
సాక్షి,న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి మొదటి దశలో లాక్‌డౌన్ ఆంక్షలు సందర్భంగా వార్తల్లో నిలిచిన బాబా కా దాబా యజయాని కాంతా ప్రసాద్ అనూహ్యంగా ఆత్మహత్యకు ప్రయత్నించడం కలకలం రేపింది. 81 ఏళ్ళ వయసులో కూడా నిరంతరం కష్టపడుతున్న ఆయనకు తీరని నష్టాలు వేధించడంతోనే నిద్రమాత్రలు సేవించి, ఆత్మహత్యకు ప్రయత్నించారు. దీన్నిగమనించినకుటుంబ సభ్యులు ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఇటీవల పెట్టుకున్న రెస్టారెంట్ నష్టాల్లో మునిగిపోవడంతో వీరు మళ్లీ తన పాత హోటల్ వైపే మొగ్గారు. అయినా కరోనా ఆంక్షలు, హోటల్ నష్టాలను భరించలేక తనువు చాలించాలని భావించిన వైనం ఆందోళన రేపింది.
తన తండ్రి నిద్రమాత్రలు తీసుకున్నారని కాంతాప్రసాద్ కుమారుడు కరణ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఉదంతంపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని పోలీసు ఉన్నతాధికారి అతుల్ ఠాకూర్ వెల్లడించారు. కాగా కాంతా ప్రసాద్, ఆయన భార్య బాదామీ దేవి దక్షిణ ఢిల్లీలోని మాలవ్యా నగర్‌లో రోడ్డు పక్కన చిన్న హోటల్ పెట్టుకుని జీవనం సాగించేవారు. కరోనా వల్ల ఆదాయం లేక కన్నీటి పర్యంతం అవుతున్న బాబా కా దాబా దంపతుల వ్యథను యూ ట్యూబర్ గౌరవ్ వాసన్ గత ఏడాది సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో, అది దేశవ్యాప్తంగా వైరల్‌గా మారింది. దీంతో పలువురు మానవతావాదులు అందించిన ఆర్థిక సాయంతో కాంతాప్రసాద్ దంపతులు తమ అప్పులన్నీ తీర్చేశారు రూ.5 లక్షల అద్దె స్థలంలో రెస్టారెంట్ ప్రారంభించారు. ఆరు నెలలపాటు సక్రమంగా నడిచినా కథ మళ్లీ మొదటి కొచ్చింది. కస‍్టమర్ల ఆదరణ లేక నష్టాలు వస్తుండడంతో చేసేది లేక ఈ ఏడాది ఫిబ్రవరిలో మూసేశారు. మళ్లీ పాత హోటల్‌నే నడుపుకుంటూ జీవిస్తున్నారు. ఇంతలోనే ఈ ఘటన చోట చేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment