Dharur Mandal
-
దేవుడిసాక్షిగా మద్య నిషేధం
సాక్షి, ధారూరు: దేవుడి సాక్షిగా తమ గ్రామంలో మద్య నిషేధం విధిస్తున్నట్లు గురుదోట్ల వాసులు తీర్మానం చేశారు. ఉల్లంఘిస్తే రూ.25 వేల జరిమానా విధిస్తామన్నారు. వివరాలు.. మండలంలోని గురుదోట్ల గ్రామంలో కొందరు బెల్టుషాపుల ద్వారా మద్యం విక్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో గొడవలు, ఘర్షణలు, దాడులు జరుగుతున్నాయి. ఈవిషయం పంచాయతీ దృష్టికి వచ్చింది. సర్పంచ్, ఎంపీటీసీ మహిళలు కావడంతో గ్రామస్తులతో కలిసి ఈవిషయమై చర్చించారు. గ్రామంలో పలువురు బెల్ట్ షాపుల ద్వారా విక్రయాలు జరుపుతున్నారని, దీంతో యువకులు మద్యానికి అలవాటై గొడవలకు దిగుతున్నారని మహిళలు ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామంలో గురువారం నిర్వహించిన నిమజ్జనంలో గొడవలు, ఘర్షణలు చెలరేగాయని తెలిపారు. గురుదోట్లతోపాటు అనుబంధ తండాలైన ఊరెంట తండా, బిల్యానాయక్ తండాల్లోనూ మద్యం విక్రయాలను నిషేధించాలని సర్పంచ్ అనిత అధ్యక్షతన, ఎంపీటీసీ మాణిక్‌బాయి, గ్రామస్తులు తీర్మానం చేశారు. దీనికి అందరూ కట్టుబడి ఉండాలని, నియమాన్ని ఉల్లంఘిస్తే రూ. 25 వేలు జరిమానా చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఉప సర్పంచ్ రాములు, పంచాయతీ కార్యదర్శి మహబూబ్, మాజీ ఎంపీటీసీ చంద్రయ్య, జీపీ కోఆప్షన్ సభ్యుడు పుల్యానాయక్ తదితరులు ఉన్నారు. -
ధారూర్‌లో భారీ వర్షం
ధారూర్ : రంగారెడ్డి జిల్లా ధారూర్ మండలంలో మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు ఎడతేరపి లేకుండా వాన కురుస్తుంది. దీంతో జిల్లాలోనే కొటిపల్లి జలాశయం నీటి మట్టం ఒక్క రోజులోనే ఏడడుగులు పెరిగింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 24 అడుగులు కాగా మంగళవారం ఉదయం 5 అడుగుల నీరు మాత్రమే ఉంది. రాత్రి కురిసిన వర్షానికి 12 అడుగులకు చేరుకుంది. ధారూర్ మండల కేంద్రంలో 72.50 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదయింది. ఈ నీరుతో పంట సాగు చేసుకోవచ్చని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
అధికారులకు చెమటలు పట్టించిన సబ్ కలెక్టర్
ధారూరు (రంగారెడ్డి) : వికారాబాద్ సబ్ కలెక్టర్ శృతి ఓజా ధారూరు మండల అధికారులకు ముచ్చెమటలు పట్టించారు. మంగళవారం మండల కేంద్రంలోని స్త్రీశక్తి భవనంలో మండల అధికారులతో వివిధ సమస్యలపై ఆమె సమీక్ష జరిపారు. మండుతున్న ఎండలతో ప్రజల నీటి కష్టాల గురించి తెలుసుకునేందుకు సబ్ కలెక్టర్.. ఆర్‌డబ్ల్యూస్ ఏఈఈగా ఇటీవల నియమితులైన శివ రవళిని వివరాలు చెప్పాలంటూ ప్రశ్నించారు. ఇన్చార్జ్ ఏఈ అలీమొద్దీన్ తనకింకా బాధ్యతలు అప్పగించలేదని, సమాచారం తన వద్ద లేదని ఆమె బదులిచ్చారు. దీంతో సబ్ కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ వివరాలు లేకుండా సమావేశానికి ఎందుకు వచ్చినట్లు అని ప్రశ్నించారు. గ్రామ సభలకు ఎంతమంది ప్రజలు హాజరవుతున్నారు? వారిలో మహిళలు ఎందరు? అని సబ్ కలెక్టర్ గ్రామ కార్యదర్శులను ప్రశ్నించారు. 30 నుంచి 60 మంది మాత్రమే హాజరవుతున్నారని, వారిలో మహిళలు చాలా తక్కువగా ఉంటున్నారని వారు ఆమె దృష్టికి తెచ్చారు. ధారూరు మండల కేంద్రం జనాభా ఎంత అని కార్యదర్శి రంజిత్‌కుమార్‌ను ప్రశ్నించగా 5653 మంది అని చెప్పడంతో ఇక్కడ కూడా 60 మందే వస్తే ఎలా అని అడిగారు. గ్రామాల్లో జనన, మరణాలు నమోదు చేస్తున్నారా, ఎన్ని కేసులు మీ దృష్టికి వచ్చాయని తహసీల్దార్ శ్రీనివాస్‌ను ప్రశ్నించగా.. 150 కేసులు ఉన్నాయని చెప్పారు. అనుమానం వచ్చిన ఆమె అక్కడి వీఆర్వోలను ప్రశ్నించగా 80 కేసులే లెక్కకు వచ్చాయి. దీంతో లెక్క సరి చూసుకోవాలని తహశీల్దార్‌కు సూచించారు. వేసవి సెలవుల్లో పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం అవకాశాన్ని అందరు విద్యార్థులూ వినియోగించుకునేలా చూడాలని సబ్‌కలెక్టర్ శృతి ఓజా ఎంఈవో బాబూసింగ్‌కు సూచించారు.