కొత్త రెస్టారెంట్‌లో కాంతా ప్రసాద్ దంపతులు
న్యూఢిల్లీ: విధి ఎవరిని ఎప్పుడు గెలిపిస్తుందో ఎవరికీ తెలియదు. కొందరికి లేటు వయసులో అదృష్టం తలుపుతడుతుంది. అప్పుడు మనం ఎలా స్పందిస్తామనేదానిపై తదుపరి భవిష్యత్ ఆధారపడుతుంది. 80 సంవత్సరాల కాంతా ప్రసాద్‌కు చాలా లేటు వయసులో అదృష్టం వరించింది. ‘బాబా కా దాభా’ ఓనరైన కాంతా ప్రసాద్ చివరకు ఒక రెస్టారెంటు ఓనరయ్యాడు. దక్షిణ ఢిల్లీలోని మాలవీయనగర్‌లో ఆరంభించిన ఈ రెస్టారెంటును చూసుకుంటూనే తన పాత దుకాణాన్ని కూడా కొనసాగిస్తానని చెప్పారు. ఇందులో పనిచేసేందుకు ప్రసాద్ ఇద్దరిని నియమించుకున్నారని తనతో కలిసినడిచే సామాజిక కార్యకర్త తుషాంత్ అద్లాకా చెప్పారు. బుధవారం నుంచి రెస్టారెంట్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చిందన్నారు.
రెస్టారెంటుపై రూ. 5లక్షల పెట్టుబడి పెట్టారని, సదరు బిల్డింగ్‌కు నెలకు రూ. 35వేలు అద్దెని చెప్పారు. 80 ఏళ్ల ప్రసాద్ చివరకు ఆర్థిక స్థిరత్వాన్ని పొందడంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు. బాబా కా ధాబాపేరిట ఢిల్లీలో చిన్నపాటి హోటల్ నడుపుకునే కాంతా ప్రసాద్ వ్యాపారంపై కరోనా ప్రభావం పడింది. దీంతో జీవనం గడవక కన్నీరుమున్నీరవుతున్న కాంతా ప్రసాద్ బాధలను గౌరవ్ వాసన్ అనే వ్యక్తి వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పెట్టాడు. దీంతో చాలామంది ప్రసాద్‌కు ఆసరాగా నిలిచి ఆర్థిక సాయం చేశారు.అనంతరం ఒక నెలకు తన వీడియో పోస్టు చేసిన వ్యక్తిపైనే నిధుల దుర్వినియోగం చేస్తున్నాడంటూ ప్రసాద్ కేసు పెట్టారు. అయితే ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ తాజాగా కాంతా ప్రసాద్ అదే పేరిట ఒక రెస్టారెంట్‌ను ఆరంభించారు.
Comments
Please login to add a commentAdd a comment