మళ్లీ కోతలు
నెల్లూరు(దర్గామిట్ట), న్యూస్‌లైన్: జిల్లాలో విద్యుత్ కోతలు మళ్లీ ప్రారంభమయ్యాయి. మున్సిపల్ కార్పొరేషన్లో 2 గంటలు, మున్సిపాల్టీల్లో 3 గంటలు, మండల కేంద్రాల్లో 6 గంటలు కోతలు విధించనున్నట్టు సంబంధిత అధికారులు ప్రకటించారు. ఈ మేరకు ఎస్పీడీసీఎల్ సీఎండీ నుంచి శనివారం జిల్లా కార్యాలయానికి ఉత్తర్వులు అందాయి. ఈ కోతలు వెంటనే అమల్లోకి రానున్నాయి.
రెండువారాలుగా ఉష్ణోగ్రత క్రమంగా పెరిగింది. ఉష్ణోగ్రత 39 సెంటీగ్రేడ్‌కు చేరుకుంది. దీంతో జిల్లాలో విద్యుత్ వినియోగం అనూహ్యంగా పెరిగింది. థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో మరమ్మతుల దృష్ట్యా దశలవారీగా ఉత్పత్తిని నిలిపివేశారు. హైడల్ విద్యుత్ ఉత్పత్తిపై ఎక్కువగా ఆధారపడటంతో కోతలు విధించాల్సి వస్తోందని అధికారులు చెబుతున్నారు. జిల్లాలో ప్రస్తుత వినియోగం రోజుకు 87 లక్షల యూనిట్లకు చేరింది. గతంలో 79 లక్షల యూనిట్లు మాత్రమే ఉంది. జిల్లాకు 86 లక్షలు యూనిట్లు కోటాగా ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఉత్పత్తి తగ్గడం, వినియోగం పెరగడం తదితర కారణాలతో కోతలను విధిస్తున్నారు. భవిష్యత్తులో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడం, వినియోగం పెరిగినట్లయితే కోతల వేళలను మరికొన్ని గంటలపాటు పెంచనున్నట్టు అధికారులు చెబుతున్నారు.
కోతల వేళలు : నెల్లూరులో ఉదయం 9గంటల నుంచి 10 వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 వరకు కోత విధించనున్నారు. కావలి, గూడూరు, సూళ్లూరుపేట, ఆత్మకూరు, వెంకటగిరి తదితర మున్సిపాల్టీల్లో 3 గంటల పాటు కోతలు అమలు చేయునున్నారు. ఉదయం 9 నుంచి 10.30 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి 4.30 గంటల వరకు కోతలను విధించనున్నారు. అదే విధంగా మండల కేంద్రాల్లో విద్యుత్ కోతలను 3 గ్రూపులుగా విభజించారు. ఆయా మండలాలను ఒక్కో గ్రూపుగా విభజించి కోతలను అమలు చేయనున్నారు. ‘ఎ’ గ్రూపు ప్రాంతాలకు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అంటే 6 గంటల పాటు కోతలను అమలు చేయనున్నారు. త్రీఫేజ్ సరఫరాను ఉదయం 4 నుంచి 9 గంటల వరకు, రాత్రి 10 నుంచి 12 గంటల వరకు, సింగిల్ ఫేజ్ కింద సాయంత్రం 3 నుంచి 6 గంటల వరకు సరఫరా చేయనున్నారు. ‘బి’ గ్రూపు ప్రాంతాలకు ఉదయం 6 నుంచి 9 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు కోతలను అమలు చేస్తారు. త్రీఫేజ్ విద్యుత్‌ను ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, రాత్రి 12 నుంచి 2 గంటల వరకు, సింగిల్ ఫేజ్‌లో సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు సరఫరా చేస్తారు.
‘సి’ గ్రూపు ప్రాంతాలకు ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కోతలను విధిస్తారు. త్రీఫేజ్లో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 7 గంటల వరకు, తెల్లవారు జామున 2 నుంచి 4 వరకు, సింగిల్ ఫేజ్‌లో మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల వరకు సరఫరా చేస్తారు. ట్రాన్స్‌కో ఎస్ఈ నందకుమార్ ‘న్యూస్‌లైన్’తో మాట్లాడుతూ తక్షణమే జిల్లాలో విద్యుత్ కోతలు అమల్లోకి వస్తాయన్నారు. రానున్న రోజుల్లో వినియోగం పెరిగితే మరిన్ని కోతలు తప్పవన్నారు.