Dharwad district
-
శ్మశానానికి తీసుకెళ్లగా చిన్నారిలో కదలికలు.. ఒక్కసారిగా..
కర్ణాటక: చికిత్స పొందుతున్న 8 నెలల చిన్నారి చనిపోయిందని వైద్యులు భావించి తల్లిదండ్రులకు అప్పగించారు. కన్నీరు మున్నీరైన దంపతులు చిన్నారిని శ్మశానానికి తీసుకెళ్లగా కదలికలు కనిపించాయి. వెంటనే ఆస్పత్రికి తరలించగా 90 శాతం నాడి కొట్టుకుంటోందని వైద్యులు గుర్తించి చికిత్సలు ప్రారంభించారు. ధార్వాడ జిల్లా నవలగుంద తాలూకా బసాపుర గ్రామానికి చెందిన బసప్ప పూజార్ కుమారుడు (8 నెలలు) ఊపిరి సరిగా ఆడకపోవడంతో హుబ్లీ కిమ్స్‌లో చేర్పించారు. నాలుగు రోజుల పాటు చికిత్స అందించిన వైద్యులు గురువారం సాయంత్రం.. పల్స్రేట్ తక్కువగా ఉందని, ఆక్సిజన్ తొలగిస్తే బిడ్డ బతకదని తెలిపారు. అనంతరం చిన్నారి చనిపోయిందని చెప్పి తల్లిదండ్రులతో సంతకం తీసుకొని శిశువును అప్పగించారు. శ్మశానానికి తీసుకెళ్లి ఆచారం ప్రకారం నోట్లో పసుపు నీరు పోస్తుండగా బాలుడు ఆశ్చర్యకరంగా చేతులు, కాళ్లను ఆడించాడు. తక్షణమే నవలగుంద ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స అనంతరం ధార్వాడ సివిల్ ఆస్పత్రికి తరలించారు. నవలగుంద తాలూకా ఆస్పత్రి వైద్యురాలు వై.విద్య మాట్లాడుతూ 90 శాతం మేరకు బిడ్డ ఆరోగ్యంగానే ఉందన్నారు. కిమ్స్ సూపరింటెండెంట్ డాక్టర్ అరుణ్‌కుమార్ మాట్లాడుతూ ఈ బిడ్డ విషయంలో పూర్తిగా కేసు ఫైల్‌ను, ఆరోగ్యానికి సంబంధించిన వివరాలను తెలుసుకొని సమగ్రంగా పరిశీలించాక పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. -
మహిళను వేధించిన కాంగ్రెస్ లీడర్.. ఫ్రెండ్స్‌తో వచ్చి చితకబాదిన లవర్
బెంగళూరు: మహిళను లైంగికంగా వేధించిన కర్ణాటక కాంగ్రెస్ నాయకుడు మనోజ్ కర్జాగిని పోలీసులు అరెస్టు చేశారు. తన సెలూన్లో బ్యుటీషియన్‌గా పనిచేసే మహిళతో అతను అసభ్యంగా ప్రవర్తించాడు. ధార్వాడ్ జిల్లాలో శనివారం ఈ ఘటన జరిగింది. తాను సెలూన్లో ఉన్నప్పుడు మనోజ్ వచ్చి బలవంతంగా వాటేసుకుని ముద్దు పెట్టేందుకు ప్రయత్నించాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. అంతేకాదు జరిగిన విషయాన్ని తన ప్రియుడికి వెంటనే తెలియజేసింది. దీంతో అతను మరో ఇద్దరు స్నేహితులతో కలిసి సెలూన్‌కు వచ్చి కాంగ్రెస్ నేతను చితకబాదాడు. మనోజ్ కర్జాగిని అరెస్టు చేసినట్లు పోలీసులు ధ్రువీకరించారు. అతను తమ హయాంలో ఓ మంత్రికి సహాయకుడిగా పనిచేశాడని కాంగ్రెస్ తెలిపింది. సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనోజ్ నార్త్‌వెస్ట్ కర్ణాటక స్టేట్ ట్రాన్స్పోర్ట్ కార్పోరేషన్ డైరెక్టర్‌గా ఉన్నాడు. వీరిద్దరూ కలిసి దిగిన ఓ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: 60 మంది అమ్మాయిల వీడియోలు లీక్..? స్పందించిన యూనివర్సిటీ -
ప్రాణం మీదకు తెచ్చిన సరదా..సెల్ఫీ కోసం రిజర్వాయర్ ఎత్తైన అంచుకు వెళ్లి..
