ఎయిరిండియాపై కెయిర్న్ దావా ప్రభావం ఉండదు..
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియాలో వాటాల విక్రయంపై కెయిర్న్ ఎనర్జీ, దేవాస్ మల్టీమీడియా సంస్థలు దాఖలు చేసిన కేసుల ప్రభావమేమీ ఉండదని కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి వీకే సింగ్ స్పష్టం చేశారు. సొంత మేనేజ్మెంటు, బోర్డుతో ఎయిరిండియా ప్రత్యేకంగా కార్పొరేట్ కంపెనీగా కార్యకలాపాలు సాగిస్తోందని లోక్సభలో ఆయన తెలిపారు. పన్ను వివాదంలో కేంద్రం నుంచి పరిహారం రాబట్టుకునే క్రమంలో బ్రిటన్ సంస్థ కెయిర్న్ ఎనర్జీ.. విదేశాల్లోని భారత ఆస్తులను జప్తు చేసుకునేందుకు వివిధ దేశాల్లో కేసులు వేసింది. ఇందులో భాగంగా ఎయిరిండియా ఆస్తుల జప్తుపై కూడా దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో మంత్రి వివరణ ప్రాధాన్యం సంతరించుకుంది.
‘ఏవియేషన్’ సవాళ్ల పరిష్కారానికి సలహా బృందాలు
కాగా, విమానయాన పరిశ్రమ ఎదుర్కొంటున్న సవాళ్లు, సమస్యల పరిష్కారానికి గాను పౌర విమానయాన శాఖ మూడు సలహా బృందాలను ఏర్పాటు చేసింది. ఎయిర్లైన్స్ సంస్థలు, ఎయిర్పోర్ట్ ఆపరేటర్లు, కార్గో (సరుకు రవాణా) విమానయాన సంస్థలు, గ్రౌండ్ హ్యాండ్లింగ్ సంస్థలు, ఫ్లయింగ్ శిక్షణా కేంద్రాలు, మరమ్మతులు, నిర్వహణ సంస్థలకు ఇందులో చోటు కల్పించింది. కరోనా మొదటి విడతలో రెండు నెలల పాటు విమానయాన సర్వీసులు మూతపడ్డాయి. రెండో విడతలోనూ సర్వీసులు, ప్రయాణికుల సామర్థ్యాన్ని గణనీయంగా తగ్గించుకుని నిర్వహించాల్సి వచ్చింది. ఈ ప్రభావం ఈ పరిశ్రమలోని సంస్థలపై గట్టిగానే పడింది. దీంతో భారీ నష్టాలతో వాటి ఆర్థిక పరిస్థితులు క్లిష్టంగా మారాయి. దీంతో పౌర విమానయాన శాఖ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడం గమనార్హం. ‘‘పౌర విమానయాన మంత్రి జ్యోతిరాదిత్య సింధియా చైర్మన్గా మూడు సలహా బృందాలను ఏర్పాటు చేయడమైనది. ఈ బృందాలు క్రమం తప్పకుండా సమావేశమై పలు అంశాలపై చర్చించడంతోపాటు.. ఈ రంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి సూచనలు చేస్తాయి’’ అంటూ పౌర విమానయాన శాఖ ప్రకటన విడుదల చేసింది.