ఏపీ సీఎంలు కొణిజేటి రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డిల వరకు ఆయనకు బాగా తెలుసు. ఆ కాలంలోని సీఎంలందరూ ప్రభాకర్‌రావు వ్యక్తిత్వాన్ని కొనియాడారు. తెలంగాణ రాష్ట్రం అవతరించాక సీఎం కేసీఆర్ చేపట్టిన 24 గంటల కరెంట్ సరఫరా ఆలోచన అమలుకు ప్రాణంగా ప్రభాకర్‌రావు పనిచేశారు. విద్యుత్ కోతలు లేని రాష్ట్రంగా తెలంగాణను మలచటానికి ఎంతో శ్రమించి ప్రభుత్వానికి కుడిభుజంగా పనిచేశారు. కేసీఆర్ నమ్మి బాధ్యతనిస్తే చిత్తశుద్ధితో పనిచేసి ఆయన మన్ననలు పొందారు. ఈ 50 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో ప్రభాకర్‌రావు వ్యక్తిత్వం, పనివిధానం ద్వారా, నిజాయతీ, నిబద్ధతల ద్వారా విద్యుత్ శాఖపై చెరగని ముద్ర వేశారు. ఒక రకంగా ఆయన తన ఇంటిని చూసుకున్నట్లే విద్యుత్ శాఖను కూడా చూసుకున్నారు. చేసే పనిలో చిత్తశుద్ధి, కృషి, ఆత్మగౌరవం, ఎవరికీ తలవంచనితనం, క్లిష్టసమయాల్లో సమస్యలను ఎదుర్కునే శక్తిని అందుకు పరిష్కార మార్గాలను వెతికి పట్టుకోవటంలో ఆయన సిద్ధహస్తుడు. విద్యుత్‌శాఖలో ప్రభాకర్‌రావు ఒక ఇన్‌సైడర్‌గా ఉన్నారు. విద్యుత్ శాఖ ఆత్మను ఆయన పట్టుకున్నారు. ఆయన ఆ శాఖలో అనేక ఉన్నత శిఖరాలను అధిరోహించారు. 22 ఏళ్ల వయస్సులో ఉద్యోగంలో చేరిన కొత్తలోనే ప్రభాకర్‌రావును ఒక అధికారి అపార్థం చేసుకున్నారు. ఆ సందర్భంగా ఆయనను ‘ఐ విల్ సీ యువర్ ఎండ్’ అని కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ అధికారి అంతమాట అన్నందుకు ‘మనిద్దరి అంతు చూడటానికి పైవాడున్నాడు. మీరు మంచి మూడ్‌లో లేరు’ అని సమయస్ఫూర్తిగా మాట్లాడారు. ప్రభాకర్రావులో ఒక డైనమిజం ఉంది. ఆయన వృత్తిరీత్యా అకౌంట్స్ విభాగంలో ఉన్నప్పటికీ ఆయనకు స్నేహితులంతా ఇంజనీర్లుగా ఉన్నారు. అది కింది స్థాయి నుంచి పై వరకు ఉన్నారు. అలాగే ఆఫీసులో పనిచేసే వాచ్మెన్ దగ్గర్నుంచి ట్రేడ్‌యూనియన్ల వరకు ఎవరు కన్పించినా ప్రేమగా మాట్లాడటం ఆయన నుంచి నేర్చుకోవాలి. ఇంజనీరింగ్ క్యాటగిరికీ, అకౌంట్స్ శాఖకు మధ్యలో అనేక వైరుధ్యాలుంటాయి. ఒక్కొక్కసారి అవి శత్రుత్వాలుగా మారుతాయి. ప్రభాకర్‌రావు ఈ రెండింటి మధ్యలో ఉన్న రైవలిజం అనే బెర్రను చెరిపివేశారు. అదే ఆయనను ఈ రెండు శాఖల మధ్య వారధిని చేశాయి. ఈ రెండు శాఖల మధ్య ఆయన వంతెనగా మారడంతో విద్యుత్ శాఖలో ‘‘లోపల మనిషి’’ అయ్యారు. ఆయన అకౌంట్స్ ఆఫీసర్‌గా మొదలై అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారు. ఈ దశలోనే ఆయన అసోషియేషన్ అధ్యక్షుడూ అయ్యారు. దీంతో అన్ని శాఖల మధ్య దూరాన్ని తొలగించి మంచి వాతావరణాన్ని ఏర్పాటు చేయగలిగారు. విద్యుత్ శాఖలో ఆయన ఈ ఉన్నత దశలో ఉండటానికి కారణం ఇదేననుకుంటా! తెలంగాణ రాష్ట్ర అవతరణ తరువాత అలుముకున్న చీకట్లను తొలగించటానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో కృషి చేశారు. తెలంగాణ రాష్ట్రం వస్తే చీకట్లు కమ్ముకుంటాయని జరిగిన ప్రచారాల్ని తిప్పి కొట్టడానికి ఆయన సీఎం అయ్యాక తొలిగా 24 గంటల