గ్రేహౌండ్స్ పని తీరును అభినందించిన రాయ్
హైదరాబాద్: రాష్ట్రంలో నక్సల్స్ అణచివేతకు పని చేస్తున్న గ్రేహోండ్స్ పని తీరును గవర్నర్ సలహాదారు ఎం.ఎన్. రాయ్ మంగళవారం అభినందించారు. పోలీసు ఆస్తుల విభజనను సమీక్షించిన సందర్భంగా ఆయన ఈ రోజు గండిపేట్, ప్రేమావతి పేటలోని గ్రేహోండ్స్ ప్రధాన కార్యాలయాలను సందర్శించారు. ఆయన వెంట డీజీపీ బి. ప్రసాదరావు, గ్రేహోండ్స్ డీజీపీ జె.వి. రాముడు ఉన్నారు.
ఎలాంటి వాతావరణంలో నైనా చురుకుగా పనిచేసే చిచ్చర పిడుగులాంటి గ్రేహౌండ్స్ కమెండోల యాంటి నక్సలైట్ ఆపరేషన్ నైపుణ్యాన్ని చూసి ఆయన అభినందించారు. అపాయెంటెడ్ డే సమీపిస్తున్న కొలది పోలీసుశాఖలో విభజన ప్రక్రియను అధికారులు వేగవంతం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హోం,పోలీసుశాఖలను పర్యవేక్షిస్తున్న రాష్ట్ర గవర్నర్ సలహాదారుడు , ఎం.ఎన్.రాయ్ పోలీసుశాఖకు చెందిన ఆస్తుల పంపకం కోసం వివిధ భవనాలను స్వయంగా మంగళవారం సందర్శించారు. పంపకాల కోసం తీసుకుంటున్న పనులను ఆయన సమీక్షించారు. ఇందులో భాగంగా గత రెండురోజులుగా ఆయన రాష్ట్ర డీజీపీ హెడ్‌క్వార్టర్స్‌లోని వివిధ విభాగాలను తిలకించారు.
డీజీపీ కార్యాలయంలోని నాలుగు అంతస్తుల్లో ఉన్న అదనపు డీజీలు, ఐజీలు, డీఐజీల కార్యాలయాలతోపాటు అదే ప్రాంగణంలోని పోలీసు కమ్యూనికేషన్స్, రైల్వే పోలీసు, పోలీసు రిక్రూట్మెంట్, పోలీసు హౌజింగ్ కార్పోరేషన్ల కార్యాలయాలను రాయ్ సందర్శించారు. అలాగే బేగంపేట్‌లోని గ్రేహౌండ్స్ ప్రధాన కార్యాలయం, యాంటి టైస్ట్ ఆపరేషన్ విభాగం అక్టోపస్ కార్యాలయాలను కూడా రాయ్ సందర్శించారు. చివరిలో ఆయన యాంటి నక్సలైట్ నిఘా విభాగం ఎస్ఐబీ కార్యాలయాన్ని కూడా సందర్శించారు.