బాణసంచాకు 9 మంది బలి
సాక్షి, చెన్నై: దీపావళికి ముందురోజు తమిళనాడులో బాణసంచా పేలిన దుర్ఘటనలో తొమ్మిది మంది మృతిచెందారు. శుక్రవారం తంజావూరు జిల్లా కుంభకోణం సమీపంలోని ఉలవచ్చం గ్రామంలో టపాసులు తయూరు చేస్తుండగా భారీ పేలుడు సంభవించింది. మరణించిన వారిలో ఆరుగురు మహిళలు, ముగ్గురు పురుషులు ఉన్నారు. వివరాలు.. దీపావళి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా బాణసంచా విక్రయం జోరందుకుంది. అయితే. శివకాశి బాణసంచా ధరలు అధికంగా ఉండడంతో గ్రామాల్లో తక్కువ ధరకు లభించే నాటు టపాసులకు డిమాండ్ పెరిగింది.
దీంతో చాలా గ్రామాల్లో ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులూ తీసుకోకుండానే వీటి తయూరీ కొన్నాళ్లుగా సాగుతోంది. ఈ క్రమంలోనే ఉలవచ్చం గ్రామంలో రేకుల షెడ్డు ఏర్పాటు చేసుకుని కొందరు బాణసంచా తయారు చేస్తున్నారు. శుక్రవారం మధ్యాహ్నం తయారీదారులు పనిలో నిమగ్నమై ఉన్న సమయంలో భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. కన్నుమూసి తెరిచేలోగా ప్రాంగణమంతా రక్తసిక్తమైంది. 8 మంది తయారీ దారులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకుని హుటాహుటిన రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేసి కొంతమందిని రక్షించారు. ఈ క్రమంలో తీవ్రగాయాలతో ఒకరు ఆస్పత్రిలో కన్నుమూశారు. 10 మంది చికిత్స పొందుతున్నారు. మృతుల, బాధితుల వివరాలు తెలియాల్సివుందని అగ్నిమాపకశాఖ అధికారి ధనశేఖరన్ తెలిపారు.