నిరంతర కరెంటు ఇచ్చే పనికి శ్రీకారం చుట్టారు. చీకట్లను చీల్చుకుంటూ విద్యుత్ వెలుగులను పంచటానికి ముందుకు సాగిన కేసీఆర్‌కు ఈ ప్రభాకర్‌రావు ఒక కార్యకర్తగా కృషిచేశారు. దాన్ని ముఖ్యమంత్రి కేసీఆరే స్వయంగా ప్రకటించారు. అవిభక్త ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్‌శాఖ అభివృద్ధి కోసం కృషిచేసిన ప్రభాకర్‌రావుకు అనుకోకుండా రాష్ట్రం రావడంతో తను పుట్టిపెరిగిన నేలకు సేవ చేసి తరించే అవకాశాన్ని కేసీఆర్ కల్పించారు. ట్రాన్స్‌కో సీఎండిగా ప్రభాకర్‌రావును ఎంపిక చేయటం ఒక రకంగా ఆయనకు జీవనసాఫల్య పురస్కారం లభించినట్లుగానే భావించాలి. కేసీఆర్ ఏ పనైనా చేపడితే ఎంత మొండితనంతో దూసుకుపోతాడో తెలిసిందే. అందుకు నికార్సైన మనుషులనే ఆయన ఎంచుకుంటారు. ఈ దారిలో విద్యుత్‌శాఖకు ప్రభాకర్‌రావును ఆయన ఎంచుకున్నారు. సరిగ్గా కేసీఆర్ ఏ ఆలోచనతో ముందుకుపోతున్నారో అందుకు మొత్తం విద్యుత్‌శాఖను సన్నద్ధం చేసిన కార్యకర్తగా ప్రభాకర్‌రావుకు గుర్తింపు ఉంది. ఇది ఆయన జీవితంలో అందుకున్న అన్ని పురస్కారాలకంటే గొప్పది. -జూలూరు గౌరీశంకర్ తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు మొబైల్ : 94401 69896 -
తెలంగాణ ‘పవర్’ ప్రభాకర్‌రావు!
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వశాఖలో పదవీ విరమణ వయసు 58 ఏళ్లు. సేవలను గుర్తించి కొంత కాలం పొడిగించినా మరో ఐదేళ్లు మించి కొనసాగే అవకాశం అరుదుగా వస్తుంది. దీంతో ఒక వ్యక్తి ప్రభుత్వశాఖలో పనిచేసే సగటుకాలం 40 ఏళ్లు. కానీ ఒకే శాఖలో ఉద్యోగం సాధించి అంచెలంచెలుగా వివిధ హోదాల్లో పనిచేస్తూ ఏకంగా 50 ఏళ్ల పాటు కొనసాగుతూ రికార్డు సృష్టించారు జెన్కో–ట్రాన్స్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు. రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభాన్ని విజయవంతంగా పరిష్కరించి, నిరంతర విద్యుత్ సరఫరా చేయడంలో ముఖ్య భూమిక పోషించిన ప్రభాకర్‌రావు విద్యుత్ సంస్థలో చేరి ఈ నెల 10 నాటికి 50 ఏళ్లవుతోంది. అకౌంట్స్ ఆఫీసర్ నుంచి.. ఏపీ రాష్ట్ర ఎలక్ట్రిసిటీ బోర్డులో (ఏపీఎస్ఈబీ)లో అసిస్టెంటు అకౌంట్స్ ఆఫీసర్‌గా 1969 ఫిబ్రవరి 10న ప్రభాకర్‌రావు విధుల్లో చేరారు. 1992లో ఏపీఎస్ఈబీ ఫైనాన్షియల్ అడ్వైజర్, చీఫ్ కంట్రోలర్ ఆఫ్ అకౌంట్స్‌గా నియామకమయ్యారు. 1998లో బోర్డు మెంబర్ (అకౌంట్స్)గా నియమితులయ్యారు. ఐఏఎస్ అధికారులు, ఇంజనీర్లు కాని వారిని బోర్డు మెంబర్‌గా నియమించడం అదే ప్రథమం. 1999లో ఏపీఎస్ఈబీ జెన్కో, ట్రాన్స్‌కో, డిస్కంలుగా విడిపోయింది. అప్పుడు ప్రభాకర్‌రావు ఏపీ ట్రాన్స్‌కో డైరెక్టర్ (ఫైనాన్స్)గా నియమితులయ్యారు. ప్రభుత్వంతో విభేదాలు రావడంతో 2002లో డైరెక్టర్ పదవికి రాజీనామా చేశారు. మరో ఏడేళ్ల సర్వీసు ఉండగానే ఉద్యోగాన్ని వదిలేశారు. 2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎం అయ్యాక ప్రభాకర్‌రావును మళ్లీ జెన్కో డైరెక్టర్ (ఫైనాన్స్)గా నియమించారు. 