బెంగళూరు: సెల్ఫీ సరదా ఓ యువకుడి ప్రాణం మీదకు తెచ్చింది. కర్ణాటకకు చెందిన 22 ఏళ్ల కిరణ్ రాజ్‌పుర్ నీర్సాగర్ రిజర్వాయర్‌ను సందర్శించేందుకు వెళ్లాడు. ఇతరుల కంటే భిన్నంగా సెల్ఫీ దిగాలనే ఉత్సుకతతో నీర్సాగర్ రిజర్వాయర్ వద్ద ఎత్తైన అంచుకు వెళ్లాడు. ఆనందంలో సెల్ఫీ తీసుకునే క్రమంలో పొరపాటున కాలుజారి పడిపోయాడు. అనంతరం వరద ఉధృతిలో కొట్టుకుపోయాడు. ఆదివారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. యువకుడి కోసం అతని స్నేహితులు ఎంత వెతికినా ప్రయోజనం లేకుండాపోయింది. అతని కోసం గాలింపు చేపట్టిన సహాయక బృందాలు భారీ వర్షం, వరదల కారణంగా ఆపరేషన్ నిలిపివేశాయి. ధార్వాడ్ బెగూర్‌కు చెందిన ఈ యువకుడు చాలా ఎత్తైన ప్రాంతం నుంచి పడిపోయాడని పోలీసులు తెలిపారు. వర్షాకాలంలో గజ ఈతగాల్లు కూడా అక్కడి నుంచి దూకే సాహయం చేయరని తెలిపారు. యువకుడు ప్రాణాలతో బయటపడే అవకాశాలు కష్టమే అన్నారు. రిజర్వాయర్ దిగువన ఉండే గ్రామస్థులకు సమాచారం అందించామని, ఏమైనా ఆచూకీ లభిస్తే తెలుస్తుందని చెప్పారు. యువకుడి తల్లిదండ్రులు ఘటనా స్థలం వద్దకు వెళ్తుంటే అడ్డుకుని వెనక్కి పంపించామని వివరించారు. వానలు పడినప్పుడు నీర్సాగర్ రిజర్వాయర్‌ను సందర్శించేందుకు చాలా మంది వెళ్తుంటారు. ప్రమాదకర ప్రదేశాలకు వెళ్లవద్దని అక్కడున్న సిబ్బంది, పోలీసులు సందర్శకులను హెచ్చరిస్తూనే ఉంటారు. కొంతమంది మాత్రం అవేమి పట్టించుకోకుండా ఫోటోలు దిగేందుకు రిజర్వాయర్ అంచు వరకు వెళ్తుంటారని పోలీసులు పేర్కొన్నారు. కొన్నిసార్లు ప్రమాదాల బారినపడుతున్నారని చెప్పారు. డ్యాంలో నీటి స్థాయి తగ్గేవరకు సందర్శకులు రాకుండా నిషేధం విధించే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. చదవండి: హైవేపై లారీ నడిపిన మహిళ.. స్మైల్‌కు ఫిదా అవుతున్న నెటిజన్స్ -
పెళ్లయిన కొత్తలో విడిపోయి.. 52 ఏళ్ల తర్వాత ఒక్కటయ్యారు!
హుబ్లీ: పెళ్లయిన కొత్తలో గొడవలతో వేరుపడ్డారు. విడాకులు కూడా తీసుకుని 52 ఏళ్ల పాటు ఎవరికొద్దీ వారు జీవించారు. చివరకు లోక్ అదాలత్ వారిని ఒక్కటి చేసింది. ఈ అపరూప సన్నివేశం కర్ణాటక రాష్ట్రం ధార్వాడ జిల్లా కలఘటికిలో నిర్వహిస్తున్న లోక్ అదాలత్‌లో చోటు చేసుకుంది. జెన్నూరు గ్రామానికి చెందిన బసప్ప అగడి (85), మాజీ భార్య కళవ్వ (80) 52 ఏళ్ల క్రితం విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి కళవ్వకు బసప్ప ప్రతి నెలా భరణం చెల్లించేవాడు. గత కొన్ని నెలలుగా చెల్లించలేకపోయాడు. దీంతో కళవ్వ కోర్టును ఆశ్రయించగా సోమవారం మెగా లోక్ అదాలత్‌లో జడ్జి జీఆర్ శెట్టర్ వారి సమస్యను పరిశీలించారు. నడవలేని స్థితిలో ఉన్న కళవ్వను చూసి ఇద్దరి మధ్య రాజీ కుదిర్చి కలిసి జీవించాలంటూ హితబోధ చేశారు. దంపతులను ఒక్కటి చేసి పంపించారు. (క్లిక్: అయ్యబాబోయ్ ఏనుగులు.. పరుగో పరుగు!) -
ప్రాణం తీసిన ట్రిప్పు.. 9 మంది లేడీ డాక్టర్ల మృతి
వారంతా స్నేహితులు. నివాసాలు సమీపంలోనే. అందరూ కలిసి సేవా కార్యక్రమాలు చేస్తుంటారు. పండుగలు, సెలవుల్లో సరదాగా గడుపుతారు. కనుమ పండుగ రోజు సరదాగా గడుపుదామని గోవా బయలుదేరిన వారికి మృత్యువు ఎదురొచ్చింది. ఇసుక టిప్పర్ రూపంలో దూసుకొచ్చింది. ఆనందంగా గడుపుదామని వెళుతున్న 14 మందిలో తొమ్మిదిమందిని కబళించింది. వారిని తీసుకెళుతున్న వ్యాను డ్రైవర్, క్లీనర్ల ప్రాణాలను కూడా తీసింది. సాక్షి బళ్లారి/హుబ్లీ: కర్ణాటకలో కనుమ పండుగ రోజు శుక్రవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 11 మంది దుర్మరణం పాలయ్యారు. ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. హుబ్లీ–ధార్వాడ బైపాస్ రోడ్డులో ధార్వాడ నగర సమీపంలోని ఇటగట్టి వద్ద టెంపో ట్రావెలర్, ఇసుక టిప్పర్ ఢీకొనడంతో ఈ దారుణం జరిగింది. దావణగెరెకు ఐఎంఏకు చెందిన 15 మంది లేడీ డాక్టర్లు గోవాలో సరదాగా గడుపుదామని శుక్రవారం తెల్లవారుజామున టెంపో ట్రావెలర్‌లో బయలుదేరారు. ధార్వాడలో స్నేహితురాలి ఇంట్లో అల్పాహారం తీసుకోవాలనుకున్నారు. ఉదయం ఏడుగంటల సమయానికి వీరి వాహనం ఇటగట్టి వద్ద వెళుతుండగా ఎదురుగా వస్తున్న ఇసుక టిప్పర్ ఢీకొంది. ఈ ప్రమాదంలో టెంపో ట్రావెలర్ నుజ్జునుజ్జయింది. అందులోని తొమ్మిదిమంది మహిళలు, డ్రైవర్, క్లీనర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వీరంతా సంపన్న, రాజకీయ కుటుంబాలకు చెందిన వారని తెలుస్తోంది. ఇక మరణించిన వారిలో ఎక్కువ మంది గైనకాలజిస్టులే ఉన్నారు. వీరి మరణం సమీప భవిష్యత్తులో ఈ ప్రాంతంలో మాతాశిశు మరణాల రేటుపై ప్రభావం చూపగలదని అభిప్రాయపడుతున్నారు. ఇక ప్రమాద స్థలంలో కొన్ని మృతదేహాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. ఎటు చూసినా రక్తపు మరకలతో ఆ ప్రాంతమంతా భీతావహంగా మారింది. టెంపో ట్రావెలర్‌లో ఇరుక్కుపోయిన మృతదేహాలను అతికష్టం మీద మధ్యాహ్నానికి బయటకు తీశారు. మృతదేహాలను హుబ్లీ కిమ్స్ ఆస్పత్రికి, గాయపడినవారిని హుబ్లీ, ధార్వాడల్లోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు