ఐఎస్ఐఎస్కు చెక్ పెట్టేందుకే 'ధర్మసేన'
న్యూఢిల్లీ: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఇస్లామిక్ స్టేట్‌ను తిప్పికొట్టేందుకు హిందూ స్వాభిమాన్ సన్నద్ధమతోంది. ఉత్తరప్రదేశ్‌లో 'ధర్మసేన' పేరుతో ఒక ప్రైవేట్ సైన్యాన్ని రూపొందించి ఉగ్రవాదులపై పట్టు సాధించాలని హిందూ స్వాభిమాన్ నేతలు భావిస్తున్నారు. అందుకే ధర్మసేన పేరుతో సైనిక శిక్షణ అందిస్తున్నామన్నారు. దస్నా కేంద్రంగా పనిచేస్తున్న హిందూ స్వాభిమాన్ ఆధ్వర్యంలో 15 వేల మంది కార్యకర్తలు కత్తిసాము తదితర యుద్ధవిద్యల్లో శిక్షణ తీసుకున్నారు.
2020 నాటికి తీవ్రవాద దాడులు పెరగునున్నాయని హిందూ స్వాభిమాన్ నాయకులు నమ్ముతున్న నేపథ్యంలో ఈ పరిణామాలు చోటు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఈ సేనలో 8-30 ఏళ్ల మధ్య వయస్కులైన స్త్రీ, పురుషులు, చిన్నారులు చేరుతున్నారు. వీరికి కత్తులు, తుపాకులను ఉపయోగించడంలో శిక్షణ ఇస్తున్నారు. ఇటువంటి శిక్షణ కేంద్రాలు దాదాపు 50 ఉన్నాయి. కొన్ని కేంద్రాల్లో రహస్యంగానూ, మరికొన్నిటిలో బహిరంగంగానూ శిక్షణ ఇస్తున్నారు. మీరట్ లో మూడు, ముజఫర్‌నగర్ జిల్లాలో ఐదు కేంద్రాల్లో బహిరంగంగానే శిక్షణ ఇస్తున్నాయి. శత్రువు దాడి చేసినపుడు తిప్పికొట్టడమే లక్ష్యంగా ధర్మ సేన సిద్ధం అవుతోంది.
దేశ రాజధాని ఢిల్లీకి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉత్తరప్రదేశ్ లో ఐఎస్ఐఎస్ (ఇస్లామిక్ స్టేట్) కు చెక్ పెట్టేందుకంటూ హిందూ ధర్మసేన సన్నద్ధమవుతోంది. హిందుత్వాన్ని కాపాడుకొనేందుకు ప్రాణాలర్పించడానికైనా వెనుకాడేది లేదని ధర్మసేనలో శిక్షణ పొందుతున్నవారు చెప్తున్నారు. మొదటి ఆరు నెలల్లో ధర్మసేన సైనికులకు భగవద్గీత శ్లోకాలు బోధించడంతో పాటు మార్షల్ ఆర్ట్స్‌లో తర్ఫీదు ఇస్తున్నట్లు హిందూ స్వాభిమాన్ నేతలు చెబుతున్నారు. అలాగే ఆరు నెలలు శిక్షణ పొందినవారు కావాలనుకుంటే స్వయంగా తామే శిక్షణ సంస్థను ఏర్పాటు చేసుకోవచ్చునన్నారు. రెండేళ్లలో 15 వేల మందిని సైనికులుగా తయారు చేసినట్టు తెలిపారు.
అయితే దీనిపై తమకు ఎలాంటి సమాచారం లేదని పోలీస్ ఉన్నతాధికారి అలోక్ శర్మ తెలిపారు. ప్రయివేటు సైన్యం ఏర్పాటు వార్తలపై పరిశీలన జరుపుతున్నట్లు పేర్కొన్నారు.