2009లో రోశయ్య సీఎం అయ్యాక ప్రభాకర్‌రావును జెన్కో జేఎండీగా నియమించారు. కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎం అయ్యాక కూడా అదే పదవిలో కొనసాగారు. 2014లో తెలంగాణ ఏర్పాటు తర్వాత తెలంగాణ జెన్కో సీఎండీగా నియామకమయ్యారు. తర్వాత ట్రాన్స్‌కో సీఎండీగా కూడా అదనపు బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం ఈ రెండింటి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. లోటును పూడ్చిన ఘనత... మాములుగా ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ పోస్టులను ఐఏఎస్‌లకు ఇస్తారు. సంస్థ ఉద్యోగి అయితేనే సాధక బాధకాలు తెలుస్తాయనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ నాన్ ఐఏఎస్ అయిన ప్రభాకర్‌రావుకు జెన్కో సీఎండీగా బాధ్యతలు అప్పగిస్తూ మొదటి నిర్ణయం తీసుకున్నారు. ఆయన బాధ్యతలు తీసుకున్న నాడు తెలంగాణ విద్యుత్ రంగం సంక్షోభంలో ఉంది. పరిశ్రమలకు పవర్ హాలిడేలు, గృహ విద్యుత్‌కు గంటల తరబడి కోతలు, వ్యవసాయానికి 4 గంటల వరకు కరెంటే అందేది. ఆ కరెంటూ తక్కువ సామర్థ్యం కూడినది కావడంతో మోటార్లు కాలిపోయేవి. ట్రాన్స్ ఫార్మర్లు పేలిపోయేవి. రాష్ట్రం ఏర్పడే నాటికి విద్యుత్ కొరత 2,700 మెగావాట్లు. ఆ లోటు ఎలా పూడుతుందో తెలియని పరిస్థితి. సీఎం తనపై ఉంచిన నమ్మకాన్ని ప్రభాకర్‌రావు నూటికి నూరుపాళ్లు నిలబెట్టారు. తెలంగాణ ఏర్పడిన ఆరో నెల నుంచే (2014, నవంబర్ 20) కోతలు ఎత్తివేశారు. 24 గంటల విద్యుత్‌సరఫరా ప్రారంభించారు. అప్ప ట్నుంచే రైతులకు 9 గంటల విద్యుత్ అందింది. 2018 జనవరి 1 నుంచి దేశంలో మరెక్కడా లేని విధంగా రాష్ట్రంలోని 23 లక్షల పంపుసెట్లకు 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్‌ను ఉచితంగా అందిస్తున్నారు. ఇటు నిదానంగా నడుస్తున్న విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల పనులను ప్రభుత్వం వేగం చేసింది. కొత్త విద్యుత్ ప్లాంట్లు నిర్మించింది. దక్కించుకున్న అవార్డులు విద్యుత్ రంగంలో అద్వితీయమైన కృషికి పలు అవార్డులు ప్రభాకర్‌రావు అందుకున్నారు. ‘ఎకనామిక్ టైమ్స్ అవార్డు–2018’, ‘సీబీఐపీ ప్రత్యేక గుర్తింపు అవార్డు–2018’ పొందారు. తెలంగాణ విద్యుత్ రంగం–పంపిణీలో మార్పులు, నిర్వహణపై ‘స్కోచ్ గోల్డ్ అవార్డు–2018’, తెలంగాణ ప్రభుత్వం మేడే సందర్భంగా ప్రదానం చేసిన ‘టీఎస్ జెన్కో, టీఎస్ ట్రాన్స్‌కో బెస్ట్ మేనేజ్మెంట్ అవార్డు’, విద్యుత్ రంగంలో విశేష కృషికి గాను ‘డాక్టర్ బూర్గుల రామకృష్ణారావు అవా ర్డు–2016’ను ఆయన అందుకున్నారు. విద్యుత్ రంగంలో ప్రతిభ కనబరచినందుకుగాను ‘నేషనల్ కౌన్సిల్ ఆఫ్ పవర్ యుటిలిటీస్’ నుంచి ‘ఇండియా పవర్ అవార్డు–2013’, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రాక్టికల్ అకౌంటెన్సీ, హైదరాబాద్ నుంచి ‘ఎక్స్‌లెన్సీ ఇన్ అకౌంటెన్సీ అండ్ ఫైనాన్స్’ అవార్డులు అందుకున్నారు. -
ఆ అధికారం ఈఆర్సీకి లేదు