తరలించారు. ధార్వాడ ఎస్పీ కృష్ణకాంత్, ధార్వాడ రూరల్ పోలీసులు, అధికారులు ప్రమాదస్థలాన్ని పరిశీలించారు. పొగమంచు వల్ల ఎదుటి వాహనం కనిపించకపోవడమే ఈ ప్రమాదానికి కారణంగా భావిస్తున్నారు. ప్రయాణానికి ముందు మృతుల సెల్ఫీ మృతులు: వర్షిత వీరేష్ (46), మంజుల నటేశ్ (47), రాజేశ్వరి శివకుమార్ (40), వీణాప్రకాష్ (47), హేమలత (40), పరంజ్యోతి (47), క్షీరా సురేష్ (47), ప్రీతి రవికుమార్ (46), యస్మిత (20), టెంపో ట్రావెలర్ డ్రైవర్ రాజుసోమప్ప (38), క్లీనర్ మల్లికార్జున (21) గాయపడినవారు: పూర్ణిమ (36), ప్రవీణ (32), ఉషారాణి (30), వేద (46), ఆశా (47), టిప్పర్ డ్రైవర్ బసవరాజు అందరూ స్నేహితులే: మృతుల్లో వీణాప్రకాష్, ప్రీతి రవికుమార్ వైద్యులు. మిగిలినవారు వైద్యరంగంలో ప్రైవేటు ఉద్యోగాలు చేస్తున్నారు. స్నేహితులైన వీరు దావణగెరె విద్యానగర్, ఎంసీసీ ఏ, బీ బ్లాక్ లేఔట్లలో నివాసం ఉంటున్నారు. విచారం వ్యక్తం చేసిన ప్రధానమంత్రి కర్ణాటకలో ఘోరరోడ్డు ప్రమాదంలో 11 మంది మరణించడంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన ట్విటర్ ద్వారా తన సంతాపం తెలిపారు. Saddened by the loss of lives due to a road accident in Karnataka’s Dharwad district. In this sad hour, my thoughts are with the bereaved families. I pray for a quick recovery of those injured: PM @narendramodi — PMO India (@PMOIndia) January 15, 2021 -
హనుమంతప్పకు కన్నీటి వీడ్కోలు
‘సియాచిన్’ వీరునికి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు హుబ్బళ్లి: సియాచిన్ మంచుకొండల్లో చిక్కుకుని, ఆరు రోజుల మృత్యువుతో పోరాడి వీరమరణం పొందిన యోధుడు లాన్స్‌నాయక్ హనుమంతప్ప కొప్పాడ్ (33) అంత్యక్రియలు శుక్రవారం స్వగ్రామంలో అశ్రునయనాల మధ్య జరిగాయి. గురువారం రాత్రి భౌతికకాయాన్ని ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి హుబ్బళ్లికి తరలించారు. శుక్రవారం మిలిటరీ వాహనంలో భౌతికకాయాన్ని ఉంచి ప్రజల సందర్శనార్థం నెహ్రూ క్రీడా ప్రాంగణానికి తరలించారు. అక్కడికి రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధ రామయ్యతో పాటు కేంద్ర మంత్రి అనంతకుమార్, పలువురు రాష్ట్ర మంత్రులు, మాజీ సీఎంలు, మాజీ మంత్రులు, వివిధ పార్టీల నాయకులతో పాటు ప్రజలు పెద్ద సంఖ్యలో చేరుకుని శ్రద్ధాంజలి ఘటించారు. తర్వాత అంతిమ యాత్ర నిర్వహించి... ధార్వాడ జిల్లా కుందగోళ తాలూకాలోని స్వగ్రామం బెటదూరుకు తరలించారు. భౌతికకాయాన్ని దర్శించుకున్న అతని తల్లి, భార్య, రెండేళ్ల కుమార్తె సహా కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు కన్నీరుమున్నీరయ్యారు. మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. హనుమంతప్ప కుటుంబ సభ్యులను సిద్ధరామయ్య ఓదార్చారు. రూ.25 లక్షల పరిహారంతో పాటు ఇంటిస్థలం, పొలం, హనుమంతప్ప భార్యకు ఉద్యోగం కల్పిస్తామన్నారు. సియాచిన్ ఘటనలో చనిపోయిన మరో ఇద్దరు రాష్ట్రవాసులు మహేశ్(మైసూర్), నగేశ్(హసన్)ల కుటుంబానికి కూడా ఇదే పరిహారం అందజేస్తామని తెలిపారు.