ఆలయం వద్ద సమావేశమైన నాయకులు
సాక్షి, ధారూరు: దేవుడి సాక్షిగా తమ గ్రామంలో మద్య నిషేధం విధిస్తున్నట్లు గురుదోట్ల వాసులు తీర్మానం చేశారు. ఉల్లంఘిస్తే రూ.25 వేల జరిమానా విధిస్తామన్నారు. వివరాలు.. మండలంలోని గురుదోట్ల గ్రామంలో కొందరు బెల్టుషాపుల ద్వారా మద్యం విక్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో గొడవలు, ఘర్షణలు, దాడులు జరుగుతున్నాయి. ఈవిషయం పంచాయతీ దృష్టికి వచ్చింది. సర్పంచ్, ఎంపీటీసీ మహిళలు కావడంతో గ్రామస్తులతో కలిసి ఈవిషయమై చర్చించారు.
గ్రామంలో పలువురు బెల్ట్ షాపుల ద్వారా విక్రయాలు జరుపుతున్నారని, దీంతో యువకులు మద్యానికి అలవాటై గొడవలకు దిగుతున్నారని మహిళలు ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామంలో గురువారం నిర్వహించిన నిమజ్జనంలో గొడవలు, ఘర్షణలు చెలరేగాయని తెలిపారు. గురుదోట్లతోపాటు అనుబంధ తండాలైన ఊరెంట తండా, బిల్యానాయక్ తండాల్లోనూ మద్యం విక్రయాలను నిషేధించాలని సర్పంచ్ అనిత అధ్యక్షతన, ఎంపీటీసీ మాణిక్‌బాయి, గ్రామస్తులు తీర్మానం చేశారు. దీనికి అందరూ కట్టుబడి ఉండాలని, నియమాన్ని ఉల్లంఘిస్తే రూ. 25 వేలు జరిమానా చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఉప సర్పంచ్ రాములు, పంచాయతీ కార్యదర్శి మహబూబ్, మాజీ ఎంపీటీసీ చంద్రయ్య, జీపీ కోఆప్షన్ సభ్యుడు పుల్యానాయక్ తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment