Dhaba hotel
-
అయ్యో ఎంత కష్టం: బాబా కా దాబా యజమాని ఆత్మహత్యాయత్నం
సాక్షి,న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి మొదటి దశలో లాక్డౌన్ ఆంక్షలు సందర్భంగా వార్తల్లో నిలిచిన బాబా కా దాబా యజయాని కాంతా ప్రసాద్ అనూహ్యంగా ఆత్మహత్యకు ప్రయత్నించడం కలకలం రేపింది. 81 ఏళ్ళ వయసులో కూడా నిరంతరం కష్టపడుతున్న ఆయనకు తీరని నష్టాలు వేధించడంతోనే నిద్రమాత్రలు సేవించి, ఆత్మహత్యకు ప్రయత్నించారు. దీన్నిగమనించినకుటుంబ సభ్యులు ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఇటీవల పెట్టుకున్న రెస్టారెంట్ నష్టాల్లో మునిగిపోవడంతో వీరు మళ్లీ తన పాత హోటల్ వైపే మొగ్గారు. అయినా కరోనా ఆంక్షలు, హోటల్ నష్టాలను భరించలేక తనువు చాలించాలని భావించిన వైనం ఆందోళన రేపింది. తన తండ్రి నిద్రమాత్రలు తీసుకున్నారని కాంతాప్రసాద్ కుమారుడు కరణ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఉదంతంపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని పోలీసు ఉన్నతాధికారి అతుల్ ఠాకూర్ వెల్లడించారు. కాగా కాంతా ప్రసాద్, ఆయన భార్య బాదామీ దేవి దక్షిణ ఢిల్లీలోని మాలవ్యా నగర్లో రోడ్డు పక్కన చిన్న హోటల్ పెట్టుకుని జీవనం సాగించేవారు. కరోనా వల్ల ఆదాయం లేక కన్నీటి పర్యంతం అవుతున్న బాబా కా దాబా దంపతుల వ్యథను యూ ట్యూబర్ గౌరవ్ వాసన్ గత ఏడాది సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో, అది దేశవ్యాప్తంగా వైరల్‌గా మారింది. దీంతో పలువురు మానవతావాదులు అందించిన ఆర్థిక సాయంతో కాంతాప్రసాద్ దంపతులు తమ అప్పులన్నీ తీర్చేశారు రూ.5 లక్షల అద్దె స్థలంలో రెస్టారెంట్ ప్రారంభించారు. ఆరు నెలలపాటు సక్రమంగా నడిచినా కథ మళ్లీ మొదటి కొచ్చింది. కస్టమర్ల ఆదరణ లేక నష్టాలు వస్తుండడంతో చేసేది లేక ఈ ఏడాది ఫిబ్రవరిలో మూసేశారు. మళ్లీ పాత హోటల్‌నే నడుపుకుంటూ జీవిస్తున్నారు. ఇంతలోనే ఈ ఘటన చోట చేసుకుంది. -
ధాబా బాబా.. కొత్త రెస్టారెంట్
న్యూఢిల్లీ: విధి ఎవరిని ఎప్పుడు గెలిపిస్తుందో ఎవరికీ తెలియదు. కొందరికి లేటు వయసులో అదృష్టం తలుపుతడుతుంది. అప్పుడు మనం ఎలా స్పందిస్తామనేదానిపై తదుపరి భవిష్యత్ ఆధారపడుతుంది. 80 సంవత్సరాల కాంతా ప్రసాద్‌కు చాలా లేటు వయసులో అదృష్టం వరించింది. ‘బాబా కా దాభా’ ఓనరైన కాంతా ప్రసాద్ చివరకు ఒక రెస్టారెంటు ఓనరయ్యాడు. దక్షిణ ఢిల్లీలోని మాలవీయనగర్‌లో ఆరంభించిన ఈ రెస్టారెంటును చూసుకుంటూనే తన పాత దుకాణాన్ని కూడా కొనసాగిస్తానని చెప్పారు. ఇందులో పనిచేసేందుకు ప్రసాద్ ఇద్దరిని నియమించుకున్నారని తనతో కలిసినడిచే సామాజిక కార్యకర్త తుషాంత్ అద్లాకా చెప్పారు. బుధవారం నుంచి రెస్టారెంట్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చిందన్నారు. రెస్టారెంటుపై రూ. 5లక్షల పెట్టుబడి పెట్టారని, సదరు బిల్డింగ్‌కు నెలకు రూ. 35వేలు అద్దెని చెప్పారు. 80 ఏళ్ల ప్రసాద్ చివరకు ఆర్థిక స్థిరత్వాన్ని పొందడంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు. బాబా కా ధాబాపేరిట ఢిల్లీలో చిన్నపాటి హోటల్ నడుపుకునే కాంతా ప్రసాద్ వ్యాపారంపై కరోనా ప్రభావం పడింది. దీంతో జీవనం గడవక కన్నీరుమున్నీరవుతున్న కాంతా ప్రసాద్ బాధలను గౌరవ్ వాసన్ అనే వ్యక్తి వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పెట్టాడు. దీంతో చాలామంది ప్రసాద్‌కు ఆసరాగా నిలిచి ఆర్థిక సాయం చేశారు.అనంతరం ఒక నెలకు తన వీడియో పోస్టు చేసిన వ్యక్తిపైనే నిధుల దుర్వినియోగం చేస్తున్నాడంటూ ప్రసాద్ కేసు పెట్టారు. అయితే ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ తాజాగా కాంతా ప్రసాద్ అదే పేరిట ఒక రెస్టారెంట్‌ను ఆరంభించారు. -
డీసీఎం - బైక్ ఢీ.. ఒకరి మృతి
నల్గొండ (భువనగిరి): వేగంగా వస్తున్న డీసీఎం ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టడంతో ఒక వ్యక్తి మృతిచెందాడు. ఈ సంఘటన నల్గొండ జిల్లా భువనగిరి శివారులో సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. నాగిరెడ్డిపల్లి పరిధిలోని వింబావి గ్రామానికి చెందిన కాసాని కొండల్(29) భువనగిరి నుంచి నందనం వైపు వెళ్తుండగా వెనకనుంచి వచ్చిన డీసీఎం ఢీకొట్టింది. దీంతో ఆయన అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ప్రమాదంలో బైక్ మీద ఉన్న అతని కుమారుడికి స్వల్ప గాయాలయ్యాయి. అతన్ని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఢీకొట్టిన వాహనం ఆపకుండా వెళ్లడం చూసిన స్థానికులు కొద్ది దూరంలో ఉన్న ఢాబా హోటల్ వారికి సమాచారం అందించడంతో వాళ్లు డీసీఎంను అదుపులోకి తీసుకున్నారు.