⇒ సుమోటోగా టారిఫ్ ⇒ జారీ చేయడంపై ట్రాన్స్‌కో సీఎండీ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు విద్యుత్ టారిఫ్ పెంపు ప్రతిపాదనలు సమర్పించని పక్షంలో సుమోటో (తమంతట తాము)గా నిర్ణయం తీసుకుంటామని హెచ్చరిస్తూ తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (టీఎస్ఈఆర్సీ) లేఖ రాయడాన్ని తెలంగాణ రాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థ (జెన్కో), విద్యుత్ సరఫరా సంస్థ(ట్రాన్స్‌కో)ల సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు తీవ్రంగా తప్పుపట్టారు. గత నెల 11న ఈఆర్సీ డిస్కంలకు రాసిన లేఖపై ఆయన స్పందిస్తూ ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. సుమోటోగా విద్యుత్ టారిఫ్‌పై నిర్ణయం తీసుకోవడానికి ఈఆర్సీ ఏమీ ప్రభుత్వం కానీ, కోర్టు కానీ కాదని స్పష్టం చేశారు. ఈఆర్సీకి అలాంటి అధికారాలు లేవన్నారు. వార్షిక ఆదాయ అవసరాల నివేదిక (ఏఆర్ఆర్), టారిఫ్ ప్రతిపాదనలను డిస్కంలు సమర్పించిన తర్వాతే విద్యుత్ టారిఫ్‌పై నిర్ణయం తీసుకునే అధికారం ఈఆర్సీకి ఉందని స్పష్టం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఏఆర్‌ఆర్‌లు, టారిఫ్ ప్రతిపాదనలు సమర్పించడంలో జాప్యం జరిగిందని, ఏ ఈఆర్సీ ఇలాంటి నోటీసులు జారీ చేయలేదన్నారు. ఉజ్వల్ డిస్కం యోజన (ఉదయ్) పథకంలో డిస్కంల చేరికతో పాటు పెద్ద నోట్ల రద్ద కారణాలతో టారిఫ్ ప్రతిపాదనల సమర్పణలో జాప్యం జరిగిందన్నారు. విద్యుత్ టారిఫ్ పెంపు ప్రతిపాదనలను ఇప్పటికే డిస్కంలు సీఎం కేసీఆర్‌కు సమర్పించాయని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని ఆయన స్పష్టంచేశారు. ఛత్తీస్‌గఢ్ పీపీఏకూ అనుమతి అక్కర్లేదు ఛత్తీస్‌గఢ్ నుంచి 1,000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలు చేసేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందానికి (పీపీఏకు) తెలంగాణ రాష్ట్ర ఈఆర్సీ ఆమోదించాల్సిన అవసరం లేదని ప్రభాకర్ రావు తేల్చి చెప్పారు. నిబంధనల మేరకు ఛత్తీస్‌గఢ్ ఈఆర్సీ ఆమోదిస్తే సరిపోతుందన్నారు. ఉత్తర, తూర్పు, పశ్చిమ విద్యుత్ గ్రిడ్ల (న్యూ గ్రిడ్)తో దక్షిణ గ్రిడ్ అనుసంధానం కోసం పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నిర్మిస్తున్న వార్ధా (మహారాష్ట్ర)– డిచ్ పల్లి– మహేశ్వరం 765 కేవీ డబుల్ సర్క్యూ ట్ కారిడార్ నిర్మాణం పూరై్తన వెంటనే ఛత్తీస్‌గఢ్ నుంచి విద్యుత్ కొనుగోళ్లు ప్రారం భిస్తామన్నారు. -
జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు బాధ్యతల స్వీకరణ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ విద్యుత్ ఉత్పాదన సంస్థ(టీ-జెన్కో) సీఎండీగా దేవులపల్లి ప్రభాకర్‌రావు విద్యుత్‌సౌధలో గురువారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ, కొత్త విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రస్తుతం పరిశ్రమలకు ఎటువంటి విద్యుత్ కోతలు లేవన్నారు. ఛత్తీస్‌గఢ్ నుంచి అదనపు విద్యుత్‌కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.