హనుమంతప్పకు కన్నీటి వీడ్కోలు
‘సియాచిన్’ వీరునికి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు
హుబ్బళ్లి: సియాచిన్ మంచుకొండల్లో చిక్కుకుని, ఆరు రోజుల మృత్యువుతో పోరాడి వీరమరణం పొందిన యోధుడు లాన్స్‌నాయక్ హనుమంతప్ప కొప్పాడ్ (33) అంత్యక్రియలు శుక్రవారం స్వగ్రామంలో అశ్రునయనాల మధ్య జరిగాయి. గురువారం రాత్రి భౌతికకాయాన్ని ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి హుబ్బళ్లికి తరలించారు. శుక్రవారం మిలిటరీ వాహనంలో భౌతికకాయాన్ని ఉంచి ప్రజల సందర్శనార్థం నెహ్రూ క్రీడా ప్రాంగణానికి తరలించారు. అక్కడికి రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధ రామయ్యతో పాటు కేంద్ర మంత్రి అనంతకుమార్, పలువురు రాష్ట్ర మంత్రులు, మాజీ సీఎంలు, మాజీ మంత్రులు, వివిధ పార్టీల నాయకులతో పాటు ప్రజలు పెద్ద సంఖ్యలో చేరుకుని శ్రద్ధాంజలి ఘటించారు.
తర్వాత అంతిమ యాత్ర నిర్వహించి... ధార్వాడ జిల్లా కుందగోళ తాలూకాలోని స్వగ్రామం బెటదూరుకు తరలించారు. భౌతికకాయాన్ని దర్శించుకున్న అతని తల్లి, భార్య, రెండేళ్ల కుమార్తె సహా కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు కన్నీరుమున్నీరయ్యారు. మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. హనుమంతప్ప కుటుంబ సభ్యులను సిద్ధరామయ్య ఓదార్చారు. రూ.25 లక్షల పరిహారంతో పాటు ఇంటిస్థలం, పొలం, హనుమంతప్ప భార్యకు ఉద్యోగం కల్పిస్తామన్నారు. సియాచిన్ ఘటనలో చనిపోయిన మరో ఇద్దరు రాష్ట్రవాసులు మహేశ్(మైసూర్), నగేశ్(హసన్)ల కుటుంబానికి కూడా ఇదే పరిహారం అందజేస్తామని తెలిపారు.