lance naik hanamanthappa
-
హనుమంతప్పకు కన్నీటి వీడ్కోలు
‘సియాచిన్’ వీరునికి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు హుబ్బళ్లి: సియాచిన్ మంచుకొండల్లో చిక్కుకుని, ఆరు రోజుల మృత్యువుతో పోరాడి వీరమరణం పొందిన యోధుడు లాన్స్‌నాయక్ హనుమంతప్ప కొప్పాడ్ (33) అంత్యక్రియలు శుక్రవారం స్వగ్రామంలో అశ్రునయనాల మధ్య జరిగాయి. గురువారం రాత్రి భౌతికకాయాన్ని ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి హుబ్బళ్లికి తరలించారు. శుక్రవారం మిలిటరీ వాహనంలో భౌతికకాయాన్ని ఉంచి ప్రజల సందర్శనార్థం నెహ్రూ క్రీడా ప్రాంగణానికి తరలించారు. అక్కడికి రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధ రామయ్యతో పాటు కేంద్ర మంత్రి అనంతకుమార్, పలువురు రాష్ట్ర మంత్రులు, మాజీ సీఎంలు, మాజీ మంత్రులు, వివిధ పార్టీల నాయకులతో పాటు ప్రజలు పెద్ద సంఖ్యలో చేరుకుని శ్రద్ధాంజలి ఘటించారు. తర్వాత అంతిమ యాత్ర నిర్వహించి... ధార్వాడ జిల్లా కుందగోళ తాలూకాలోని స్వగ్రామం బెటదూరుకు తరలించారు. భౌతికకాయాన్ని దర్శించుకున్న అతని తల్లి, భార్య, రెండేళ్ల కుమార్తె సహా కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు కన్నీరుమున్నీరయ్యారు. మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. హనుమంతప్ప కుటుంబ సభ్యులను సిద్ధరామయ్య ఓదార్చారు. రూ.25 లక్షల పరిహారంతో పాటు ఇంటిస్థలం, పొలం, హనుమంతప్ప భార్యకు ఉద్యోగం కల్పిస్తామన్నారు. సియాచిన్ ఘటనలో చనిపోయిన మరో ఇద్దరు రాష్ట్రవాసులు మహేశ్(మైసూర్), నగేశ్(హసన్)ల కుటుంబానికి కూడా ఇదే పరిహారం అందజేస్తామని తెలిపారు. -
సియాచిన్.. ఓ మృత్యు యుద్ధ క్షేత్రం
న్యూఢిల్లీ: లాన్స్ నాయక్ హనుమంతప్ప అతని తొమ్మిదిమంది అనుచరులను మింగేసిన సియాచిన్ మంచు పర్వతం పైకి చల్లగా.. నిశ్శబ్దంగా కనిపించినా అదొక మృత్యుశిఖరం లాంటిదని అక్కడి ఘటనలు చెప్తున్నాయి. ప్రతి నెల మంచుకొండ చరియలు విరిగిపడటం ద్వారానో, లేక ప్రతికూల వాతావరణ పరిస్థితులు అక్కడ ఏర్పడటం మూలంగానో కనీసం ఒక సైనికుడిని బలితీసుకుంటూనే ఉంటుంది. ఇలా, మోగుతున్న భారత వీర జవాన్ల మృత్యు మృదంగం ఇప్పటిదేం కాదు.. 1984 నుంచే ఇది ప్రారంభమైంది. తొలిసారి పాకిస్థాన్ సైన్యాన్ని ఏ విధంగానైనా కట్టడి చేయాలనే ఉద్దేశంతో అత్యంత దుర్భేద్యమైన దాదాపు 22 వేల అడుగుల ఎత్తులో ఉన్న సియాచిన్ గ్లేసియర్ వద్ద భారత సైనిక శిబిరాలను ఏర్పాటుచేశారు. 1984 నుంచి అక్కడ భారత సేనలను నిలపడం ప్రారంభించారు. అంటే దాదాపు ఎవరెస్టు శిఖరం ఎత్తులో భారత జవాన్లు దేశ రక్షణ కోసం గట్టగట్టి చనిపోయే చలిలో నిత్యం గస్తీ కాస్తున్నారన్నమాట. ప్రభుత్వం లోక్ సభలో ప్రకటించిన ప్రకారం 1984 నుంచి 2015 మధ్య మొత్తం 869 మంది భారత సైనికులు సియాచిన్ గ్లేసియర్ వద్ద మృత్యువాత పడ్డారు. దాని అనంతరం జరిగిన కొన్ని ఘటనలు మొన్న జరిగిన ప్రమాదంలో పదిమంది సైనికులను కలుపుకొని మొత్తం ఇక్కడ ప్రాణాలు కోల్పోయిన సైనికుల సంఖ్య 883కు చేరుకుంది. వీరిలో 33 మంది అధికారులు, 54 మంది జూనియర్ ఆఫీసర్లు, 782 ఇతర ర్యాంకుల జవాన్లు ఉన్నారు. కాగా, అత్యధికంగా 2011లో 24 మంది సైనికులు ఈ గ్లేసియర్‌లో మృత్యువాత పడగా.. 2015 ఐదుగురు చనిపోయారు. ఏడాదికి భారత ప్రభుత్వం ఈ ప్రాంత గస్తీ కోసం దాదాపు వేల కోట్లు ఖర్చు చేస్తోంది. ఒక్క 2012-13, 2014-15 మధ్యనే రూ.6,566 కోట్లు ఖర్చు చేసింది. వీటిని అక్కడ ఉండే సైనికులకు కావాల్సిన వస్త్రాలు, పర్వాతారోహణ సామాగ్రి ఇతర వస్తువులకు ఎక్కువగా ఖర్చయ్యేవి. మరో విషయమేమిటంలో సియాచిన్ గ్లేసియర్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఉన్న యుద్ధ క్షేత్రం. ఇక్కడ ఉష్ణోగ్రత మైనస్ 45 డిగ్రీలు మాత్రమే ఉంటుంది. ప్రత్యేక చీతా హెలికాప్టర్లు మాత్రమే ఇక్కడికి వెళ్లగలిగి ఆహార సామాగ్రిని చేరవేస్తాయి. ప్రతి సంవత్సరం మూడు బెటాలియన్ల నుంచి 3,000 మంది నుంచి 4 వేలమంది సైనికులు ఇక్కడ భద్రతా సేవలు అందిస్తారు. ఒక్కో బెటాలియన్ మూడు నెలల వరకు ఇక్కడ గస్తీ కాస్తుంది. అయితే,ఇలా ప్రతికూల పరిస్థితులున్నాయని, ప్రాణనష్టం ఎదురవుతుందని అక్కడ నుంచి సైనికులను విరమించుకుంటే దేశ రక్షణ గాలికొదిలేసినట్లవుతుందని, ఇది ఏమాత్రం సురక్షితం కాదని ఇటీవల రక్షణమంత్రి మనోహర్ పారికర్ చెప్పిన మాటలు సరైనవే అని ఆమోదించక తప్పదేమో. -
వీర జవానుకు అరుదైన గౌరవం
న్యూఢిల్లీ: సియాచిన్ ప్రమాదంలో కొన ఊపిరితో బయటపడి చివరకు ప్రాణాలుకోల్పోయిన భారత వీర జవాను లాన్స్ నాయక్ హనుమంతప్పకు అరుదైన గౌరవం దక్కింది. కేంద్ర ఆర్థికశాఖ లాన్స్ నాయక్ హనుమంతప్పకు ఘన నివాళి అర్పించింది. తన ట్విటర్ ఖాతాకు లాన్స్ నాయక్ చాయా చిత్రాన్ని వాల్ పేపర్‌గా ఉంచి అంజలి ఘటించారు. ఈ నెల 3న 19,600 అడుగుల ఎత్తులోని సియాచిన్ యుద్ధ క్షేత్రంలో తమ సైనిక శిబిరంపై భారీ ఎత్తున మంచుకొండ చరియలు విరిగిపడటంతో మొత్తం పదిమంది సైనికులు ఆ శకలాల కిందపడిపోయిన విషయం తెలిసిందే. అయితే, వారిలో హనుమంతప్ప మాత్రమే ఆశ్చర్యపరుస్తూ ఆరు రోజులపాటు మంచు దిబ్బల కింద ఉన్నప్పటికీ ప్రాణాలతో బయటపడ్డాడు. కానీ, అతడి శరీరంలోని పలు అవయవాలు పనిచేయడం ఆగిపోవడం కారణంగా గురువారం ఉదయం ప్రాణాలు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఈ సందర్భంగా దేశం మొత్తం నివాళి అర్పించగా కేంద్ర ఆర్థికశాఖ ట్విట్టర్ ఖాతాకు లాన్స్ నాయక్ ఫొటోను ఉంచి నివాళి అర్పించింది. 'వీర జవాను లాన్స్ నాయక్ హనుమంతప్ప ఇక లేడని వార్తా తీవ్రంగా బాధిస్తోంది. ఆయన కుటుంబం ఈ బాధను తట్టుకోగలిగి ధృడంగా నిలబడాలని కోరుకుంటున్నాను' అని అరుణ్ జైట్లీ అన్నారు. ఈరోజు హనుమంతప్ప అంత్యక్రియలు జరగనున్నాయి. -
సియాచిన్‌లో చిక్కుకుని.. సజీవంగా బయటపడి!
సియాచిన్ ప్రాంతంలో భీకరంగా వచ్చిన మంచు తుపానులో చిక్కుకుని మరణించారని భావించిన పదిమంది భారతీయ సైనికుల్లో ఒకరు సజీవంగా బయటపడ్డారు. మిగిలినవారంతా మరణిచినట్లు నిర్ధారణ అయ్యింది. సియాచిన్ ప్రాంతంలో తాము రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తుండగా. లాన్స్ నాయక్ హనమంతప్ప సజీవంగా కనిపించారని, మిగిలినవాళ్లంతా దురదృష్టవశాత్తు మరణించారని జీఓసీ నార్తరన్ కమాండ్ లెఫ్టినెంట్ జనరల్ డీఎస్ హూడా మంగళవారం తెలిపారు. హనమంతప్ప ఆరోగ్యపరిస్థితి విషమంగానే ఉందని, ఆయనను వెంటనే ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని హూడా చెప్పారు. ఈనెల మూడో తేదీన సియాచిన్ ప్రాంతంలో భారీ మంచుతుపాను వచ్చి టన్నుల కొద్దీ బరువున్న మంచుగడ్డలు పడటంతో వాటి కింద పది మంది భారత సైనికులు చిక్కుకుపోయారు. అప్పటి నుంచి వారిని గుర్తించేందుకు ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్ ముమ్మరంగా ప్రయత్నిస్తూనే ఉన్నాయి.